Adolescent Phase
-
అమ్మాయి చెప్పే మాట వినండోసారి!
యుక్తవయసుకి వచ్చిన ప్రతి అమ్మాయికి ఉండే బాధే ఇది. అందరిదీ ఒకటే బాధ. తీవ్రతల్లోనే తేడా. ఈ బాధ ప్రపంచంలో 176 మిలియన్ల మందిని వేధిస్తోంది. ‘నాకు బాధ ఇంత తీవ్రంగా ఉంది’ అని ఏ అమ్మాయి అయినా అంటే... వెంటనే ‘మాకు మాత్రం లేదా’ అని తేలిగ్గా తీసుకుంటారు. ఆ బాధ ఎలా ఉంటుందో అమ్మకు కూడా తెలుసు. ‘ఈ వయసులో తప్పదమ్మా, భరించాల్సిందే’ అని కూతురికి సర్ది చెబుతుంది. అంతే తప్ప ఇది డాక్టర్‌కు చూపించాల్సిన సమస్య అని ఏ మాత్రం సందేహించదు. అహ్మదాబాద్‌కు చెందిన జాహ్నవి త్రివేదికి పద్నాలుగేళ్ల వయసు నుంచి మొదలైంది ఈ సమస్య. పదిహేనేళ్లపాటు కొనసాగింది. ఈ లోపు నెలకు నాలుగైదు రోజులు స్కూలుకు సెలవు పెట్టక తప్పేది కాదు. డ్రిల్ క్లాసు చేయలేనంటే ‘క్లాసులో అందరూ చేస్తుంటే నీకేంటి’ అని మాస్టర్ తిట్టేవారు. అలాగే డ్రిల్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత హోమ్‌వర్క్ చేసే ఓపిక లేక పడుకుంటే చదువు ఎగ్గొడుతోందని తల్లి చివాట్లు పెట్టేది. కాలేజ్‌కి వెళ్లిన తర్వాత కూడా దాదాపుగా అదే పరిస్థితి. హిస్టీరియా వచ్చినట్లు అరిచేది. కారణం ఏంటో తెలియక డాక్టర్లను సంప్రదిస్తూనే ఉంది. ఆమె దురదృష్టం ఏంటో కానీ జాహ్నవిని పరీక్షించిన ఏ డాక్టరూ అసలు సమస్యను గుర్తించనేలేదు. బంధువులైతే ‘ఈ పిల్ల సమస్యను భూతద్దంలో చూస్తోంది. అనవసరంగా గోల పెట్టి, పెద్దది చేస్తోంది’ అనేవాళ్లు. జాహ్నవి హయ్యర్ ఎడ్యుకేషన్‌కి విదేశాలకు వెళ్లింది. అక్కడ కూడా డాక్టర్లను సంప్రదించింది. ఫలితం మారలేదు. ఈ లోపు ముసలి వాళ్లు ‘పెళ్లయి బిడ్డ కడుపులో పడితే నొప్పి తగ్గిపోతుంది’ అని ఓ ముతక సొల్యూషన్ చెప్పేవాళ్లు. ‘ఈ నొప్పి తగ్గాలంటే నేను ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవాలా’ అని అందరి మీద గయ్‌మని లేచింది జాహ్నవి. ‘ఈ పిల్లకు పిచ్చి పట్టింది’ అని జాహ్నవి అమ్మానాన్నల కంటపడకుండా బంధువులు చెవులు కొరుక్కున్నారు. గూగుల్ చెప్పింది జాహ్నవి తన ఆరోగ్య సమస్య గురించి గూగుల్‌లో సెర్చ్ చేసింది. చేయగా చేయగా తన సమస్య ఎండోమెట్రియోసిస్ అని తెలిసింది. ఆ తర్వాత పరిజ్ఞానంతో మరో డాక్టర్ దగ్గరకు వెళ్లింది. కాకతాళీయమో ఏంటో తెలియదు. తన సమస్య, లక్షణాలు చెప్పగానే ‘ఒకసారి అబ్డామిన్ స్కాన్ చేయిద్దాం’ అన్నారా డాక్టర్. నా సమస్య ‘ఎండోమెట్రియోసిస్ డాక్టర్. దానికి ట్రీట్మెంట్ ఇవ్వండి’ అన్నది జాహ్నవి. ఆశ్చర్యంగా చూస్తున్న డాక్టర్‌తో పదిహేనేళ్లపాటు తాను అనుభవించిన కష్టాలను ఏకరువు