కౌమార దశలో విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ
జేసీ–2 రజనీకాంతరావు
శ్రీకాకుళం పాతబస్టాండ్: కౌమార దశలో విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వల్ల మానసికంగా ఒత్తిడికి దూరంగా ఉంటారని జాయింట్ కలెక్టరు–2 పీ రజనీకాంతరావు తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ఎస్‌ఎస్‌ఏ, వైద్య ఆరోగ్యశాఖ, కళాశాల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 10 నుంచి 19 ఏళ్ల మధ్య ఆడపిల్లలను మానసిక ఒత్తిళ్లు, లింగవివక్షత, బాల్య వివా హాలు, పోషకాహారంలేమి, వేధింపులు వంటివి లేకుండా స్వేచ్ఛగా, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండేవిధంగా సిద్ధం చేయాలని సూచించారు.
దీనికిగాను జిల్లా స్థాయిలో రిసోర్సు పర్సన్లకు ఈ నెలలో శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ఆనక కళాశాల విద్యార్థినులు ఐదుగురిని ఒక గ్రూపుగా చేసి, రెండ్రోజుల పాటు శిక్షణ ఇవ్వాల్సింటుందని పేర్కొన్నారు. వీరు తమ కళాశాలల్లో మిగిలివారికి అవగాహన కల్పిస్తారన్నారు. ప్రధానంగా వ్యక్తిగత పరిశుభ్రత, ఉపాధి అవకాశాలు, మానసిక సంసిద్ధత, ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలు, వంటివి తెలియజేయనున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈ బృందాల వివరాలు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ విద్యామిషన్ పీవో త్రినాథరావు, ఐసీడీఎస్ పీడీ లీలావతి, వైద్యాధికారులు బీ జగన్నాథం, ఎం ప్రవీన్, సిబ్బంది పాల్గొన్నారు.