పుష్కర బాధ్యులు వీరే..! | special officers for pushkaras | Sakshi
Sakshi News home page

పుష్కర బాధ్యులు వీరే..!

Published Tue, Aug 2 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

special officers for pushkaras

– శ్రీశైలం ఓవరాల్‌ ఇన్‌చార్జిగా ఈవో భరత్‌ గుప్త 
– సంగమేశ్వరం ఓవరాల్‌ ఇన్‌చార్జిగా జేసీ హరికిరణ్‌
– కంట్రోల్‌ రూముల్లో 19 మంది అధికారులు 
– ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌
 
కర్నూలు(అగ్రికల్చర్‌):
కృష్ణా పుష్కరాలను విజయవంతం నిర్వహించడంలో భాగంగా జిల్లాకలెక్టర్‌ సి.హెచ్‌.విజయమోహన్‌ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఘాట్లు, పార్కింగ్‌ స్థలాలు, వసతులు తదితర వాటిని విభజించి వాటికి జిల్లాస్థాయి అధికారులను, ఏరియా ప్రత్యేక అధికారులను, ప్లేస్‌ అధికారులను నియమించారు. వారి విధులు, బాధ్యతలను వివరించారు. వీరంతా ఈనెల 8వ తేదీ నుంచి ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ మేరకు ప్రొసీడింగ్‌ ఇచ్చారు. ప్రధానంగా శ్రీశైలంపై దృష్టి సారించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. పుష్కరాలు విజయవంతం కావడంలో ఏరియా ప్రత్యేక అధికారి, ప్లేస్‌ అధికారుల పాత్ర ఎంతో ఉంటుంది. వీరికి శిక్షణ  కార్యక్రమాలు కూడా నిర్వహించారు. 
శ్రీశైలం 
శ్రీశైలం దేవస్థానం ఓవరాల్‌ ఇన్‌చార్జి ఆఫీసర్‌గా దేవస్థానం కార్యనిర్వహణాధికారి నారాయణ భరత్‌ గుప్తను నియమించారు. అక్కడ ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఇది నంద్యాల ఎస్‌ఆర్‌బీసీ ప్రత్యేక ఉప కలెక్టర్‌ నాగరాజు ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో పోలీసు, ఇరిగేషన్, మత్స్య శాఖ, ఫైర్, మెడికల్‌ అండ్‌ హెల్త్, దేవదాయ శాఖ, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ అధికారులు, సమాచార శాఖ డీడీ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్‌(శానిటేషన్‌), విద్యుత్, కమ్యూనికేషన్, వికలాంగుల శాఖ ఏడీ, రవాణా, ఆర్టీసీ, ఎకై ్సజ్‌ సివిల్‌ సప్లయ్‌ అండ్‌ ధరల నియంత్రణ అధికారులు, ప్రొటోకాల్‌ అధికారులు ఉంటారు. 
పార్కింగ్‌ ప్లేస్‌లు 
 శ్రీశైలంలో పార్కింగ్‌ ప్లేస్‌లను ఐదింటిని ఏర్పాటు చేసి వాటికి జిల్లా అధికారులను ఏరియా ప్రత్యేక అధికారులను నియమించారు. పార్కింగ్‌ ప్లేస్‌–1 ప్రత్యేక ఏరియా అధికారిగా జిల్లా సహకార అధికారి, పార్కింగ్‌ ప్లేస్‌–2 ప్రత్యేక అధికారిగా పట్టు పరిశ్రమ శాఖ డీడీ, పార్కింగ్‌ ప్లేస్‌–3 చేనేత జౌళి శాఖ ఏడీ, పార్కింగ్‌ ప్లేస్‌–4కు సర్వశిక్ష అభియాన్‌ పీఓ, పార్కింగ్‌ ప్లేస్‌–5కు నంద్యాల ఉద్యాన శాఖ ఏడీని ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరు ఓవరాల్‌గా పర్యవేక్షిస్తుండగా వీరికి సహాయకంగా ప్లేస్‌ అధికారులు ఉంటారు. 
పుష్కర నగర్‌... 
శ్రీశైలంలో పుష్కర నగర్లు మూడు ఏర్పాటు అయ్యాయి. ఇందులో స్త్రీలు, పురుషులకు ప్రత్యేక వసతులు ఉంటాయి.  ఒకటో పుష్కర నగర్‌కు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ, రెండో పుష్కర నగర్‌కు జిల్లా విద్యాశాఖాధికారి, మూడో పుష్కర నగర్‌కు హౌసింగ్‌ పీడీలను ప్రత్యేక ఏరియా అధికారులుగా నియమించారు. 
