అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ శ్రీదేవి
పుష్కర వలంటీర్లకు ప్రత్యేకశిక్షణ
Published Wed, Jul 27 2016 10:11 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కృష్ణా పుష్కరాల్లో స్వచ్ఛంద సేవలు అందించేందుకు వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ టీకే శ్రీదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కృష్ణా పుష్కరాలపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఉద్యోగులు, యువజన సంఘాలు, రెడ్‌క్రాస్ సొసైటీ, కార్మిక సంస్థలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ వివరాలు తీసుకోవడమే కాకుండా ఆయా ఘాట్ల వారీగా వారిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని సూచించారు. బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా 9 ఘాట్ల వద్ద టవర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన సౌకర్యాలు కల్పించాలని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారి వేణుగోపాల్ కలెక్టర్‌ను కోరారు. డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా సీనియర్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు ఇస్తామని తెలిపారు. అన్ని ముఖ్యమైన ఘాట్ల వద్ద 104, 108 సేవలు అందుబాటులో ఉంచాలని కోరారు. భక్తులు నీటిలో పాలిథిన్ కవర్లు వేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సబ్బులు, శాంపులు వేయకుండా చర్యలు తీసుకోవాలని, బట్టలు ఉతకకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జేసీ రాంకిషన్, ఏజేసీ రంజిత్ ప్రసాద్, డీఆర్వో భాస్కర్, జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, ఆర్డీఓలు శ్రీనివాసులు, దేవేందర్‌రెడ్డి, రాంచందర్, అబ్దుల్ హమీద్, డీఎఫ్‌ఓలు రామ్మూర్తి, గంగారెడ్డి పాల్గొన్నారు.
Advertisement