ప్రాణం తీసిన అతివేగం
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల దుర్మరణం
- ఒకరికి స్వల్ప గాయాలు
మిడుతూరు: అతివేగం రెండు ప్రాణాలను బలిగొంది. త్వరగా గమ్యస్థానం చేరాలనే ఆత్రుతతో వేగంగా వెళ్లి వరిగడ్డి ట్రాక్టర్‌ను ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దుర్మరణం చెందగా మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నందికొట్కూరు–నంద్యాల ప్రధాన రహదారిపై చెరుకుచెర్ల బాట సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎస్‌ఐ సుబ్రమణ్యం తెలియజేశారు. ఆత్మకూరుకు చెందిన షేక్ నబిరసూల్ (కారు డ్రైవర్) (47), షేక్ మహమ్మద్ జాకీర్ (30), మెహతుల్లా ఆత్మకూరు నుంచి గడివేముల జిందాల్ ప్యాక్టరీకి పని నిమిత్తం ఏపీ 21 ఆర్ 1697 టాటా ఇండికా కారులో బయలుదేరారు. చెరుకుచెర్ల బాట సమీపంలో తలముడిపి నుంచి మిడుతూరుకు వస్తున్న వరిగడ్డి ట్రాక్టర్‌ను వీరి కారు వేగంగా ఢీకొంది. ప్రమాదంలో కారు డ్రైవర్ నబిరసూల్, షేక్ మహమ్మద్ జాకీర్ అక్కడిక్కడే మృతి చెందగా మెహతుల్లాకు స్వల్ప గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జై రోడ్డు పక్కన గుంతలో పడింది. నందికొట్కూ సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ సుబ్రమణ్యం సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.