ప్రత్యేక చట్టం అవసరం | special should be needed | Sakshi
Sakshi News home page

ప్రత్యేక చట్టం అవసరం

Published Wed, Oct 28 2015 2:28 AM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM

special should be needed

► ప్రభుత్వానికి ప్రతిపాదించిన ‘షీ టీమ్స్’ అధికారులు
► తమిళనాడు తరహా ముసాయిదా సమర్పణ
► ఈవ్‌టీజర్ల ఆట కట్టించేలా రూపకల్పన
► న్యాయ మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైలు


 సాక్షి, హైదరాబాద్: రోడ్లపై పోకిరీల మొదలు అదును చూసి కాటేస్తున్న నయవంచకుల వరకు.. ఎందరో మృగాళ్ల బారినుంచి అతివల్ని రక్షిస్తున్నాయి షీ టీమ్స్ ఈ టీమ్స్ అమలులోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటికే గణనీయమైన ఫలితాలు సాధిస్తున్న ఈ బృందాల పని తీరును మరింత మెరుగుపరచడంతో పాటు మహిళలకు పూర్తి స్థాయి భరోసా ఇవ్వడానికి ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈవ్‌టీజర్లకు కఠిన శిక్షలు పడేలా చేయడానికి ప్రత్యేక చట్టం అవసరమని నిర్ణయించారు. తమిళనాడు తరహాలో రూపొందించిన ‘తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ఈవ్ టీజింగ్ యాక్ట్’ ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పించారు.
 చిక్కుతున్నా చిన్న కేసులే: బహిరంగ ప్రదేశాల్లో మహిళ ల్ని వేధిస్తున్న పోకిరీలను నిత్యం ‘షీ టీమ్స్’ పట్టుకుంటున్నా... తీవ్రత, ఆధారాలు ఉంటే తప్ప అందరి పైనా ఐపీసీతో పాటు నిర్భయ, యాంటీ ర్యాగింగ్ యాక్ట్‌ల ప్రకారం కేసులు నమోదు చేయడం సాధ్యం కావట్లేదు. దీంతో ఏడాదిలో సీసీఎస్ ఆధీనంలోని ‘షీ టీమ్స్’కు చిక్కిన 281 మందిలో 126 మందిపై చిన్న (పెట్టీ) కేసులు, నామమాత్రపు జరిమానాతో సరిపెట్టాల్సి వచ్చింది. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ రెండోసారీ చిక్కిన ఓ వ్యక్తితో పాటు తీవ్రమైన స్థాయిలో రెచ్చిపోయిన వారిపైనే కేసులు నమోదు చేయగలిగారు.
 ప్రత్యేకంగా ఉంటేనే...
 ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న సీసీఎస్ ఉన్నతాధికారులు ఈవ్ టీజర్లను పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి ప్రత్యేక చట్టం అవసరమని భావించారు. దీంతో పలు ప్రాంతాల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేశా రు. చివరకు తమిళనాడులో ఉన్న చట్టం ఉపయుక్తంగా ఉందని నిర్థారించారు. ఈవ్ టీజింగ్ బారినపడి పలువురు అతివలు గాయపడటం, కొందరు మరణించడం సైతం జరగడంతో అక్కడి సర్కారు 1998లోనే ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ ఏడాది జూలై 30 ఆర్డినెన్స్ రూపంలో, కొన్ని నెలలకే చట్టంగా అమలులోకి వచ్చిన ఈ యాక్ట్ మంచి ఫలితాలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అక్కడి చట్టంలోని అంశాలతో పాటు మరికొన్ని అంశాలను చేరుస్తూ ఉన్నతాధికారులు ఓ ముసాయిదా రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ప్రస్తుతం న్యాయ మంత్రిత్వ శాఖ వద్ద ఈ ఫైల్ పెండింగ్‌లో ఉంది.
 ముసాయిదాలో ముఖ్యాంశాలివీ...  
1. బహిరంగ ప్రదేశాలు, పని చేసే ప్రాంతాలు, మాల్స్... ఇలా ఎక్కడైనా ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతూ చిక్కిన పోకిరీలపై నేరం నిరూపణైతే ఏడాది జైలు లేదా రూ.10 వేల జరిమానా లేదా రెండూ పడతాయి.
2. ఈవ్‌టీజింగ్ చేయడానికి పోకిరీలు వాహనాలు ఉపయోగిస్తే వాటిని పోలీసులు స్వాధీనం చేసుకోవచ్చు
3. దేవాలయాలతో పాటు మాల్స్, సినిమా హాల్స్, విద్యాసంస్థలు తదితర చోట్ల జరిగే ఈవ్ టీజింగ్‌ను నిరోధించాల్సిన బాధ్యత వాటి నిర్వాహకులపై ఉంటుంది. అలాంటి సమాచారాన్ని తక్షణం సంబంధిత పోలీసులకు చేరవేయాల్సిందే.
4. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే ఆ నేరానికి యాజమాన్యాలనూ బాధ్యుల్ని చేయవచ్చు. వీరికి న్యాయస్థానం జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement