ఆత్మీయ అనుబంధం
- జిల్లాలో మూడుసార్లు పర్యటించిన దర్శకరత్న
కర్నూలు(కల్చరల్): సుప్రసిద్ధ సినీ దర్శకులు, మాజీ కేంద్ర మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావుకు కర్నూలు జిల్లాతో ఆత్మీయ అనుబంధం ఉంది. జిల్లాలో దాసరి మూడుసార్లు పర్యటించి స్థానిక నాయకులు, కళాకారులు, రచయితలతో ముచ్చటించారు. దివంగత కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డితో దాసరి నారాయణరావుకు అత్యంత స్నేహపూర్వక అనుబంధం ఉండేది. చక్కని రాజకీయ సామాజిక విలువలు కలిగిన నేతగా విజయభాస్కర్‌రెడ్డిని దాసరి ఎంతగానో ఆదరించే వారు. విజయభాస్కర్‌రెడ్డి పరమపదించినపుడు ఆయన అంత్యక్రియల సందర్భంగా అంతిమయాత్రలో కర్నూలు నగర వీధుల్లో నడుచుకుంటూ పాల్గొన్నారు. స్థానిక కిసాన్‌ఘాట్ వద్ద జరిగిన అంత్యక్రియల్లో ఆయన భాస్కర్‌రెడ్డి భౌతికాయం వద్ద విషణ్ణవదనంతో నివాళులు అర్పించి కోట్ల కుటుంబాన్ని ఆప్యాయంగా పరామర్శించారు. విజయభాస్కర్‌రెడ్డి తనయుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డితోనూ దాసరికి ఆత్మీయ అనుబంధం ఉంది.
కర్నూలులో సుప్రసిద్ధ చలన చిత్రనటుడు శోభన్‌బాబు విగ్రహావిష్కరణ సందర్భంగా దాసరి నారాయణరావు 2011 మే నెలలో కర్నూలును సందర్శించారు. అభిమానుల మధ్య దాసరి నారాయణరావు స్థానిక కిడ్స్ వరల్డ్ సమీపంలో ఆనందోత్సాహాల నడుమ శోభన్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సునయన ఆడిటోరియంలో శోభన్‌బాబు సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన సత్కార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. శోభన్‌భాబు సేవా సమితి జాతీయ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు ఆహ్వానం మేరకు తాను కర్నూలుకు వచ్చానని, శోభన్‌బాబుతో తనకున్న స్నేహపూర్వక అనుబంధాన్ని ఆయన నెమరు వేసుకున్నారు. 2004 ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా దాసరి నారాయణరావు కర్నూలు, డోన్, ప్యాపిలి తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
కళాకారులు, రచయితలతో..
2015 డిసెంబర్ 27న కర్నూలు లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్‌మియా, సహాయ కార్యదర్శి ఇనాయతుల్లా, బనగానపల్లె అరుణభారతి అధ్యక్షుడు బీసీ రాజారెడ్డిలు దాసరి నారాయణరావును హైదరాబాద్‌లో కలిసి ఆయనతో పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు. రాజారెడ్డి రచించిన మానవ జీవనయానం అనే పుస్తకాన్ని దాసరి ఆయన స్వగృహంలో ఆవిష్కరించి రచయితలతో గంటసేపు ముచ్చటించారు. కర్నూలు రచయిత ఇనాయతుల్లా రచించిన నిచ్చెన పుస్తకాన్ని అందుకొని అందులోని కర్నూలు మాండలికాన్ని ఆయన కొనియాడారు. కర్నూలు గజల్ గాయకుడు మమహ్మద్‌మియా పాడిన గజల్‌ను ఆసాంతం విని ఆనందోత్సాహంతో అభినందించారు. కర్నూలు జిల్లా రాయలసీమలో ప్రత్యేకతను సంతరించుకొందని.. కర్నూలు అంటే తనకు ప్రత్యేక అభిమానమని ఈ సందర్భంగా ఆయన రచయితలు, కళాకారులతో తన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. దాసరి మృతి పట్ల లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, సభ్యులు మియా, ఇనాయతుల్లా, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు ప్రగాడ సంతాపాన్ని తెలియజేశారు.
దాసరి మా సంస్థ గౌరవ సలహాదారు
నాకు దాసరి నారాయణ రావుతో ఆత్మీయ అనుబంధం ఉంది. 2011లో నేను హైదరాబాద్ వెళ్లి, కర్నూలులో శోభన్‌బాబు విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానించిన వెంటనే ఆయన మారు మాట్లాడకుండా నా ఆహ్వానాన్ని మన్నించి కర్నూలుకు విచ్చేశారు. శోభన్‌బాబుతో బావా బావా అనుకునే ఆత్మీయ బంధుత్వం తనకు ఉందని దాసరి గుర్తు చేశారు. 1975లో దాసరి తొలిసారిగా బలిపీఠం అనే సినిమాను శోభన్‌బాబుతో తీసి సూపర్‌హిట్ సాధించడంతో స్టార్ హీరోలతో సినిమాలు చేయడం ప్రారంభించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.
- సుధాకర్‌బాబు, శోభన్‌బాబు సేవా సమితి జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