ఫుట్‌పాత్ ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్
– పగటిపూట నగరంలోకి భారీ వాహనాల నిషేధం
– నగర పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్ష
కర్నూలు : కర్నూలు నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఫుట్‌పాత్ ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. నగరంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపుల ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్న వ్యాపారుల దుకాణాలను మున్సిపల్ అధికారుల సహకారంతో తొలగించేందుకు కార్యాచరణ రూపొందించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఎస్పీ గోపీనాథ్ జట్టి నగర పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డీఎస్పీలు రమణమూర్తి, వినోద్‌కుమార్, ట్రాఫిక్ సీఐ దివాకర్‌రెడ్డి, ఎస్‌ఐ తిమ్మారెడ్డి, ఆర్‌ఎస్‌ఐ జయప్రకాష్‌లతో సమావేశం నిర్వహించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
ప్రధాన జంక్షన్లలో రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్ ఏర్పాటు, ఫ్రీ లెఫ్ట్, ఫ్రీ రైట్ (కుడి, ఎడమ మలుపులు) డివైడర్స్‌ను రీ డిజైనింగ్ చేయించాలని నిర్ణయించారు. పగటి పూట నగరంలోకి భారీ వాహనాలు ప్రవేశించకుండా నిషేధం అమలు చేయనున్నారు. బారీకేడ్లు, రోడ్ సిగ్నల్స్, డైరెక‌్షన్ బోర్డులు, నో పార్కింగ్ బోర్డులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయించాలని ట్రాఫిక్ పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. డ్రైవింగ్ లైసెన్ లేకుండా వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. ఎక్కడ పడితే అక్కడ పార్కింగే చేసే వాహనదారులకు జరిమానా విధించాలని సూచించారు.