క్రీడల అభివృద్ధి గాలికి..!
క్రీడల అభివృద్ధి గాలికి..!
Published Sat, Nov 5 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM
- ఇన్‌చార్జ్ పాలనలో డీఎస్‌డీవో
-క్రీడాకారుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం
కర్నూలు (టౌన్): జిల్లాలో క్రీడల అభివృద్ధి ప్రభుత్వానికి, అధికార యంత్రాగానికి ఏమాత్రం పట్టనట్లు కనిపిస్తోంది. మూడు నెలలుగా రెగ్యులర్ డీఎస్‌డీవో లేకపోవడంతో క్రీడల అభివృద్ధిని గాలికి వదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. సంబంధం లేని అధికారులను క్రీడల అధికారిగా నియమించడంతోనే అసలు సమస్య వస్తోందని క్రీడాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిని నియమిస్తారు. అయితే కర్నూలులో రెగ్యులర్ డీఎస్‌డీవోను నియమించలేదు. హంద్రీనీవా సుజలస్రవంతి యూనిట్ -4 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న మల్లికార్జున ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన డీఎస్‌డీవో కార్యాలయానికి రావడం లేదు. క్రీడాకారుల సమస్యలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈయన డిప్యూటీ కలెక్టర్‌గా బిజీగా ఉంటారని, అటువంటి అధికారులను క్రీడలకు అధికారిగా నియమించడం ఎంత వరకు సబబు క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. మండలస్థాయిలో, జిల్లాస్థాయిలో టోర్నమెంటులు నిర్వహించడం, ఔట్ డోర్‌స్టేడియం, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్వహణపై నిత్యం దృష్టిసారించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే జిల్లాకు సంబంధించి క్రీడలకు అవసరమయ్యే ప్రతిపాదనలు రూపొందించాల్సి ఉంది. గత ఏడాది జిల్లా క్రీడల అభివృద్ధికి సంబంధించి రూ. 16 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వచ్చిన నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రగతి తదితర వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. ఈ పనులన్ని చేయాలంటే.. క్రీడలపై అవగాహన, ఆసక్తి ఉన్న అధికారులనే క్రీడల అభివృద్ధి అధికారిగా నియమించాలన్న డిమాండ్ సర్వాత్ర వినిపిస్తోంది.
Advertisement