ఉక్కు సీమ హక్కు
ప్రొద్దుటూరు:
జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసే వరకు ఉద్యమం ఆగదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.రామయ్య పేర్కొన్నారు. ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన తేదీని ప్రకటించాలని కోరుతూ మంగళవారం స్థానిక పుట్టపర్తి సర్కిల్‌లో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రజా సంఘాలతో కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేనిపోని సాకులతో ప్రభుత్వం ఉక్కు కర్మాగారం నిర్మించకుండా కాలయాపన చేస్తోందన్నారు. వాస్తవానికి వైజాగ్ స్టీల్ కర్మాగారానికి కూడా చత్తీస్‌గడ్ నుంచి ముడిసరుకు వస్తోందన్నారు. అలాగే ఆర్టీపీపీకి కూడా సింగరేణి నుంచి బొగ్గు సరఫరా అవుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎందుకు జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడం లేదని ప్రశ్నించారు.
ఉద్యమంలో భాగంగా ఈనెల 28న కలెక్టరేట్‌ను ముట్టడించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పల్లేటి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమ వస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులతోపాటు మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, విరసం కార్యదర్శి వరలక్ష్మి, సీపీఐ పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు, షరాబు వ్యాపారస్తుల సంఘం కార్యదర్శి నామా శ్రీధర్, విజిటబుల్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాఫర్ హుసేన్, క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు పల్లా శేషయ్య, టైలర్స్ అసోసియేషన్ నాయకుడు షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.