రాజ్యాధికారం కోసం పోరాడుదాం
రాజ్యాధికారం కోసం పోరాడుదాం
Published Sat, Mar 4 2017 10:05 PM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM
రాష్ట్ర చేనేత కులాల ఐక్యవేదిక సమావేశంలో నాయకులు
పిఠాపురం టౌన్ : చేనేత కుటుంబాలు కష్టాల నుంచి బయటపడాలంటే సమానత్వం, ఆర్థికస్వాలంభన, రాజ్యాధికారం దిశగా పోరాడాలని రాష్ట్రంలోని పలు చేనేత కులాల నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక మున్సిపల్ కల్యాణ మండపంలో శనివారం జరిగిన రాష్ట్ర వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ప్రతినిధుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. చేనేతే రంగం మీద ఆధారపడి జీవిస్తున్నవారు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో 19 శాతంగా ఉన్న చేనేత వర్గం అభివృద్ధి చెందాలంటే రాజకీయ ఆవశ్యకత అవసరమని కనీసం 10 మంది ఎమ్మెల్యేలను నెగ్గించుకునేందుకు ప్రతి చేనేత కుటుంబం కృషి చేయాలన్నారు. ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్రీరం శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. వీటికి నవరత్నాలు అని పేరుపెట్టారు. ఫ్రంట్‌కు రాష్ట్ర కన్వీనర్‌గా ఎంపికైన తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తీర్మానాలను చదివి వినిపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్యాయంతో సమగ్ర చేనేత జాతీయ, రాష్ట్ర విధానం అమలు చేయాలని, చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణకు వర్షాకాలంలో నేత విరామం అమలు చేయాలని, చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.2 వేల కోట్లు వార్షిక బడ్జెట్ కేటాయించాలని తీర్మానించారు. అలాగే చేనేత రంగానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి ముఖ్యమంత్రికి స్వీయపర్యవేక్షణ ఉండాలని తదితర తీర్మానాలను ఆమెదించారు. వివిధ సంఘాల అధ్యక్షులు వై.కోటేశ్వరరావు, కోట వీరయ్య, మలిపెద్ది అప్పారావు, పాలాటి బాలయోగి, అడికి మల్లిఖార్జునరావు, ఎం.వెంకటేశ్వర్లు, తూతిక అప్పాజి, నక్కిన చినవెంకటరాయుడు, జగ్గారపు శ్రీనివాసరావు, రాయలసీమ ఇన్ చార్జ్ నేతాంజలి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ సంజీవ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే చందన రమేష్, రాజమండ్రి జాంపేట కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ బొమ్మన రాజ్‌కుమార్, ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు, కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు శీరం ప్రసాదు, సభ్యులు, నాయకులు మాట్లాడారు. సమావేశం ప్రారంభంలో జ్యోతిప్రజ్వలన చేసి చేనేత నాయకులు స్వర్గీయ ప్రగడ కోటయ్య, స్వర్గీయ బొమ్మన రామచంద్రరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. అతుకులు లేకుండా జాతీయ జెండాను మగ్గంపై నేసిన పశ్చిమగోదావరి జిల్లా ఆచంట వేమవరం గ్రామానికి చెందిన రుద్రాక్ష సత్యన్నారాయణను ఘనంగా సత్కరించారు.
సమావేశంలో తోపులాట
సమావేశంలో తమ నాయకుడు జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు పంపన రామకృష్ణకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమావేశంలో వాగ్వివాదం చోటు చేసుకుని తోపులాటకు దారితీసింది. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. కొంతసేపు అంతరాయం ఏర్పడి తర్వాత సద్దుమణిగింది.
Advertisement
Advertisement