ఐబ్యాంకుకు మృతుని కళ్లను దానం చేస్తున్న తల్లి మంగమ్మ
తల్లిదండ్రుల్లారా క్షమించండి!
Published Sun, Apr 2 2017 10:25 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
- సూసైడ్ నోట్ రాసి ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య
కర్నూలు: ‘‘ తల్లిదండ్రుల ప్రేమను పొందలేకపోయాను.. రెండు సబ్జెక్టులు తప్పిపోయాను.. జీవితంలో ఏమి సాధించలేక పోయాను.. తల్లిదండ్రుల్లారా క్షేమించండి’’ అంటూ సూసైడ్ నోట్‌ను జేబులో పెట్టుకొని ఆదివారం ఉదయం ఎంటెక్ విద్యార్థి కార్తీక్ కుమార్ (22) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కార్తీక్ కుమార్ తండ్రి మల్లికార్జున కడపలో సోషల్ వెల్ఫేర్ విభాగంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. ఈయనకు ఇద్దరు భార్యలు. రెండో భార్య మంగమ్మ లక్ష్మినగర్‌లో నివాసం ఉంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్‌ఎంగా పని చేస్తున్నారు. కార్తీక్ కుమార్ పుల్లా రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఎంటెక్ చదువుతూ.. తల్లి దగ్గరే ఉంటున్నాడు. తండ్రి మల్లికార్జున కడప నుంచి వారానికోసారి వచ్చి పోతుంటారు.
చదువులో కొద్దిగా వెనుకబడటమే కాకుండా రెండు సబ్జెక్టులు ఫెయిల్ అవడంతో అవమాన భారంతో సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకొని ఇంట్లోననే ఫ్యాన్ కొక్కికి తాడుతో ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత తల్లి గమనించి కేకలు వేసేలోగా ఇరుగు, పొరుగు వారు గుమికూడారు. తలుపులు బద్దలు కొట్టి ఉరి నుంచి కార్తీక్ కుమార్‌ను తప్పించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మూడో పట్టణ ఎస్‌ఐ మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్‌పీ ఆకె రవికృష్ణ తలపెట్టిన నేత్రదాన కార్యక్రమాన్ని గురించి ఎస్‌ఐ మల్లికార్జున కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో అతని కళ్లను ఐ బ్యాంకుకు దానం చేశారు.
Advertisement