ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్
ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్
Published Fri, Feb 10 2017 10:28 PM | Last Updated on Mon, Aug 20 2018 5:04 PM
- ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి డిమాండ్
- రాష్ట్ర అధ్యక్షుడిగా టి.జి.భరత్ ఎన్నిక
కర్నూలు(టౌన్): ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పూలబజార్‌లోని చిన్న అమ్మవారి శాలలో ఈ సమితి ఏర్పాటయ్యింది. వివిధ ఆర్యవైశ్య సంఘాలకు చెందిన నాయకులు సాధన సమితికి నూతన అధ్యక్షుడిగా టి.జి.భరత్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లోగోను ఆవిష్కరించారు. డిమాండ్లతో కూడిన కరపత్రాలను సమావేశంలో విడుదల చేశారు. వివిధ ఆర్యవైశ్య సంఘాలు టీజీ భరత్‌ను ఘనంగా సన్మానించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీజీ భరత్ మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆర్యవైశ్యులను మాత్రం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్యవైశ్యుల్లో ఐకమత్యం లేకపోవడం వల్లే ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయన్నారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి హక్కుల సాధన కోసం గాంధీ మార్గాన్ని ఎంచుకుంటామని ప్రకటించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటిస్తూ సమితిని జిల్లాస్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. చిరు వ్యాపారులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి పేద ఆర్యవైశ్యునికి ప్రభుత్వం ఉచిత గృహం నిర్మించాలన్నారు. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో టి.జి.శివరాజు, మార్కెట్ యార్డు చైర్మన్ శమంతకమణి, శ్రీశైలం ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్ ఇమ్మిడిశెట్టి కోటేశ్వరరావు, కాశీ అన్నపూర్ణ సత్రం అధ్యక్షులు వై.బాలకృష్ణ, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు, అవోపా నాయకులు రత్నప్రసాద్, వాసవీ సేవాదళ్, వాసవీ క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు, ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పత్తి ప్రసాద్, శేషగిరి శెట్టి, సుబ్రహ్మణ్యం, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఏర్పాటు
ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి సమావేశం అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైన టి.జి.భరత్‌తో పాటు ప్రధాన కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య, కోశాధికారి తిరుపాల్ బాబు, జిల్లా అధ్యక్షుడు ఇల్లూరు సుధాకర్, కర్నూలు పట్టణ అధ్యక్షుడు సోమిశెట్టి నవీన్, పట్టణ ప్రధాన కార్యదర్శిగా లగిశెట్టి కిరణ్‌లను ఎన్నుకున్నారు.
Advertisement