గంటాకు గుదిబండేనా!
⇒వివాదాల శాఖ వద్దన్నా పట్టించుకోని బాబు
⇒పదవి పదిలమే కానీ.. ప్రాధాన్యత శూన్యం
⇒సీనియర్ కోటాలో కీలక శాఖ ఆశించిన గంటా
⇒పదవి కొనసాగింపే ఎక్కువన్నట్టు టీడీపీ అధినేత కలరింగ్
⇒వ్యూహాత్మక మౌనంలో గంటా శిబిరం
ఓడినోడు అక్కడే బాధపడితే.. గెలిచినోడు ఇంటికెళ్లి బాధపడతాడన్న చందంగా తయారైంది మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి. మంత్రి పదవి పదిలంగా ఉందన్న సంతృప్తి కంటే నిరంతర వివాదాలకు నెలవైన విద్యా శాఖను వదిలించుకోవాలన్న ఆయన ప్రయత్నాలకు అధినేత చెక్ పెట్టారు. మానవ వనరులు కాకుండా మరో కీలక శాఖ ఇవ్వాలని గంటా చాన్నాళ్లుగా కోరుతున్నారు. కేబినెట్ పునరవ్యవస్థీకరణ సందర్భంగా తన కోరిక నెరవెరుతుందనుకున్న ఆయనకు అనూహ్య పరిణామాలే ఎదురయ్యాయి. విద్యాశాఖపరంగా.. తన ఆస్తులపరంగా ఇటీవలి కాలంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గంటాను పదవిలో కొనసాగించడమే గొప్ప అన్న ప్రచారం కల్పించారు. చివరికి ఎటువంటి మార్పు లేకుండానే వదిలి పెట్టడం ద్వారా ఉదారంగా వ్యవహరించారన్న కలరింగ్ ఇచ్చారు.
విశాఖపట్నం : గత ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన గంటా శ్రీనివాసరావు తనతో పాటు తన వర్గ నేతలను గెలిపించుకున్నారు. దాంతో ఆయనకు కీలక శాఖతో కూడిన మంత్రి పదవి వస్తుందని అందరూ లెక్కలు వేశారు. అయితే చంద్రబాబు అనూహ్యంగా విద్యాశాఖ కట్టబెట్టారు. వాస్తవానికి ఆ శాఖను జూనియర్ మంత్రులకు కేటాయిస్తారు. కానీ చంద్రబాబు ఇక్కడే రాజకీయ చతురత చూపించారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలను కలిపి మానవవనరుల శాఖగా మార్చి గంటాకు కట్టబెట్టారు. నవ్యాంధ్ర తొలి కొలువులో మంత్రిగా ఏదో ఒక శాఖలే అని అప్పటికి సరిపెట్టుకున్న గంటా.. ఆ తర్వాత విద్యా మంత్రిగా తలబొప్పి కట్టే పరిణామాలు ఎదుర్కొన్నారు. వియ్యంకుడైన మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థల తప్పిదాలు, నేరాలను కవర్ చేసే పని మొదలు కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు కళ్లెం వేయలేక, ప్రశ్నాపత్రాల లీకేజీలు అరికట్టలేక తీవ్ర విమర్శల పాలయ్యారు.
విద్యావ్యవస్థ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఎనిమిది, తొమ్మిదో తరగతి ప్రశ్నాపత్రాలు కూడా రోడ్డెక్కాయి. మరోవైపు చంద్రబాబునాయుడు చీటికీ మాటికీ విద్యావ్యవస్థలో మార్పులు కావాలని వ్యాఖ్యానిస్తుండటం, సందర్భం వచ్చినప్పుడల్లా గంటాను తలంటడం వంటి పరిణామాలతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో గంటా శాఖ మార్పుకోరుకున్నారన్న ప్రచారం సాగింది. అయితే ఓ దశలో మంత్రి పదవే ఊడిపోతుందన్న ప్రచారం సాగినప్పటికీ వర్గ సమీకరణల నేపథ్యంలో గంటాను తొలగించే సాహసం చేయలేని చంద్రబాబు శాఖ మార్పు విషయంలో మాత్రం తనదైన శైలి రాజకీయం చూపించారన్న వాదనలు ఉన్నాయి.
తప్పని శిరోభారం: మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో ఏదైనా కీలక శాఖ లేదంటే కనీసం కాంగ్రెస్ హయాంలో చేసిన ఓడరేవులు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖైనా వస్తుందని గంటా ఆశించినట్టు చెబుతున్నారు. అయితే ఆయా శాఖలన్నంటినీ తనవద్దనే ఉంచుకున్న సీఎం చంద్రబాబు గంటాకు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా తీవ్రమైన ఆరోపణలతో శిరోభారంగా మారిన పదవిలోనే కొనసాగించడంతో గంటా శిబిరంలో ఉత్సాహంపై నీళ్లు చల్లినట్టు అయింది. అయితే ఎక్కడా అసంతృప్తి బయటపడకుండా వ్యూహాత్మక మౌనం పాటించాలని గంటా శిబిరం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అయ్యన్న ఖుషీ.. గంటా రాజీ
మరోవైపు జిల్లాలోని సీనియర్ నేత అయ్యన్నను మాత్రం చంద్రబాబు ఖుషీ చేశారనే చెప్పాలి. లోకేష్ కోసం పంచాయతీ రాజ్ శాఖను త్యాగం చేసిన అయ్యన్నకు పునర్వ్యస్థీకరణలో కీలకమైన ఆర్ అండ్ బి శాఖ కట్టబెట్టారు. ఎన్టీఆర్ హయాంలోనూ, గతంలో బాబు హయాంలోనూ ఇదే శాఖ మంత్రిగా వ్యవహరించిన అయ్యన్నకు ముచ్చటగా మూడోసారి ఆర్‌అండ్‌బి అప్పజెప్పడంతో ఆయన వర్గీయులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఇక అయ్యన్న స్వయంగా.. ఇది అరుదైన అవకాశంగా భావిస్తున్నానని మీడియాతో ఆనందం వ్యక్తం చేశారు.
సరిగ్గా ఇక్కడే గంటా మంత్రి పదవి చర్చనీయాంశంగా మారింది. ఎవరు ఔనన్నా కాదన్నా జిల్లాలో గంటా, అయ్యన్నల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందన్నది తిరుగులేని వాస్తవం. ఎప్పటికప్పుడు ఎవరికి వారు పైచేయి సాధించాలని తాపత్రయపడిపోతుంటారు. కానీ కీలకమైన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయానికి వచ్చేసరికి అయ్యన్న.. ఇష్టమైన శాఖతో ఆనందంగా ఉండగా, గంటా మాత్రం తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అలా అలా ముందుకువెళ్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.