(క్యాబ్‌ను తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ అధికారి )
సాక్షి, సిటీబ్యూరో: విమాన ప్రయాణికుల భద్రతపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే మహిళా ప్రయాణికుల భద్రత కోసం షీ క్యాబ్‌్సను అందుబాటులోకి తెచ్చిన ట్రాఫిక్ పోలీసులు...ఇప్పుడు అనుమతి లేకుండా ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగిస్తున్న క్యాబ్‌లకు అడ్డుకట్ట వేసే దిశగా ముందుకెళ్తున్నారు. పోలీసు అనుమతి తీసుకోకుండా తిరిగే క్యాబ్‌లతో ఇబ్బందికర పరిణామాలు తలెత్తే అవకాశం ఉండటంతో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. శని, ఆది వారాల్లో డ్రైవ్ నిర్వహించి పదుల సంఖ్యలో క్యాబ్‌లను సీజ్ చేస్తున్నారు.
కొన్ని వాహనాలతో ఇబ్బందులు...
వాస్తవానికి విమానాశ్రయం నుంచి ప్రయాణికుల్ని నగరానికి తీసుకెళ్లేందుకు ఇతర ప్రైవేట్ వాహనాల్ని అనుమతించరు. ప్రయాణికులతో ఎయిర్‌పోర్టులో బేరసారాలు సాగించడం నిషేధం అయినా కొందరు వాహన యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు తలనొప్పులకు కారణమవుతున్నారు. గతేడాది నగరంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ముంబై మోడల్‌ను క్యాబ్ డ్రైవర్ తన స్నేహితులతో కలిసి విమానాశ్రయం నుంచి కిడ్నాప్ చేశాడు.
కేపీహెచ్‌బీ ప్రాంతంలోని ఓ ఇంట్లో బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గతంలోనూ ఇలాంటి దురాగతాలు చాలానే జరిగాయి. అందుకే ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్‌ల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి ఆకస్మిక, స్పెషల్ డ్రైవ్‌లు చేపడతామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. అలాగే ఐటీ కారిడార్‌లో తిరిగే క్యాబ్‌లకు ప్రత్యేక నంబర్లు కేటాయిస్తున్నామన్నారు.
రిజిస్ట్రేషన్‌తో మర్యాద....
నిబంధనల ప్రకారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికుల వాహనాలు ఆర్‌జీఐఏ పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇవి ఎయిర్‌పోర్టులో ఏర్పాటుచేసిన ప్రీపెయిడ్ బూత్ చార్జీల ప్రకారమే డబ్బులు తీసుకోవాలి. విమానం దిగిన ప్రయాణికుడు జంటనగరాల్లో వెళ్లాల్సిన ప్రాంతానికి ఎంత చార్జీ అవుతుంతో అక్కడ ప్రీ పెయిడ్ బూత్‌లోనే నిర్ణయిస్తారు. ప్రయాణికుడు అక్కడే డబ్బు చెల్లిస్తే ఓ రసీదు ఇస్తారు. తన గమస్థానానికి చేరాక ప్రయాణికుడు దానిని డ్రైవర్ ఇవ్వాలి.
ఆ రసీదును సదరు డ్రైవర్ ప్రీ పెయిడ్ బూత్‌లో చూపిస్తే చార్జీలు చెల్లిస్తారు. ఇలా చేయడం వల్ల క్యాబ్ డ్రైవర్లు ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేయడాన్ని నిలువరించడంతో పాటు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చేందుకు అవకాశముంది. క్యాబ్‌లు, డ్రైవర్ల పూర్తి వివరాలు ప్రీ పెయిడ్ బూత్‌ల్లో నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి ప్రయాణికులతో మర్యాదగా నడుచుకునేందుకు ఆస్కారముంటుంది. ప్రస్తుతం ఆర్‌జీఐఏ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో విమానాశ్రయంలో నడుస్తున్న ప్రీ పెయిడ్ బూత్‌లో 180 క్యాబ్‌లు రిజిస్టరై ఉన్నాయి. వీటితో పాటు పది నెలల క్రితం అందుబాటులోకి తెచ్చిన షీ క్యాబ్ కూడా మహిళా ప్రయాణికులను గమస్థానాలకు చేరవేస్తున్నాయి.