
క్రీడలతో మానసికోల్లాసం
ఉద్యోగులు మానసిక ఒత్తిడులను తగ్గించడానికి క్రీడలు దోహదం చేస్తాయని వక్తలు అన్నారు.
గుంతకల్లు : ఉద్యోగులు మానసిక ఒత్తిడులను తగ్గించడానికి క్రీడలు దోహదం చేస్తాయని వక్తలు అన్నారు. రైల్వే మజ్దూర్ యూనియన్, దక్షిణ మధ్య రైల్వే ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంతకల్లు రైల్వే క్రీడా మైదానంలో బుధవారం ఇంటర్ డిపార్టుమెంటల్ క్రీడాపోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్ అమితాబ్‌ఓజా, ఏడీఆర్‌ఎం కేవీ.సుబ్బరాయుడు, సీనియర్ డీఎఫ్‌ఎం (స్పోర్ట్స్ ఆఫీసర్) చంద్రశేఖర్‌బాబు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి తోడ్పడతాయన్నారు.
పురుషులు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్ విభాగాల్లో. మహిళా ఉద్యోగులకు త్రోబాల్, టెన్నికాయిట్, క్యారమ్స్, అథ్లెటిక్ పోటీలు నిర్వహించారు. డీఆర్‌ఎం బ్యాటింగ్ చేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. మజ్దూర్ యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్ మాట్లాడుతూ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన జట్లకు ఓవరాల్ చాంపియన్‌షిప్ ఇవ్వనున్నట్లు చెప్పారు. సీనియర్ డీసీఎం రాకేష్, సీనియర్ డీఓఎం ఆంజినేయులు, సీనియర్ డీఎంఈ డీజిల్ గోపాల్, మజ్దూర్ యూనియన్ నాయకులు ప్రకాష్‌బాబు, మస్తాన్‌వలి, బాలాజీసింగ్, పరదేశి విజయ్‌కుమార్, జాఫర్‌ఖాన్, ఇతర రైల్వే అధికారులు పాల్గొన్నారు.
మొదటిరోజు విజేతలు...
స్థానిక రైల్వే క్రీడా మైదానంలో ఇంటర్ డిపార్టుమెంటల్ క్రికెట్ పోటీల్లో మెడికల్ జట్టు, పర్సనల్ విభాగం జట్టులు గెలిచాయి. ఉదయం జరిగిన పూల్–ఏ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పర్సనల్ జట్టు నిర్ణీత ఓవర్లలో 99 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మెడికల్ జట్టు 100 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. మధ్యాహ్నం జరిగిన పూల్–బీ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రన్నింగ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు సాధించగా ఈ విజయ లక్ష్యాన్ని ఆపరేటింగ్ జట్టు 17.2 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి (160 పరుగులు సాధించి) జయకేతనం ఎగురవేసింది.