అన్నపూర్ణాదేవిగా భద్రకాళి అమ్మవారు
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉదయం నాలుగు గంటలకు నిత్యాహ్నికం, సుప్రభాత పూజలు చేశారు. అనంతరం అమ్మవారి స్నపనమూర్తిని అన్నపూర్ణగా అలంకరించి బ్రహ్మచారిణి క్రమంలో పూజలు జరిపి మకర వాహనంపై ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ముఖ్యార్చకులు చెప్పెల నాగరాజుశర్మ , పార్నంది నర్సింహామూర్తి, పాలకుర్తి నర్సింహమూర్తి, టక్కరసు సత్యం ఆగమార్చన విధులు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు అమ్మవారి స్నపనమూర్తికి దేవజా క్రమంలో పూజలు నిర్వహించి చంద్రప్రభ వాహనంపై ఊరేగించారు. రాత్రి 9 గంటలకు మహాపూజ, కుమారీ, సువాసినీ పూజలు మహా నీరాజన మంత్రపుష్పము నిర్వహించారు. కాగా, మధ్యాహ్నం వేళలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఇదిలా ఉండగా, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, కేంద్ర సమాచారశాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.అంజనీదేవి, సూపరింటెండెంట్ అద్దంకి విజయ్‌కుమార్, సిబ్బంది కూచన హరినా«థ్, కొత్తపల్లి వెంకటయ్య, అలుగు కృష్ణ, ఆశోక్, చింత శ్యాంసుందర్ పాల్గొన్నారు. కాగా, సోమవారం చంద్ర ఘంటాక్రమంలో పూజలు నిర్వహించి అమ్మవారిని గాయత్రీగా అలంకరించనున్నారు.