ఘాట్‌ ఇన్‌చార్జి... 
మల్లికార్జున ఘాట్‌ (పాత)కు మైనార్టీ కార్పొరేషన్‌ ఈడీ, భ్రమరాంబిక ఘాట్‌(కొత్త)కు వ్యవసాయ శాఖ జేడీ, హోల్డింగ్‌ ఏరియా–1(మల్లికార్జున ఘాట్‌ వెనుక)కు బీసీ కార్పొరేషన్‌ ఈడీ, హోల్డింగ్‌ ఏరియా–2(భ్రమరాంబిక ఘాట్‌ వెనుక)కు బీసీ సంక్షేమ అధికారి, రోప్‌ వేకు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి, లింగాల ఘాట్‌కు డ్వామా పీడీ, లో లెవల్‌ లింగాల ఘాట్‌కు మెప్మా పీడీ, పాలధార, పంచధారకు జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం, సాక్షి గణపతికి మార్కెటింగ్‌ శాఖ ఏడీ, సున్నిపెంటలోని పుష్కర నగర్‌కు గనుల శాఖ ఏడీ, భ్రామరీ కళామందిరం, శివదీక్ష శిబిరాలకు శ్రీశైలం జేఈఓ, దేవస్థానం ఏరియాకు జెడ్పీ సీఈఓలను ఏరియా స్పెషల్‌ అధికారులుగా నియమించారు. వీరికి సహాయకంగా గజిటెడ్‌ అధికారులను నియమించారు. 
సంగమేశ్వరం... 
సంగమేశ్వరం ఓవరాల్‌ ఇన్‌చార్జి ఆఫీసర్‌గా జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ వ్యవహరిస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే కంట్రోల్‌ రూమ్‌ హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌–4 స్పెషల్‌ డిప్యుటీ కలెక్టర్‌ మల్లికార్జున నేతత్వంలో పనిచేస్తుంది. ఇందులో శ్రీశైలంలోని కంట్రోల్‌ రూమ్‌లో ఉంటున్న విధంగానే 18 శాఖల ద్వితీయ స్థాయి అధికారులు ఉంటారు.
సంగమేశ్వర నగర్‌...
దీనికి ఏరియా ప్రత్యేక అధికారిగా శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్‌ వ్యవహరిస్తారు. ఇందులోనే పార్కింగ్‌ ప్లేస్, స్త్రీలు, పురుషుల వసతి, క్లాక్‌రూము, ఫుడ్‌ కోర్టు, అన్నదాన సత్రం, డ్వాక్రా ఉత్పత్తులు, పూజా సామాగ్రి లభిస్తాయి. పార్కింగ్‌ ప్లేస్‌కు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌–3 స్పెషల్‌ డిప్యుటీ కలెక్టర్‌ ప్రత్యేక అధికారిగా ఉంటారు. ఒక్కోదానికి విడివిడిగా ప్లేస్‌ అధికారులను నియమించారు.
బీమానగర్‌...
బీమా నగర్‌ పర్యవేక్షణ అధికారిగా జేసీ–2 రామస్వామి వ్యవహరిస్తారు. ఇందులో వీఐపీ సిబ్బంది వాహనాల పార్కింగ్, సిబ్బంది వసతి, సిబ్బంది క్యాంటీన్, క్లాక్‌రూము, 10 బెడ్స్‌ ఆసుపత్రి, వీఐపీలకు వాటర్‌ప్రూఫ్‌ పందిళ్లు (వంద మందికి తగ్గట్లుగా) ఫుడ్‌ కోర్టు ఉంటాయి.
ఘాట్‌ ఏరియా... 
ఘాట్‌ ఏరియా ప్రత్యేక అధికారిగా కర్నూలు ఆర్‌డీఓ వ్యవహరిస్తారు. ఇందులో సంగమేశ్వరం ఘాట్, పిండ ప్రదానం ఘాట్, దుస్తులు మార్చుకునే గదులు, పూజాసామాగ్రి, పిండ ప్రధాన సామాగ్రి స్టాల్స్, వీవీఐపీ ఘాట్, లలితాదేవి ఘాట్‌లు ఉంటాయి. వీవీఐపీ ఘాట్‌ ప్రత్యేక అధికారిగా ప్యాపిలి ఎంపీడీఓను నియమించారు. 
దేవస్థానం ఏరియా...
టెంపుల్‌ ఏరియా ప్రత్యేక అధికారిగా కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డిప్యుటీ కలెక్టర్‌ వ్యవహరిస్తారు. ఇందులో లో లెవల్‌ ఘాట్, పిండ ప్రదాన ఘాట్, ఆలయం ఉంటాయి. ప్రతి విభాగానికి ప్లేస్‌ అధికారి ఉంటారు. మొత్తంగా పుష్కరాలకు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులందరినీ వినియోగిస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement