యుక్తవయసుకి వచ్చిన ప్రతి అమ్మాయికి ఉండే బాధే ఇది. అందరిదీ ఒకటే బాధ. తీవ్రతల్లోనే తేడా. ఈ బాధ ప్రపంచంలో 176 మిలియన్ల మందిని వేధిస్తోంది. ‘నాకు బాధ ఇంత తీవ్రంగా ఉంది’ అని ఏ అమ్మాయి అయినా అంటే... వెంటనే ‘మాకు మాత్రం లేదా’ అని తేలిగ్గా తీసుకుంటారు. ఆ బాధ ఎలా ఉంటుందో అమ్మకు కూడా తెలుసు. ‘ఈ వయసులో తప్పదమ్మా, భరించాల్సిందే’ అని కూతురికి సర్ది చెబుతుంది. అంతే తప్ప ఇది డాక్టర్‌కు చూపించాల్సిన సమస్య అని ఏ మాత్రం సందేహించదు. అహ్మదాబాద్‌కు చెందిన జాహ్నవి త్రివేదికి పద్నాలుగేళ్ల వయసు నుంచి మొదలైంది ఈ సమస్య. పదిహేనేళ్లపాటు కొనసాగింది. ఈ లోపు నెలకు నాలుగైదు రోజులు స్కూలుకు సెలవు పెట్టక తప్పేది కాదు.
డ్రిల్ క్లాసు చేయలేనంటే ‘క్లాసులో అందరూ చేస్తుంటే నీకేంటి’ అని మాస్టర్ తిట్టేవారు. అలాగే డ్రిల్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత హోమ్‌వర్క్ చేసే ఓపిక లేక పడుకుంటే చదువు ఎగ్గొడుతోందని తల్లి చివాట్లు పెట్టేది. కాలేజ్‌కి వెళ్లిన తర్వాత కూడా దాదాపుగా అదే పరిస్థితి. హిస్టీరియా వచ్చినట్లు అరిచేది. కారణం ఏంటో తెలియక డాక్టర్లను సంప్రదిస్తూనే ఉంది. ఆమె దురదృష్టం ఏంటో కానీ జాహ్నవిని పరీక్షించిన ఏ డాక్టరూ అసలు సమస్యను గుర్తించనేలేదు. బంధువులైతే ‘ఈ పిల్ల సమస్యను భూతద్దంలో చూస్తోంది. అనవసరంగా గోల పెట్టి, పెద్దది చేస్తోంది’ అనేవాళ్లు. జాహ్నవి హయ్యర్ ఎడ్యుకేషన్‌కి విదేశాలకు వెళ్లింది. అక్కడ కూడా డాక్టర్లను సంప్రదించింది. ఫలితం మారలేదు. ఈ లోపు ముసలి వాళ్లు ‘పెళ్లయి బిడ్డ కడుపులో పడితే నొప్పి తగ్గిపోతుంది’ అని ఓ ముతక సొల్యూషన్ చెప్పేవాళ్లు. ‘ఈ నొప్పి తగ్గాలంటే నేను ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవాలా’ అని అందరి మీద గయ్‌మని లేచింది జాహ్నవి. ‘ఈ పిల్లకు పిచ్చి పట్టింది’ అని జాహ్నవి అమ్మానాన్నల కంటపడకుండా బంధువులు చెవులు కొరుక్కున్నారు.
గూగుల్ చెప్పింది
జాహ్నవి తన ఆరోగ్య సమస్య గురించి గూగుల్‌లో సెర్చ్ చేసింది. చేయగా చేయగా తన సమస్య ఎండోమెట్రియోసిస్ అని తెలిసింది. ఆ తర్వాత పరిజ్ఞానంతో మరో డాక్టర్ దగ్గరకు వెళ్లింది. కాకతాళీయమో ఏంటో తెలియదు. తన సమస్య, లక్షణాలు చెప్పగానే ‘ఒకసారి అబ్డామిన్ స్కాన్ చేయిద్దాం’ అన్నారా డాక్టర్. నా సమస్య ‘ఎండోమెట్రియోసిస్ డాక్టర్. దానికి ట్రీట్‌మెంట్ ఇవ్వండి’ అన్నది జాహ్నవి. ఆశ్చర్యంగా చూస్తున్న డాక్టర్‌తో పదిహేనేళ్లపాటు తాను అనుభవించిన కష్టాలను ఏకరువు పెట్టింది. స్కానింగ్‌లో అదే విషయం నిర్ధారణ అయింది.
అమ్మ ఏడ్చింది
జాహ్నవి సమస్య ఏమిటో తెలిసిన తర్వాత ఆమె తల్లి భోరున ఏడ్చింది. ఇన్నాళ్లూ పిల్ల ఎంతగా చెబుతున్నా పట్టించుకోలేదని ఆమె మనసు కదిలిపోయింది. బిడ్డ బాధను అర్థం చేసుకోవాల్సిన తల్లిని, ఇలా మొద్దుగా ఉండిపోయానెందుకో’ అని పదే పదే తలచుకుని బాధపడింది. ఇప్పుడు ఆ తల్లీ కూతుళ్లు చెప్పే మాట ఒక్కటే... ‘‘నెలసరి బాధ దాదాపుగా అందరికీ ఉంటుంది. అయితే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. తీవ్రంగా బాధ పడుతున్న వాళ్లు ప్రపంచంలో 176 మిలియన్ల మంది ఉన్నారు. కొందరికి సమస్య తీవ్రంగా ఉండదు. అలాంటి వాళ్లతో పోల్చి నొప్పి తీవ్రంగా ఉన్న పిల్లలను తప్పు పట్టవద్దు. వాళ్ల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దు అని మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment