కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా
కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా
Published Wed, Aug 17 2016 6:53 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
ఆదిలాబాద్ అర్బన్ : నిత్యావసర వస్తువుల అధిక ధరలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, తదితర అంశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం కలెక్టరేట్ ఎదుట సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎస్. విలాస్ మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో పేద ప్రజలు ఒక పూట భోజనం చేయకుండానే నిద్రిస్తున్నారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ రంగానికి దాసోహమంటూ రాయితీలపై రాయితీలు ఇస్తుందని మండిపడ్డారు. అధిక ధరలతో సతమతకావడమే కాకుండా నిరుద్యోగం, ఆకలి, పేదరికం బారిన పడడం జరుగుతుందని పేర్కొన్నారు. అధిక ధరలను తగ్గించాలని, సార్వత్రిక ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టాలని, ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దొంగ నిల్వదారులు, బ్లాక్ మార్కెట్‌దారులు, కల్తీ వ్యాపారులను కఠినంగా శిక్షించాలని, ఆహార పదార్థాల దిగుమతులు ఆపాలని డిమాండ్ చేశారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిలువరించాలని, గుత్త సంస్థల నియంత్రణ చట్టాన్ని పునరుద్దరించాలని, నల్లధనాన్ని జప్తు చేసి దేశానికి తిరిగి తీసుకురావాలని అనంతరం కలెక్టర్ ఎం.జగన్మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు నళినిరెడ్డి, సీపీఐ ఆదిలాబాద్ పట్టణ కార్యదర్శి అరుణ్ కుమార్, సహాయ కార్యదర్శి లక్ష్మయ్య, నాయకులు దేవేందర్, భాస్కర్, కుంటాల రాములు, గంగారెడ్డి, నందయ్య, నర్సింగ్‌రావు, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
Advertisement