ఉషారాణి ఆత్మహత్యపై ప్రత్యేక కమిటీతో విచారణ
- జిల్లా కలెక్టర్ విజయమోహన్
పాణ్యం: ఇంజినీరింగ్ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్యపై ప్రత్యేక కమిటీని వేశామని, కమిటీకి ఉన్నతస్థాయి మహిళా అధికారాణిని నియమించి నిజనిర్ధారణ చేస్తామని జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్ తెలిపారు. పాణ్యం వద్ద ఆర్‌జీఎం ఇంజినీరింగ్ కళాశాలను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. ర్యాగింగ్ గురించి తల్లిదండ్రులతో చెప్పి ఉన్న ఉషారాణి బతికి ఉండేదన్నారు. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించాలన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఘటన యావత్తు ప్రజలను కదలించివేసిందన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని..ప్రజలు ఏమైనా సమస్యలు వస్తే అందులో నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ర్యాగింగ్ విషయంలో కళాశాల యాజమాన్యాలు కఠినంగా ఉండాలని..అలా లేకుంటే వాటిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం కళాశాల ప్రాంగణాన్ని, ఉషారాణి ఉంటున్న గదిని పరిశీలించారు. అక్కడే ఉన్న విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కళాశాల ఆ గదిలో పనిచేస్తున్న వార్డెన్, స్వీపర్లను విచారించారు. అనంతరం నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డితో కేసుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాల ప్రాంగణంలో కళాశాల యజమానులపై తీవ్రంగా మండిపడ్డారు. ఇదే సమయంలో ఎపీఎస్‌ఎఫ్ నాయకులను లోపలికి రానివ్వకపోవడంతో గేటు ఎక్కేందకు ప్రయత్నించారు. వీలు కాకపోవడంతో పక్కన ఉన్న జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఉషారాణికి న్యాయం జరిగేంత వరకు పోరడాతామని విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు. పాణ్యం సీఐ పార్థసారధిరెడ్డి వారికి సర్దిచెప్పి ధర్నా విరమింపజేశారు.