చిత్తూరులో మంగళవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న విద్యార్థులు, ఏఐఎస్‌ఎస్, ఏఐటీయూసీ నాయకులు
‘భెల్’ తరలింపు యోచనపై పెల్లుబుకుతున్న ఆగ్రహం
– తీవ్రంగా ప్రతిఘటిస్తామంటోన్న వైఎస్సార్‌సీపీ
– నియోజకవర్గ కేంద్రాల్లో ఏఐఎస్‌ఎఫ్ ఆందోళనలు
– తరలిస్తే ఊరుకోం : భూమన కరుణాకర్‌రెడ్డి
మన్నవరంలో విద్యుత్ ఉపకరణాల తయారీ భారీ కర్మాగారాన్ని(భెల్) పక్క రాష్ట్రాలకు తరలించాలన్న యోచనపై నిరసన పెల్లుబుకుతోంది. తరలించాలనే ప్రతిపాదన గుట్టును సాక్షి బహిర్గతం చేశాక వివిధ వర్గాలు కదిలాయి. కేంద్ర ప్రభుత్వ కుట్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతలపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీలు, విద్యార్థి, నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు దీనిపై ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. మన్నవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబునాయుడు కనబరుస్తోన్న నిర్లక్ష్య వైఖరిని జిల్లా ప్రజానీకం తీవ్రంగా పరిగణిస్తోంది. నిధుల కేటాయింపులో చూపుతున్న అనాసక్తిని తప్పుబడుతోంది.
––––––––––––––––––––
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
మన్నవరంలో రూ.6 వేల కోట్ల పెట్టుబడులతో విద్యుత్ ఉపకరణాల తయారీ ఫ్యాక్టరీకి ప్రతిపాదనలు జరిగాయి. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన అనుమతులన్నీ వైఎస్ హయాంలోనే లభించాయి. ఈ ఫ్యాక్టరీ కోసం 720 ఎకరాలను కేటాయించారు. 2010 సెప్టెంబరు 1న అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ భూమి పూజ కూడా చేశారు. అప్పట్లో వేలాది మంది యువకుల్లో ఉపాధి అవకాశాల ఆశలు చిగురించాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన కంప్యూటర్ ఇంజినీరింగ్ పట్టభద్రులు ఫ్యాక్టరీపై బోలెడన్ని కలలు కన్నారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు పరిశ్రమను పూర్తిస్థాయిలో నెలకొల్పే విషయంలోనూ, నిధుల కేటాయింపులోనూ అనాసక్తి చూపింది. దీంతో ఈ ఫ్యాక్టరీ తరలింపు కోసం కేంద్రం యత్నాలు ప్రారంభించింది. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకూ తరలింపు వ్యవహారం శరాఘాతంలా తాకింది. గడచిన వారం రోజులుగా జిల్లా అంతటా నిరసన ఉద్యమాలు మొదలయ్యాయి. వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, వాçమపక్ష పార్టీలు ఈ యోచనను వ్యతిరేకిస్తున్నాయి. ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు 27న జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిరుద్యోగ, గిరిజన, మహిళా సంఘాలు కూడా తరలింపు యోచనను విరమించుకోవాలని నినదిస్తున్నాయి. 15 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగజేసే భారీ ప్రాజెక్టును పక్క రాష్ట్రాలకు తరలిస్తే ఆమరణ దీక్షకు పూనుకుంటామని పలువురు స్పష్టం చేస్తున్నారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ పార్టీలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భెల్ ఫ్యాక్టరీ తరలింపు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెరచాటున చేస్తోన్న ప్రయత్నాలను తిప్పి కొట్టేందుకు సమాయత్తమవుతున్నాయి. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.
ఫ్యాక్టరీని తరలిస్తే ఊరుకోం : భూమన
వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే మన్నవరం భెల్ ఫ్యాక్టరీని ఇతర రాష్ట్రాలకు తరలిస్తే సహించేది లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు. కర్మాగారం పనులు పూర్తయి ఉత్పత్తి ప్రారంభమైతే వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఎనలేని కీర్తి, ప్రజాభిమానం లభిస్తుందన్న భయంతోనే టీడీపీ సర్కారు కేంద్రంతో కలిసి కుయుక్తులు పన్ని పరిశ్రమను తరలించేందుకు యోచన చేస్తుందని ధ్వజమెత్తారు. కొత్త పరిశ్రమల స్థాపనతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని నిత్యం చెప్పే చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో భారీ పరిశ్రమ తరలిపోతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటారని భూమన ప్రశ్నించారు.