10న రాష్ట్ర బంద్
- ప్రతిపక్షం మొత్తాన్నీ సస్పెండ్ చేస్తారా?: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
- అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు
- అధికారపక్షం నిరంకుశంగా వ్యవహరిస్తోంది
- నేటి నుంచి రైతు భరోసా యాత్రలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలన్నందుకు ప్రతిపక్షాలన్నింటినీ సస్పెండ్ చేసిన ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 10వ తేదీన రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్టు టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మొత్తం విపక్షాల సభ్యులను సమావేశాలు మొత్తానికీ సస్పెండ్ చేసిన ఘటనలు చరిత్రలోనే లేవని, ఇది శాసనసభ చరిత్రలో చీకటి రోజు అని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు డి.శ్రీధర్‌బాబు, దాసోజు శ్రవణ్, వేణుగోపాల్, అద్దంకి దయాకర్‌లతో కలసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రూ.లక్షలోపు పంటరుణాలను మాఫీ చేస్తామన్న హామీని అమలుచేయాలని కోరడమే తప్పు అన్నట్టుగా అధికార టీఆర్‌ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఒకేసారి మొత్తం రుణమాఫీ చేయాలని కోరితే శాసనసభలో ఉన్న ప్రతిపక్షాల సభ్యులను సస్పెండ్ చేశారన్నారు. ఇలా మొత్తం ప్రతిపక్ష సభ్యులను, సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేసిన ఘట నలు చరిత్రలోనే లేవని.. సభ చరిత్రలో ఇది బ్లాక్‌డే(చీకటిరోజు) అని ఉత్తమ్ వ్యాఖ్యానిం చారు. సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, ఒకేసారి మొత్తం రుణమాఫీ చేయాలని కోరితే ప్రభుత్వం భయపడుతోందన్నారు. సభను వాయిదా వేసుకుని ఒకసారి, విపక్ష సభ్యులను సస్పెండ్ చేసి మరోసారి ప్రభుత్వం పారిపోతోందన్నారు. ఎన్నికల్లో చెప్పిన విషయాన్నే అమలుచేయాలని కోరితే.. అమలు సాధ్యం కాని కోరిక అని కేసీఆర్ ఎలా మాట్లాడతారని నిలదీశారు.
వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు మద్దతు ధర, బోనస్‌ను అడిగామని... వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవడానికి ప్రతిపక్షం గొంతును నొక్కుతోందన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 10న బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగడుతూ, రైతుల్లో భరోసా కల్పించడానికి ఈ నెల 6 నుంచి జిల్లాల్లో రైతు భరోసా యాత్రను నిర్వహిస్తున్నట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. 6న మహబూబ్‌నగర్, 7న మెదక్, 8న ఖమ్మం, 9న వరంగల్, 11న నిజామాబాద్ జిల్లాల్లో యాత్ర నిర్వహిస్తామన్నారు. ప్రతిపక్షాలన్నీ కలసి ఈ నెల 10న బంద్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు ఉండవనుకుంటే... ప్రభుత్వ తీరుతో రైతులు తీవ్ర సమస్యల్లోకి కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. పాలకుల చేతకానితనం వల్లే ఇలాంటి పరిస్థితులు దాపురించాయని విమర్శించారు.