– పదో తరగతిపై ప్రత్యేక దృష్టి సారించండి
– ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు మరిన్ని పెరగాలి
– విద్యాశాఖ అధికారులకు ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి ఆదేశం
అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యాభివృద్ధి కార్యక్రమాల అమలులో ‘అనంత’ జిల్లా ముందుండాలని ప్రాథమిక విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) ప్రతాప్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం డీఈఓ కార్యాలయంలో డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ, ఏడీలు మోహన్‌రావు, చంద్రలీల, శ్రీరాములు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్, సూపరింటెండెంట్లు, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు, ఇతర సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ అడ్మిషన్లు బాగా జరగాలన్నారు. ఓపెన్ స్కూల్‌పై చాలామందికి అవగాహన లేదని విస్త్రత ప్రచారం నిర్వహించాలని డీఈఓ, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్‌కు సూచించారు.
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన నిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ పెట్టొద్దని ఆదేశించారు. గుర్తింపు లేని పాఠశాలల సమాచారంపై ఆర్జేడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తింపు లేని పాఠశాల జిల్లాలో ఒక్కటీ లేదంటున్నారని మరి గుడిబండలో సెయింట్ మేరీ స్కూల్ అనుమతులు లేకుండా నడుస్తున్న విషయం తెలీదా? అని ప్రశ్నించారు. వెంటనే ఎంఈఓతో ఆర్జేడీ ఫోన్‌లో మాట్లాడారు. సెయింట్ మేరీ స్కూల్‌లో 1–7 తరగతులున్నాయని ప్రభుత్వ గుర్తింపు లేదని ఎంఈఓ స్పష్టం చేశారు. వెంటనే నోటీసులివ్వాలని ఆర్జేడీ ఆదేశాలు ఇచ్చారు.
గుర్తింపు లేని పాఠశాలల్లో చదివితే భవిష్యత్తులో పిల్లలు తీవ్రంగా నష్టపోతారన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠ్యపుస్తకాల పంపిణీ సమాచారాన్ని అడిగారు. అలాగే బాలికలకు సైకిళ్ల పంపిణీకి సంబంధించి 15,562 మంది పిల్లలకు గాను కేవలం 3,369 మందికి మాత్రమే పంపిణీ చేసినట్లు ఆన్‌లైన్ లెక్కలు చెప్తున్నాయన్నారు. తక్కిన పిల్లల పరిస్థితి ఏంటని అడిగారు. అందరికీ పంపిణీ చేశామని డీఈఓ వివరించగా...వెంటనే ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపరిచేలా చూడాలని సూచించారు. కోర్టు కేసులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు.
అన్నింటా ‘అనంత’ ముందుండాలి!
Published Fri, Jul 14 2017 11:10 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM
Advertisement