అతలాకుతలం.. | due to heavy rains farmers are got loss | Sakshi
Sakshi News home page

అతలాకుతలం..

Published Fri, May 9 2014 1:42 AM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM

అతలాకుతలం.. - Sakshi

అతలాకుతలం..

ఖమ్మం, న్యూస్‌లైన్ : రెండు, మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. తడిసిన ధాన్యం, మిర్చి, వేరుశనగ, మొక్కజొన్నలను ఆరబెట్టి, మార్కెట్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగానే.. మళ్లీ గురువారం కురిసిన వర్షం వారిని ఆగమాగం చేసింది. అప్పటివరకు ఎండ తీవ్రంగానే ఉండటంతో పంటలను ఆరబోసిన రైతులు.. అకస్మాత్తుగా మబ్బులు కమ్మి, వర్షం పడడంతో వాటిని కాపాడుకునేందుకు ఉరుకులు.. పరుగులు తీయాల్సి వచ్చింది. అయినా పలుచోట్ల ధాన్యం, ఇతర పంటలు వర్షార్పణం అయ్యాయి. తడిసిన పంటలు రంగు మారితే ఉన్న కాస్త ధర కూడా పతనమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రైతులు తీసుకొచ్చిన పత్తి, మిర్చి, మొక్కజొన్న, వేరుశనగ పంటలను వ్యాపారులు సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్ ప్రాంగణంలోనే నిల్వ చేశారు. అయితే గురువారం కురిసిన వర్షంతో పత్తి, మిర్చి, వేరుశనగ, మొక్కజొన్న పంటలు పూర్తిగా తడిసిపోయాయి. మధ్య యార్డు (మిర్చియార్డు)లో రాశులుగా ఉన్న వేరుశనగ, మొక్కజొన్నల వద్దకు వరద ప్రవాహం రావడంతో అవన్నీ  తడిసి ముద్దయ్యాయి. మార్కెట్ యార్డులో వర్షపు నీరు సక్రమంగా పోయే విధంగా డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో ఆ నీరంతా పంటల మీదుగానే ప్రవహించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
భద్రాచలం మండలంలో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. గాలివాన బీభత్సంతో గన్నేరుకొయ్యపాడు, గన్నవరం ప్రాంతాలలో చెట్లు నేల కూలాయి. నందిగామ లో మూడు విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపేశారు. రోడ్లపై నీరు నిలవడంతో పట్టణంలోని ప్రదాన రహదారులన్నీ జలమయమయ్యాయి.
 
పాలేరు నియోజకవర్గంలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. తిరుమలాయపాలెం మండలం బీరోలు, బంధంపల్లి, జూపెడ, బచ్చోడు, కాకరావాయిలలో కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. కూసుమంచి మండలంలోని పాలేరు, నర్సింహులగూడెం, జుజ్జులరావుపేట, జక్కేపల్లి, పెరకసింగారంలలో అకాల వర్షానికి వరి ధాన్యం, వరి పనలు కొద్దిగా తడిసిపోయాయి.
 
 వైరా, మధిర, కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లోనూ చిరుజల్లులు కురియడంతో ఆరబోసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు. టార్ఫాలిన్లు కప్పి కొందరు పంటలు కాపాడుకున్నప్పటికీ, మరి కొందరు రైతులకు చెందిన ధాన్యం, ఇతర పంటలు తడిసిపోయాయి. వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కల్గింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement