విగ్రహాల ధ్వంసం నీతిమాలినచర్య
విగ్రహాల ధ్వంసం నీతిమాలినచర్య
Published Wed, Sep 7 2016 12:36 AM | Last Updated on Sat, Sep 15 2018 3:51 PM
* దుండగులను కఠినంగా శిక్షించాలి
* మర్రి, బొల్లా డిమాండ్
వినుకొండ టౌన్: దివంగత ముఖ్యమంత్రి, పేదల సంక్షేమం కోసం పోరాడిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చెయ్యి విరగ్గొట్టడం దుర్మార్గపు చర్యని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, వినుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. పట్టణంలోని ఆశా థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన మహానేత రాజన్న విగ్రహ ఎడమ చెయ్యిని దుండగులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. దీనిపై పార్టీ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం పార్టీ శ్రేణులు వెంట కదలిరాగా బొల్లా, మర్రి రాజశేఖర్‌లు రాజన్న విగ్రహం వద్దకు చేరుకుని ఇటువంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడ్డ దుండగులను శిక్షించాలంటూ కర్నూలు– గుంటూరు రాష్ట్ర రహదారిపై ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అధికారం అండ చూసుకుని విద్రోహ చర్యలకు దిగటం, మహా నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయటం నీతిమాలిన చర్యని విమర్శించారు. అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన అధికార పార్టీకి చెందినవారు.. ప్రతిపక్షానికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు ఒడిగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం చెయ్యిని విరగ్గొట్టిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోవాలని, లేకుంటే జిల్లా స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోలేదని, ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న అభిమానాన్ని చూసి తట్టుకోలేకపోతున్నట్టుగా అనిపిస్తోందని చెప్పారు. పట్టణంలో మాఫియా గ్యాంగ్ అరాచకాలు పేట్రేగిపోయాయన్నారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
నిందితులను అదుపులోకి తీసుకుంటాం...
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆషా థియేటర్ సెంటర్‌లో రెండు గంటల పాటు కొనసాగిన ధర్నాతో రాష్ట్ర రహదారిపై వాహనాలు బారులుతీరాయి. రూరల్ సీఐ టీవీ శ్రీనివాసరావు, ఎసై ్సలు నారాయణ, శివాంజనేయులు పార్టీ నాయకులకు నచ్చజెప్పి నిందితులను అరెస్ట్ చేస్తామని హామి ఇచ్చి ధర్నా విరమింపజేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతు బాంధవుడు రాజన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిన సమాచారం తెలుసుకున్న డీసీసీ మక్కెన అక్కడికి చేరుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.
Advertisement