సభలో మాట్లాడుతున్న మంత్రి
- ప్రతి ఇంటా నల్లానీరు...ప్రతి తండాకు తారు రోడ్డు
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కూసుమంచి: పాలేరు నియోజకవర్గ రైతులకు త్వరలోనే భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందజేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండలంలోని భగవత్‌వీడు పంచాయతీ శివారు సోమ్లాతండాకు రూ. 1.51 కోట్లతో నిర్మంచనున్న బీటీ రహదారికి మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. భక్తరామదాసు ఎత్తిపోతల పనులు పూర్తికావొచ్చాయని, సాగర్ నీరు పాలేరుకు సాగుకు వదిలితే ఈ ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ కాలువల నుంచి సాగునీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పూర్తికాని ఎస్సారెస్పీ కాలువల తవ్వకం వేగంవంతం చేశామని చెప్పారు.
నియోజకవర్గంలో ప్రతితండాకు రోడ్డుసౌకర్యం కల్పించేందుకు రూ. 57 కోట్లతో 55 రహదారులను మంజూరు చేశామన్నారు. ఏడాదిలోగా ప్రతి తండాకు రోడ్డు, ప్రతి ఊరిలో ఇంటింటికి నల్లాద్వారా నీరు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తిచేస్తామన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలేమున్నా, వాటిని పరిష్కరిస్తానని అన్నారు. ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ... మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హయాంలో పాలేరు నియోజకవర్గం జిల్లాలోనే అభివృద్ధిలో ముందంజలో ఉంటుదని అన్నారు.
ఈ ప్రాంతం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలుస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, మాజీ ఎమ్మెల్యే కొడబాల కోటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ మారుపాక నగేష్, ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు వడ్త్యి రాంచంద్రునాయక్, సర్పంచ్ పడిశాల ఎల్లయ్య, తహసీల్దారు వెంకారెడ్డి, ఎంపీడీఓ విద్యాచందన, టీఆర్‌ఎస్ నాయకులు బత్తుల సోమయ్య, సాధు రమేష్‌రెడ్డి, వీరవెల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.