ఆభరణాల లెక్కింపును నోట్ చేసుకుంటున్న ఈఓ భరత్ గుప్త
– ఈఓ సాగర్‌బాబు వ్యవహారంతో అప్రమత్తం
– స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించిన ఆభరణాల తనిఖీ
– ఆంధ్రా బ్యాంకు లాకర్ పరిశీలన
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లకు భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలను మాజీ ఈఓ సాగర్‌బాబు ఇప్పటి వరకు స్వాధీనం చేయకపోవడంతో మంగళవారం ప్రస్తుత ఈఓ నారాయణ భరత్‌గుప్త స్థానిక ఆంధ్రా బ్యాంకు లాకర్‌ను తెరిపించి పంచనామా చేయించారు. దాతలు బహూకరించిన బంగారు, వెండి ఆభరణాలను దేవస్థానం ఈఓ సంబంధిత గుమస్తా, ఇతర అధికారులతో కలిసి అధికారికంగా లాకర్‌లో భద్రపరుస్తారు. కొన్నింటిని స్వామి, అమ్మవార్ల నిత్య పూజలు.. కైంకర్యాలకు వినియోగించడం ఆనవాయితీ. ఈఓ బదిలీ సమయంలో కొత్త అధికారికి ఆంధ్రా బ్యాంకులోని దేవస్థానం బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేయాల్సి ఉంటుంది. అయితే బదిలీ అయిన ఈఓ సాగర్‌బాబు వీటిని స్వాధీనం చేసేలోగా ఏసీబీ దాడులు జరగడంతో ప్రస్తుత ఈఓ అప్రమత్తం అయ్యారు. పోలీసు, రెవెన్యూ, దేవస్థానం సిబ్బందితో కలిసి లాకర్‌ను పగులగొట్టించి ఆభరణాలను పరిశీలించారు. అయితే ఇందులో ఎలాంటి గోల్‌మాల్ జరగలేదని తెలుస్తోంది. తనిఖీలో ఈఓతో పాటు డిప్యూటీ తహశీల్దార్ రాజేంద్రసింగ్, వన్‌టౌన్ ఎస్‌ఐ లోకేష్‌కుమార్, ఆంధ్రా బ్యాంకు మేనేజర్, దేవస్థానం ఏఈఓ కష్ణారెడ్డి, అకౌంట్స్ గుమస్తా ఉమేష్ ఉన్నారు.