బాబుది ‘ప్రత్యేక’ మోసం
Published Thu, Sep 8 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
– నేడు హెడ్‌పోస్టాఫీసు ఎదుట ధర్నా
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
కర్నూలు (అర్బన్): ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి సుజనాచౌదరి రోజుకోమాట మారుస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. బుధవారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ అతి«థి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హోదా విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న దొంగ నాటకాన్ని ప్రజలకు వివరించేందుకు ఆందోళనలను ఉద్ధతం చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఈనెల 8వ తేదీన రాష్ట్రంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నామని, కర్నూలులోని హెడ్‌పోస్టాఫీసు ఎదుట ఆందోళన ఉంటుందని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదాతో పారిశ్రామిక పరంగా రాష్ట్రం అభివద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని, తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టాలని చూస్తోందన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట మారుస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. విలేకరుల సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి ఎస్‌ఎన్ రసూల్, ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి మనోహర్‌మాణిక్యం, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ లెనిన్‌బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement