
ప్రత్యేక హోదా లేకపోతే ఉద్యోగాలు ఎలా?
AIYF, applications, unemployees
నిరుద్యోగభృతి, దరఖాస్తులు, ఏఐవైఎఫ్
మొగల్రాజపురం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోతే యువతకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి కల్పిస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐౖవైఎఫ్) నగర కార్యదర్శి పి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని, లేదంటే నిరుద్యోగులకు రూ.2వేలు నిరుద్యోగభృతి ఇస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలని కోరుతూ గురువారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సిద్ధార్థ జంక్షన్‌లో నిరుద్యోగభృతి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం జరిగింది. ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని చెప్పిన బీజేపీతో కలిసి కేంద్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి బీజేపీపై ఒత్తిడి తీసుకురాకపోవడం సరికాదన్నారు. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలను తీసివేస్తున్నారన్నారు. తెలంగాణాల్లో గ్రూప్,1,2,3,4లకు నోటిఫికేషన్లు జారీ చేస్తుంటే మన రాష్ట్రంలో ఆ నోటిఫికేషన్ల ఊసే లేదన్నారు. ప్రతి విషయంలో తెలంగాణాతో పోటీ పడుతున్న చంద్రబాబునాయుడు ఉద్యోగాల భర్తీ విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నాడని ప్రశ్నించారు. ఎంబీఏ గోల్డ్‌మెడలిస్ట్ పొందిన వారికి కూడా ఉద్యోగాలు కల్పించలేని స్థితిలో పాలకులు ఉన్నారన్నారు. సేకరించిన దరఖాస్తులన్నింటిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సమాఖ్య ఏడో డివిజన్ అధ్యక్షుడు ఆర్.ప్రకాశరావు, కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ఎ.రాము, సూరిబాబు,నూకరాజు, కె.విజయ్‌లతో పాటుగా సి.పి.ఐ. డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.