
రుణ మాఫీ మాయ!
పొందూరు :స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) జిల్లా అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా 62 కుంటుంబాల వారితో పాటు 15 స్వయంశక్తి సంఘాల సభ్యులకు రుణమాఫీ వర్తించకుండా పోయింది. ఎస్‌బీఐ శ్రీకాకుళం ఏడీబీ శాఖ, రాజాం ఎస్‌బీఐ, నరసన్నపేట ఎస్‌బీఐ, ఆమదాలవలస ఎస్‌బీఐ, కొత్తూరు ఎస్‌బీఐ శాఖలు సక్రమంగా వ్యవహరించడంతో ఆ ప్రాంతంలోని మొత్తం 47 చేనేత కుటుంబాల వారికి మాఫీ జరిగింది. ప్రభుత్వం 2014 మార్చి 31 నాటికి రుణ బకాయిలు ఉన్న వారికి మాఫీని వర్తింపజేశారు. అయితే దేశంలోనే చేనేత రంగానికి ఎంతో ప్రసిద్ధి చెందిన తమకు అన్యాయం జరిగిందని పొందూరు చేనేత కార్మికులంతా వాపోతున్నారు.
తమ సంక్షేమం పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించడం అత్యంత దారుణమని పేర్కొంటున్నారు. స్థానిక సారుుబాబా చేనేత సహకార సంఘం పరిధిలోని 40 కుటుంబాల వారికి 2008 నుంచి 2013 వరకు ఇచ్చిన రుణాలతో పాటు ప్రైవేటు రంగంలో మరో 22 కుటుంబాల వారికి అలాగే ఎస్‌హెచ్‌జీల కింద ఉన్న కార్మికులకు ఇచ్చిన రుణాలు మాఫీ కాలేదు. ఒక్కో చేనేత కార్మికుడు రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు రుణాలు తీసుకొన్నారు. కొన్నాళ్లుగా బకారుులను చెల్లించాలని బ్యాంకు అధికారులు విపరీతమైన ఒత్తిడి తెచ్చి మానసిక క్షోభకు గురి చేశారని ఆరోపించారు.
తాము పొదుపు చేసుకొన్న మొత్తాలను తమ అనుమతి లేకుండానే బకారుుల కింద దపదఫాలుగా జమ చేసుకొన్నారని కొందరు కార్మికులు ఆరోపించారు. బ్యాంకు నుంచి రుణ బకారుుల జాబితాలు జిల్లా పాలనా యంత్రాంగానికి పంపకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. జిల్లా అధికారులు కూడా ఈ విషయాన్ని గుర్తించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఇకనైనా బ్యాంకు అధికారులు తమకు న్యాయం చేయాలని లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే బకాయిలను పాక్షికంగా చెల్లించిన వారికి తిరిగి ఆ మొత్తాలను మాఫీలో భాగంగా వర్తింపజేయాలని వారు కోరుతున్నారు.
అనుమతి లేకుండానే...
నా అనుమతి లేకుండానే పొదుపు ఖాతాలో రూ.3,400 మొత్తాన్ని బకాయి కింద జమ చేశారు. కనీస విలువలు పాటించకుండా నిబంధనలకు విరుద్దంగా బ్యాంకు అధికారులు ప్రవర్తించారు.
-మానెం పైడిరాజు, చేనేత కార్మికుడు
కార్మికులకు న్యాయం జరిగే వరకు...
కార్మికులకు న్యాయం జరిగే వరకు శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహిస్తాం. జరిగిన అన్యాయంపై జిల్లా పాలనా యంత్రాంగానికి నివేదించాను. అలాగే జిల్లా చేనేత శాఖ సహాయ సంచాలకులు గుత్తి రాజారావు దృష్టికి తేగా రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్‌తో మాట్లాడతా.
-గంప వీరభద్రస్వామి, అధ్యక్షుడు, సాయిబాబా చేనేత సహకార సంఘం, పొందూరు
ఎల్‌డీఎం ఏమన్నారంటే...
ఈ విషయమై జిల్లా లీడ్ బ్యాంకు శాఖ మేనేజర్ (ఎల్‌డీఎం) పి.వెంకటేశ్వరరావు వద్ద సాక్షి మంగళవారం ప్రస్తావించగా పొందూరు ఎస్‌బీఐ నిర్వాకంపై విచారణ జరిపించాలని ఎస్‌బీఐ జోనల్ (శ్రీకాకుళం) ఉన్నతాధికారులకు లేఖను పంపిస్తున్నట్టు వివరించారు. కార్మికులకు న్యాయం జరిగేం దుకు కృషి చేస్తామని చెప్పారు.