పెట్టింది. స్కానింగ్‌లో అదే విషయం నిర్ధారణ అయింది. అమ్మ ఏడ్చింది జాహ్నవి సమస్య ఏమిటో తెలిసిన తర్వాత ఆమె తల్లి భోరున ఏడ్చింది. ఇన్నాళ్లూ పిల్ల ఎంతగా చెబుతున్నా పట్టించుకోలేదని ఆమె మనసు కదిలిపోయింది. బిడ్డ బాధను అర్థం చేసుకోవాల్సిన తల్లిని, ఇలా మొద్దుగా ఉండిపోయానెందుకో’ అని పదే పదే తలచుకుని బాధపడింది. ఇప్పుడు ఆ తల్లీ కూతుళ్లు చెప్పే మాట ఒక్కటే... ‘‘నెలసరి బాధ దాదాపుగా అందరికీ ఉంటుంది. అయితే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. తీవ్రంగా బాధ పడుతున్న వాళ్లు ప్రపంచంలో 176 మిలియన్ల మంది ఉన్నారు. కొందరికి సమస్య తీవ్రంగా ఉండదు. అలాంటి వాళ్లతో పోల్చి నొప్పి తీవ్రంగా ఉన్న పిల్లలను తప్పు పట్టవద్దు. వాళ్ల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దు అని మాత్రమే. -
కౌమారానికి.. కౌన్సెలింగ్..
కౌమార దశ.. పిల్లలు పెద్దలయ్యే దశ. అప్పటివరకు అమ్మచాటు బిడ్డలా ఎదిగిన వారు, ఒక్కసారిగా ఏవో తేలియని ఉద్వేగాలకు లోనవుతారు. ఈ దశలో పిల్లల్లో శారీరకంగా, మానసికంగా అనేక మార్పులొస్తాయి. పిల్లల ఎదుగుదలకు ఇది అత్యం త కీలక దశ. ఇలాంటి సమయంలో వారి అవసరాలు తీర్చగలిగితే, వారి ప్రశ్నలకు తగిన సమాధానాలు, సరైన కౌన్సెలింగ్ ఇవ్వగలిగితే మెరుగైన ఫలితాలొస్తాయని ‘సంగత్’అనే ఎన్జీవో చేపట్టిన ‘సెహర్’(స్ట్రెంగ్తనింగ్ ది ఇవినెడ్స్ బేస్ ఆన్ ఎఫెక్టివ్ స్కూల్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ అడాల్సెంట్ హెల్త్ ప్రోగ్రామ్) ప్రాజెక్టు తెలియజేస్తోంది. బిహార్‌లోని నలంద జిల్లాలో 74 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి ఈ ప్రాజెక్టు అమలు చేశారు. దీని ఫలితాలపై ‘లాన్సెట్’పత్రిక ఇటీవల ఓ కథనం ప్రచురించింది. ప్రాజెక్ట్ అమలు ఇలా.. ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన కౌన్సెలర్లు (సెహర్ మిత్రలు) ఫిర్యాదులు, సూచనలు తీసుకునేందుకు పెట్టెలు ఏర్పాటు చేయడం, విజ్ఞానం కోసం నెలనెలా గోడపత్రిక తీసుకురావడం, ఉద్వేగ–ప్రవర్తనా పరమైన అంశాల్లో.. సామాజిక–ఆహార–విద్యా సంబంధిత విషయాల్లో టీనేజర్ల ఇబ్బందులు తొలగించేందుకు వ్యక్తిగతంగా కౌన్సెలింగ్ ఇవ్వడం వంటి కొన్ని చర్యలు చేపట్టారు. ఇవి మంచి ఫలితాలు ఇచ్చాయని చెబుతున్నారు ‘సెహర్’ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రాచీ ఖండేపార్కర్. పాఠశాలల్లో వేధింపులు–హింసాత్మక చర్యలు తగ్గడం, డిప్రెషన్ లక్షణాలున్న వారిలో అవి తగ్గుముఖం పట్టడం, అమ్మాయిలను చిన్నచూపు చూసే ధోరణిలో కొంతమేర మార్పు