-
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స వెల్లడి
-
16న గుంటూరులో యువభేరి
-
వేదిక : నల్లపాడు రోడ్డులోని మిర్చి యార్డు పక్కన
-
సమయం : ఉదయం 11 గంటల నుంచి మ«ధ్యాహ్నం 2 గంటల వరకు
-
సదస్సు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన నేతలు
-
సదస్సుకు పెద్ద ఎత్తున విద్యార్థులు, పెద్దలు, మేధావులు తరలిరావాలని పిలుపు
సాక్షి, అమరావతి బ్యూరో : ఎన్ని ఇబ్బందులు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక హోదా సాధన కోసం కృతనిశ్చయంతో కృషిచేస్తామని, హోదా సాధించి తీరుతామని ఆ పార్టీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గుంటూరు నగరంలో యువభేరి సదస్సు జరిగే నల్లపాడు రోడ్డు, మిర్చి యార్డు సమీపంలో ఉన్న ప్రాంతాన్ని సోమవారం సాయంత్రం ఆయన జిల్లా ఎమ్మెల్యేలు, నేతలతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సదస్సు జరుగుతుందని చెప్పారు. సదస్సుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదు...
ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వివిధ సందర్భాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఏవిధంగా ఒత్తిడి తెచ్చిందీ సోదాహరణలతో బొత్స వివరించారు. యువభేరిల ద్వారా ప్రత్యేక హోదా అంశాన్ని పలు దఫాలుగా ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. అధికారంలో ఉన్న టీడీపీ ప్రత్యేక హోదా విషయంలో ఏ పాత్ర పోషించిందో.. ఏవిధంగా శల్య సారథ్యం వహించిందో అందరికీ తెలిసిందేనన్నారు. ప్రత్యేక హోదా విషయమై రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెడితే మాకు అక్కరలేదంటూ పార్టమెంట్, రాజ్యసభలో హోదాకు వ్యతిరేకంగా టీడీపీ ఓటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని, ప్యాకేజీ వస్తే చాలునని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలతో కలిసి బేషరతుగా, అవమానాలను దిగమింగి పనిచేస్తామని వివరించారు. రాజకీయ స్వార్థంతో బీజేపీ, టీడీపీ ప్రత్యేక హోదాకు తూట్లు పొడుస్తున్నాయని తెలిపారు.
విజయవంతం చేయాలని పిలుపు...
ప్రత్యేక హోదాపై నిర్వహిస్తున్న యువభేరి సదస్సుకు విద్యార్థులు, యువత, పెద్దలు, మేధావులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బొత్స పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా నేతలతో యువభేరి ఏర్పాట్లపై పార్టీ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, షేక్ మొహమ్మద్ ముస్తఫా, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ మేరుగ నాగార్జున, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ విద్యార్థి విభాగం నాయకులు సలాం బాబు, రాష్ట్ర కార్యదర్శులు శ్రీకృష్ణదేవరాయలు, మెట్టుపల్లె రమేష్, నియోజకవర్గ ఇన్‌చార్జిలు కావటి మనోహర్‌నాయుడు, అన్నాబత్తుని శివకుమార్, హెనీ క్రిస్టినా, పార్టీ నేతలు కిలారి రోశయ్య, అంగడి శ్రీనివాసరావు, డైమండ్‌బాబు, నూనె ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు
అనుమతి కోసం వినతిపత్రం...
యువభేరి స్థల పరిశీలన అనంతరం పార్టీ నేతలు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. 16న జరిగే కార్యక్రమానికి అనుమతి కోసం వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. ఎస్పీ త్రిపాఠి అందుబాటులో లేకపోవడంతో క్యాంపు కార్యాలయంలో సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు.