సింధునాదం.. కృష్ణగానం
సింధునాదం.. కృష్ణగానం
Published Fri, Aug 19 2016 11:41 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
8వ రోజు జిల్లాలో 98వేలకు పైగా భక్తులు
– శ్రీశైలం ఆలయ పోస్టల్ కవర్ ఆవిష్కరణ
– అన్ని ఘాట్లలో మధ్యాహ్నం నుంచి రద్దీ సాధారణం
– 21న సీఎం చంద్రబాబు శ్రీశైలం రాక
– భద్రతా ఏర్పాట్లపై అధికారుల సమీక్ష
శ్రీశైలం: కృష్ణా పుష్కరాల్లో భాగంగా 8వ రోజు శుక్రవారం జిల్లాలోని పుష్కర ఘాట్లన్నీ భక్తులతో కిక్కిరిశాయి. అయితే మధ్యాహ్నానికి పరిస్థితి మారిపోయింది. ఎండ వేడిమి నేపథ్యంలో ఘాట్లలో భక్తుల రద్దీ పలుచబడింది. శ్రీశైలంలోని పాతాళగంగ, లింగాలగట్టు, సంగమేశ్వరం, ముచ్చుమర్రి, నెహ్రూనగర్ ఘాట్లలో మొత్తం 97,025 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారుల అంచనా. ఇదిలాఉంటే పుష్కరాలు ఈనెల 23న ముగుస్తుండటంతో 21వ తేదీన శ్రీశైలానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులతో పాతాళగంగ, లింగాలగట్టు ఘాట్ల వద్ద ఎలాంటి అసౌకర్యం లేకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పాతాళగంగ ఘాట్ రోడ్డు గుంతలమయంగా ఉందని.. సీసీ రోడ్డు వేయాలని దేవస్థానం ఈఓ భరత్‌గుప్తకు సూచించారు.
భద్రతా ఏర్పాట్లపై విస్తత స్థాయి సమీక్ష
సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్ విజయమోహన్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారి డీఐజీ రమణకుమార్, ఎస్పీ రవికృష్ణ, దేవస్థానం ఈఓ భరత్ గుప్తలతో కలిసి భద్రతా ఏర్పాట్లపై సమీక్షా నిర్వహించారు. ఆలయ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ఆక్టోపస్, ఇంటెలిజెన్స్, ఎస్బీ, ఐబీ, ఫైర్, దేవస్థానం, రెవెన్యూ అధికారులతో చర్చించారు. శ్రీశైలంలోని ముఖద్వారం, దోర్నాల, సున్నిపెంటలలో వెహికిల్ స్కానర్లు, బ్యాగ్ స్కానర్లను ఏర్పాటు చేయాలని.. కష్ణానదిలో బోట్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఔట్‌పోస్టుకు ముఖమైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. ఆధార్, ఫొటోగ్రాఫ్ ఐడీ కార్డుల ఆధారంగా వసతి, దర్శనాలు కొనసాగించాలన్నారు. భక్తులకు డ్రస్ కోడ్ తప్పనిసరి చేయాలని.. ఆలయంలో నాలుగు వైపులా వాచ్ టవర్ల నిర్మాణం చేపట్టాలన్నారు. శ్రీశైలానికి.. ఆలయానికి పదే పదే వచ్చే వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు.
Advertisement