భక్తులతో కిక్కిరిసిన శ్రీశైలం
భక్తులతో కిక్కిరిసిన శ్రీశైలం
Published Sun, Feb 12 2017 10:45 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 80 వేలకుపైగా భక్తులు శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈఓ నారాయణ భరత్‌గుప్త ఆలయ పూజావేళల్లో మార్పులు చేశారు. భక్తులందరికీ స్వామివార్ల దర్శనం కల్పించేందుకు దూర దర్శనం ఏర్పాటు చేశారు. కేవలం అభిషేకాలను నిర్వహించుకునే సేవాకర్తలను మాత్రమే గర్భాలయంలోకి అనుమతించారు. అనంతరం ఇరుముడులతో ఉన్న శివదీక్షా స్వాములతో పాటు దీక్షా శివస్వాములను ప్రత్యేక క్యూ ద్వారా అనుమతించి వారికి స్పర్శదర్శన భాగ్యం కల్పించారు.
కాగా రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో శనివారం సాయంత్రం నుంచే భక్తుల రద్దీ ప్రారంభం కాగా, మల్లన్నకు అభిషేకాలను నిర్వహించుకోవడానికి ముందస్తు టికెట్ల ద్వారా ఆదివారం ఉదయం 6గంటల నుంచి, ఆ తరువాత 7.30 గంటలకు తరువాత 12.30గంటలకు మూడు విడతల్లో సుమారు 600లకు పైగా సామూహిక అభిషేకాలను నిర్వహించుకున్నారు. అదేరోజు సాయంత్రం 6.30గంటలకు మరో విడతలో వందకు పైగా అభిషేకాలను నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉచిత దర్శన క్యూ కంపార్టుమెంట్లలో భక్తులకు ఫలహారాన్ని అందజేశారు. సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన వారం కావడంతో భక్తులరద్దీ అధికంగా ఉంటుందనే భావనతో ఆలయపూజావేళలను యథావిథిగా ఏర్పాటు చేసి వేకువజామున 5.30గంటల నుంచే దర్శన ఆర్జితసేవలు ప్రారంభించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Advertisement