ముగిసిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్, క్రికెట్ పోటీలు
-
అండర్–14 బాలుర క్రికెట్ విభాగంలో తూర్పుగోదావరి జట్టు విజేత
-
అండర్–14,17 బాలుర అథ్లెటిక్స్ విభాగంలో వైఎస్సార్ కడప జట్లు విజేతలు
-
అండర్ 14 బాలికల విభాగంలో శ్రీకాకుళం జట్టు విజేత
-
అండర్ 17 బాలికల విభాగంలో పశ్చిమ గోదావరి జట్టువిజేత
గుంటూరు స్పోర్ట్స్ : 62వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్, క్రికెట్ పోటీలు ముగిశాయి. అండర్–14 బాలుర క్రికెట్ విభాగంలో తూర్పు గోదావరి జట్టు విజేతగా నిలువగా, అనంతపురం జట్టు ద్వితీయ, విజయనగరం తృతీయ స్థానాలు సాధించాయి. అండర్–14 బాలుర అథ్లెటిక్స్ విభాగంలో వైఎస్సార్ కడప జట్టు విజేత నిలువగా, బాలికల విభాగంలో శ్రీకాకుళం విజేతగా నిలిచింది. అండర్–17 బాలుర విభాగంలో వైఎస్సార్ కడప జిల్లా జట్టు విజేతగా నిలువగా, బాలికల విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం బ్రహ్మనందరెడ్డి స్టేడియంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామకృష్ణ, మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్యఅతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ కార్యదర్శి కరీముల్లారావు, అధ్యక్షుడు కాంతరావు, అబ్జర్వరర్ విజయ్, స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి గణేష్, శిక్షకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.