రావడం, పునరుత్పత్తి–లైంగిక ఆరోగ్యంపై అవగాహన ఏర్పడటం వంటి సత్ఫలితాలను తాము గమనించామని ఆమె తెలిపారు. పర్యవసానంగా స్కూలుకు రావడానికి పిల్లలు మరింత ఆసక్తి చూపారని ప్రాచీ వివరించారు. ఖర్చూ తక్కువే ప్రాజెక్టులో స్థానికులను భాగం చేస్తే మంచి ఫలితాలొస్తాయని, గ్రామాల్లోని పిల్లలు వారికి మరింత దగ్గరవుతారని భావించిన ప్రాజెక్టు నిర్వాహకులు.. కౌన్సెలింగ్ నిర్వహణపై ఆయా ప్రాంతాల యువతీయువకులకు శిక్షణనిచ్చారు. వారితో పాటు కొంతమంది సుశిక్షితులైన కౌన్సెలర్లు కూడా పాల్గొన్నారు. చదువుకోవాలనే ఆసక్తి లేకపోవడమనేది విద్యార్థుల నుంచి సర్వసాధారణంగా వచ్చే ఫిర్యాదు. సహ విద్యార్థులకు దగ్గర కాలేకపోవడమనేది మరో సమస్య. ఇలాంటి వాటికి మూల కారణాలేంటో వాళ్ల నుంచి తెలుసుకొని పలు కేసులు పరిష్కరించగలిగామని స్థానిక కౌన్సెలర్ రాజీవ్ కుమార్ చెప్పారు. మంచి ఫలితాలు ఇవ్వగల ఇలాంటి ప్రాజెక్టు అమలుకు అయ్యే ఖర్చు తక్కువేనని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు కౌమర దశలో.. దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు కౌమార దశలో ఉన్నవారే. కీలకమైన ఈ దశలో వారి వికాసానికి తోడ్పడేందుకు ప్రభుత్వాలు తగిన కార్యక్రమాలు చేపట్టా ల్సివుంది. 2014లో కేంద్రం తీసుకొచ్చిన ‘రాష్ట్రీయ కిశోర స్వాస్థ్య కార్యక్రమం’ఇందుకు ఉద్దేశించిందే. ఇలాంటి వాటిని సక్ర మంగా అమలు చేసినట్టయితే ‘నలంద’తరహా అనుకూల ఫలితాలను ప్రతిచోటా మనం గమనించవచ్చు. యుక్తవయసు వారికి సరైన కౌన్సెలింగ్ ఇస్తే వారి భవిష్యత్‌ను సరైన దిశలో మళ్లించిన వాళ్లమవుతాం అంటోంది ‘సంగత్’ అనే ఎన్జీవో. -
చనిపోవాలనుకున్నా: నటి సంచలన పోస్ట్
‘‘నిజానికి అది నరకం అన్న సంగతి కూడా నేను గుర్తించలేకపోయా. కొందరు ‘చిన్నపిల్లవేగా నీకేంటమ్మా సమస్య’ అనేవాళ్లు. ఇంకొందరేమో ‘లైఫ్‌లో ఇదొక ఫేజ్ అంతే’ అని చెప్పేవాళ్లు. నాకు రాత్రుళ్లు ఉన్నట్టుండి దిగ్గున మెలకువ వచ్చేది. అప్పటిదాకా నిద్రపోలేదన్న సంగతి గుర్తొచ్చి ఏడుపొచ్చేది. నాలో కోపం ఎందుకు పెరుగుతోందో కూడా ఆలోచించుకోలేకపోయా.. అసహనంతో అన్నం ఎక్కువగా తినడంతో లావైపోయా. చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నా... ప్రతి సందర్భంలోనూ నేను చేసేది కరెక్టే అనిపించేది. అమ్మానాన్నలు, డాక్టర్లు చెప్పేది పనికిరాని విషయంగా అనిపించేది..’ అంటూ తన ఒకప్పటి తన దీనస్థితిని గుర్తుచేసుకున్నారు ‘దంగల్’ ఫేం జైరా వసీం. ఆ స్థితి భయంకరమైన డిప్రెషన్ అని గుర్తించిన తర్వాత కోలుకోవడానికి సమయం పట్టిందని, ఆ మాయదారి జబ్బు ఎప్పుడైనా, ఎవరికైనా ఎదురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. గుండెలు పిండేసే రీతిలో ఈ మేరకు ఆమె రాసిన లేఖ చర్చనీయాంశమైంది. ‘‘పాతికేళ్లు దాటినవాళ్లకే డిప్రెషన్ ఉంటుందని ఎక్కడో చదివా. కానీ అతి తప్పు కౌమార దశ(10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు)లోనూ దాని బారినపడతారు. అందుకు నేనే ఉదాహరణ. నాలుగేళ్ల చికిత్స తర్వాతగానీ కోలుకోలేకపోయా. ఇప్పుడు నా గురించి నేను స్పష్టంగా, ధైర్యంగా ఆలోచించగలనన్న నమ్మకం ఏర్పడింది. కొన్నాళ్లపాటు అన్నింటికీ.. ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నా. రాబోయే పవిత్ర రంజాన్ మాసం అందుకు అనువైనదిగా భావిస్తున్నా. దయచేసి మీ ప్రార్థనల్లో నన్ను గుర్తుచేసుకోండి. ఎత్తుపల్లాల్లో నాకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా నా ఫ్యామిలీకి ఒట్టి థ్యాంక్స్ చెబితే సరిపోదు..’’ అని జైరా పేర్కొన్నారు. జైరా లేఖ యథాతథంగా.. -
కౌమార దశలో విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ
జేసీ–2 రజనీకాంతరావు శ్రీకాకుళం పాతబస్టాండ్: కౌమార దశలో విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వల్ల మానసికంగా ఒత్తిడికి దూరంగా ఉంటారని జాయింట్ కలెక్టరు–2 పీ రజనీకాంతరావు తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ఎస్ఎస్ఏ, వైద్య ఆరోగ్యశాఖ, కళాశాల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 10 నుంచి 19 ఏళ్ల మధ్య ఆడపిల్లలను మానసిక ఒత్తిళ్లు, లింగవివక్షత, బాల్య వివా హాలు, పోషకాహారంలేమి, వేధింపులు వంటివి లేకుండా స్వేచ్ఛగా, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండేవిధంగా సిద్ధం చేయాలని సూచించారు. దీనికిగాను జిల్లా స్థాయిలో రిసోర్సు పర్సన్లకు ఈ నెలలో శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ఆనక కళాశాల విద్యార్థినులు ఐదుగురిని ఒక గ్రూపుగా చేసి, రెండ్రోజుల పాటు శిక్షణ ఇవ్వాల్సింటుందని పేర్కొన్నారు. వీరు తమ కళాశాలల్లో మిగిలివారికి అవగాహన కల్పిస్తారన్నారు. ప్రధానంగా వ్యక్తిగత పరిశుభ్రత, ఉపాధి అవకాశాలు, మానసిక సంసిద్ధత, ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలు, వంటివి తెలియజేయనున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈ బృందాల వివరాలు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ విద్యామిషన్ పీవో త్రినాథరావు, ఐసీడీఎస్ పీడీ లీలావతి, వైద్యాధికారులు బీ జగన్నాథం, ఎం ప్రవీన్, సిబ్బంది పాల్గొన్నారు.