
బాలల హక్కుల కోసం ప్రత్యేక చట్టం
సాక్షి, హైదరాబాద్: బాలల హక్కులకు భంగం వాటిల్లకుండా, వారికి మంచి విద్య, ఉజ్వల భవిష్యత్తు అందించేలా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తున్నట్టు కేంద్ర కార్మిక శాఖ సహాయమంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. 14 ఏళ్లలోపు వయసున్న బాలలను పనిలో పెట్టుకున్న ఫ్యాక్టరీలు, దుకాణాల యాజమాన్యాలను జైలుకు పంపేలా ఈ చట్టం ఉంటుందన్నారు. ప్రమాదకర (హజార్డస్) ప్రాంతాల్లో 18 ఏళ్ల లోపు చిన్నారులను పనిలోకి తీసుకోవడాన్ని కూడా నిషేధిస్తూ నిబంధనలను పొందుపరిచామని అన్నారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో స్త్రీ,శిశు సంక్షేమశాఖ నిర్వహించిన బాలల దినోత్సవానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేకించి ఆడపిల్లల రక్షణ, విద్యాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ ‘బేటీ బచావో... బేటీ పడావో’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని చెప్పారు. సమాన హక్కు లు, సరైన అవకాశాలు కల్పిస్తే మగపిల్లల కంటే ఆడపిల్లలే మెరుగ్గా రాణిస్తారన్నారు. ఆడపిల్లలంటే ఆదిలక్ష్మిలుగా భావిస్తానని చెప్పారు. నిర్బంధ విద్యాహక్కు చట్టం పకడ్బందీగా అమలయ్యే లా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చదువుకున్న బాలలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా కార్మికశాఖ తరపున నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
కేంద్ర ం తీరుపై మంత్రి తుమ్మల ఫైర్
సమగ్ర బాలల సంరక్షణ పథకాలకు రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోత విధిస్తోందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆయా పథకాలకు 90 శాతం నిధులు కేంద్రం ఇస్తుండగా, తాజాగా 60 శాతానికి కుదించడంపై రవీంద్రభారతిలో నిర్వహించిన బాలల దినోత్సవ వేదికపైనే అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చినా ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం బాలలను అక్కున చేర్చుకొని వారి అభివృద్ధి కోసం కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన బాలలకు బాలరత్న, బాలసూర్య పురస్కారాలను, నగదు బహుమతులను అందజేశారు. బాలబాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, డెరైక్టర్ ప్రశాంతి, జాయింట్ డెరైక్టర్ శ్యామసుందరి, డిప్యూటీ డెరైక్టర్ రాజ్యలక్ష్మి, జువైనల్ హోమ్స్ ఎండీ శైలజ, జవహర్ బాలభవన్ డెరైక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.