భోపాల్‌కు బయలుదేరిన ప్రత్యేక రైలు
Published Fri, Nov 25 2016 1:42 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM
– ఇస్తెమాకు వెళ్లిన కర్నూలు ముస్లింలు
– జెండా ఊపి ప్రారంభించిన హఫీజ్ ఖాన్
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఈనెల 26, 27, 28వ తేదీల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో ముస్లింల భారీ ఇస్తెమా ఉండటంతో కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక ప్రధానితో మాట్లాడి ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలు గురువారం రాత్రి 12 గంటలకు కర్నూలు చేరుకుంది. కర్నూలులో వేలాది మంది ముస్లింలు రైలులో బయలుదేరి వెళ్లారు. రైలు బయలుదేరడానికి ముందు మౌల్వీలు ప్రయాణం సుఖవంతంగా జరగాలని దువా చేశారు. అనంతరం వైఎస్‌ఆర్ సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ జెండా ఊపి రైలు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ముస్లింలను హఫీజ్‌ఖాన్ ఆలింగనం చేసుకుని ఇస్తెమాకు వెళ్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనిషిలో మానవత్వాన్ని పెంచుతాయన్నారు. కార్యక్రమంలో మౌలానా మజరుల్ హక్, రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యుడు మహమ్మద్ పాషా, ఫారుక్ అలీ, నజీర్ అహ్మద్ ఖాన్, మాజీ కార్పొరేటర్ దాదామియ, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు మాలిక్, అన్వర్, షాదిక్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Advertisement