కాడెద్దులు కనుమరుగేనా!
-పదేళ్లలో గణనీయంగా తగ్గిన ఎడ్లు
వాటి స్థానంలో ట్రాక్టర్లు, రోటావేటర్లు
రాయవరం : ఒకనాడు వ్యవసాయంలో కాడెద్దులున్న రైతుకు ఎంతో దన్నుగా ఉండేది. పొలాలు దున్నాలన్నా, పంటలు ఇంటికి చేరాలన్నా వాటి అవసరం ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం జత ఎద్దులు కొనాలంటే రూ.లక్ష వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఇదే సమయంలో కాడెద్దుల స్థానంలో ట్రాక్టర్లు, కోత యంత్రాలు, రోటావేటర్లు పొలాల్లో దర్శనమిస్తున్నాయి. పల్లెల్లో ఎక్కడో ఒకరిద్దరు రైతుల వద్దే కాడెద్దులు కనిపిస్తున్నాయి.
తగ్గిపోతున్న దేశవాళీ పశువులు..
పశు సంవర్ధక శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో పదేళ్ల కిందట దేశవాళీ పశువులు మూడు లక్షల దాకా ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 89,104కు పడిపోయింది. ఇందులో ఎద్దుల సంఖ్య కేవలం 3,154 మాత్రమే. దేశవాళీ పశువుల స్థానంలో హెచ్‌ఎఫ్, జెర్సీలాంటి పాలిచ్చే ఆవుల సంఖ్య పెరిగింది. యాంత్రీకకరణ నేపథ్యంలో రైతులు యంత్రాలనే ఎక్కువ వినియోగిస్తున్నారు. పశువులను మేపడం కూడా భారంగా మారడంతో ఎద్దుల వినియోగాన్ని తగ్గించేశారు. పాల ఆవుల సంఖ్య పెరిగే కొద్దీ కోడెలు, గిత్తలు, ఎద్దుల సంఖ్య క్రమేపీ తగ్గిపోయింది. ముఖ్యంగా ట్రాక్టర్లతోనే వ్యవసాయ పనులు జరుగుతుండడంతో ఎద్దుల అవసరం తగ్గింది. ప్రస్తుతం కేవలం మెట్ట, ఏజెన్సీ ప్రాంతంలో మాత్రమే కాడెద్దుల వినియోగం కనబడుతోంది.
పెరిగిన రేట్లు
కాడెద్దుల సంఖ్య తగ్గిపోవడంతో వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. మంచి కాడెద్దుల జోడు కొనాలంటే రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకూ వెచ్చించాల్సి వస్తోంది. అవి కూడా ద్రాక్షారామ, పిఠాపురం, గొల్లప్రోలు, ద్వారపూడి, గోకవరం, రామవరం వారపు సంతల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంకా యాంఽత్రీకరణ జరగని ఉత్తరాంధ్ర జిల్లాల రైతులే కాడెద్దులు కొంటున్నారు.