లాఠీ ఝలిపించి.. లాడ్జీలను మూయించి!
మంగళవారం రాత్రి రంగంలోకి ఎస్పీ
– లాఠీ పట్టుకుని పరుగెత్తించి..
– రాత్రివేళ ట్రాఫిక్‌పై ఉక్కుపాదం
– పలు లాడ్జీల ఆకస్మిక తనిఖీ
– కుప్పలు, తెప్పలుగా కండోమ్‌ల గుర్తింపు
– ఐదు లాడ్జీల సీజ్
కర్నూలు(హాస్పిటల్): ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తుండే జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణకు కోపమొచ్చింది. నగరంలో అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు మంగళవారం రాత్రి స్వయంగా రంగంలోకి దిగారు. స్థానిక కొత్తబస్టాండ్ ప్రాంతంలో రోడ్డుకు అడ్డదిడ్డంగా నిలిపిన వాహనాలను లాఠీ పట్టుకొని తరిమికొట్టారు. తోపుడు బండ్ల వ్యాపారులను మందలించారు. ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వారినీ హెచ్చరించారు. అనంతరం ప్రజలు ఇచ్చిన సమాచారంతో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని లాడ్జీల్లో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వందలాది కండోమ్‌లు ఆయన కంటపడ్డాయి. అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు. రెవెన్యూ అధికారులకు నోటీసులు పంపి, లాడ్జీలను తనిఖీ చేయించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐ నాగరాజరావును ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగేలా వాహనాలను పార్కింగ్ చేయవద్దన్నారు. ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేస్తే జరిమానా విధిస్తామన్నారు. ట్రాఫిక్ పోలీసులు పకడ్బందీగా విధులు నిర్వహించాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. రద్దీ సమయంలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి పోలీస్‌స్టేçÙన్‌ల పరిధిలో స్పెషల్ డ్రై వ్ నిర్వహించాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. ఆయన వెంట డీఎస్పీలు డి.వి.రమణమూర్తి, ఎ.రామచంద్ర, సీఐలు నాగరాజరావు, మహేశ్వరరెడ్డి ఉన్నారు.
ఐదు లాడ్జీలు సీజ్
జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదేశాల మేరకు నాలుగవ పట్టణ సీఐ నాగరాజరావు కొత్తబస్టాండ్ సమీపంలోని మానస, శ్రీలేఖ, శ్రీ ఆంజనేయతో పాటు పేరు లేని మరో రెండు లాడ్జీలను సీజ్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే లాడ్జీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.