Manavaharam
-
ఉత్తరాంధ్ర కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం
చోడవరం (అనకాపల్లి జిల్లా): విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో జరిగింది. ప్రమాదంలో యువకుడితో పాటు ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక ఎంపీటీసీ సభ్యుడు, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం చోడవరం మండలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ కూడా పాల్గొన్నారు. బైక్ ర్యాలీ అనంతరం స్థానిక కొత్తూరు జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. మానవహారంలో పాల్గొన్న పీఎస్‌పేటకు చెందిన సీహెచ్ శ్రీనివాసరావు అనే యువకుడు అకస్మాత్తుగా పక్కనే ఉన్న తన మోటారు సైకిల్‌ను తీసుకొచ్చి మానవహారం మధ్యలో పడేశాడు. అప్పటికే బాటిల్‌తో తెచ్చుకుని ఉన్న పెట్రోల్‌ను మోటారు సైకిల్‌పై, తన ఒంటిపై పోసుకున్నాడు. మానవహారంలో ఉన్న ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీతో పాటు మిగతా ఉద్యమకారులు పరుగెత్తుకుని వచ్చి అతని వద్ద ఉన్న పెట్రోల్ బాటిల్‌ను తీసుకున్నారు. ఇంతలో తన వద్ద ఉన్న అగ్గిపెట్టె వెలిగించి బైక్‌పై వేయడంలో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఆ యువకుడు ప్రయత్నించగా అక్కడ ఉన్న ఉన్నవారంతా వారించి అతనిని దూరం లాక్కెళ్లి.. అతనికి అంటుకున్న మంటలను ఆర్పారు. ఘటనలో ఒక్కసారిగా బైక్ నుంచి మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న చోడవరం–8వ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడు పుట్రేటి శ్యామ్‌ప్రసాద్‌కు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరు పుల్లేటి అప్పారావు, పతివాడ అప్పారావులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాసరావుతో సహా వీరందరినీ చికిత్స కోసం చోడవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాణత్యాగానికి సిద్ధం ఆత్మహత్యాయత్నం అనంతరం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో వెనుకబడి ఉందని, తనలాంటి నిరుద్యోగులెందరో ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు తరలిపోవాల్సిన దుస్థితి ఉందన్నారు. విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయాలన్నదే తన కోరికని.. ఇందుకోసమే ప్రాణత్యాగానికి సిద్ధమైనట్టు చెప్పారు. ప్రభుత్వ విప్ ధర్మశ్రీ మాట్లాడుతూ తమ సహనాన్ని పరీక్షించొద్దని, ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టొద్దని కోరారు. ప్రజా ఉద్యమం ఉధృతం అవ్వకముందే అమరావతి పాదయాత్రను ఆపాలని డిమాండ్ చేశారు. -
హోదా హామీని నిలబెట్టుకోని మోదీ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): 2014 ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, ఎన్నికల అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చి ప్రధాని అయిన ఆయన ఐదు కోట్ల ఆంధ్రులకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా మోసగించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై పలు రాజకీయపార్టీలు శుక్రవారం పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య సూచనమేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉడతా వెంకట్రావ్, సీవీ శేషారెడ్డి, పత్తి సీతారాంబాబు మాట్లాడారు. గతంలో ప్రత్యేక హోదా ఐదేళ్లుకాదు 10 సంవత్సరాలు కావాలని మాట్లాడిన బీజేపీ నాయకులు నేడు హోదా ఇవ్వబోమని చెప్పి ఆంధ్రులను మోసగించారని విమర్శించారు. విభజన చట్టంలో ఉన్న పరిశ్రమలు, విద్యాసంస్థలు, పలు కర్మాగారాలు రాష్ట్రానికి వచ్చినట్లయితే నిరుద్యోగ సమస్య తొలగిపోతుందన్నారు. ఇదంతా ప్రత్యేక హోదాతోనే సాధ్యమన్నారు. 2019ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్‌గాంధీ ప్రధాని అయిన తరువాత మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా పైనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు కె.రఘురాంముదిరాజ్, బాలసుధాకర్, తిరుపయ్య, భవానీ నాగేంద్రప్రసాద్, అనురాధారెడ్డి, లతారెడ్డి, రమణయ్య, మధుబాబు, ఏడుకొండలు, నారాయణరావు, సునీల్రాజు పాల్గొన్నారు. -
ఉగ్రఘాతుకంపై విద్యార్థుల నిరసన
పోరుమామిళ్ల: కశ్మీర్ యూరి సైనిక శిబిరంపై పాక్ ముష్కరులు దాడి చేసి 17 మందిని పొట్టనపెట్టుకున్న సంఘటనకు నిరసనగా సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ‘పాకిస్థాన్ డౌన్ డౌన్’ ‘ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి, అమరవీరులకు జోహార్’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఆర్టీసీ బస్టాండు వద్ద మానవ హారంగా ఏర్పాడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ డివిజన్ ఇన్చార్జి బుసిరెడ్డి మనోహరరెడ్డి, పట్టణ కార్యదర్శి చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమైనచర్య అన్నారు. ప్రపంచదేశాలన్నీ ఐక్యంగా ఉగ్రవాదులను మట్టుపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నారోజు రమణాచారి, నాగేంద్రబాబు, సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉక్కు సీమ హక్కు
ప్రొద్దుటూరు: జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసే వరకు ఉద్యమం ఆగదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.రామయ్య పేర్కొన్నారు. ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన తేదీని ప్రకటించాలని కోరుతూ మంగళవారం స్థానిక పుట్టపర్తి సర్కిల్లో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రజా సంఘాలతో కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేనిపోని సాకులతో ప్రభుత్వం ఉక్కు కర్మాగారం నిర్మించకుండా కాలయాపన చేస్తోందన్నారు. వాస్తవానికి వైజాగ్ స్టీల్ కర్మాగారానికి కూడా చత్తీస్గడ్ నుంచి ముడిసరుకు వస్తోందన్నారు. అలాగే ఆర్టీపీపీకి కూడా సింగరేణి నుంచి బొగ్గు సరఫరా అవుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎందుకు జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడం లేదని ప్రశ్నించారు. ఉద్యమంలో భాగంగా ఈనెల 28న కలెక్టరేట్‌ను ముట్టడించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పల్లేటి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమ వస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులతోపాటు మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, విరసం కార్యదర్శి వరలక్ష్మి, సీపీఐ పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు, షరాబు వ్యాపారస్తుల సంఘం కార్యదర్శి నామా శ్రీధర్, విజిటబుల్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాఫర్ హుసేన్, క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు పల్లా శేషయ్య, టైలర్స్ అసోసియేషన్ నాయకుడు షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. -
జయకు మద్దతుగా 90 కిలోమీటర్ల మానవహారం
సిఫ్‌కాట్/ హొసూరు/ క్రిష్ణగిరి:తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మద్దతుగా ఆ పార్టీ కార్యకర్తలు ఆదివారం హొసూరు పారిశ్రామికవాడ సమీపంలోని కర్ణాటక సరిహద్దు అత్తిపల్లి నుంచి బర్గూరు వరకు సుమారు 90 కిలోమీటర్లు మానవహారం నిర్వహించారు. అత్తిపల్లి వద్ద హొసూరు మున్సిపాలిటి 1వ వార్డు కౌన్సిలర్ అశోక్‌కుమార్ అధ్యక్షతన అన్నా కార్మిక సంఘ అధ్యక్షుడు మాదేవ నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు దర్గావరకు మానవహారం నిర్వహించారు. జయలలితను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు త్యాగరాజరెడ్డి, నందకుమార్, నాయకులు లజపతిరెడ్డి, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. హొసూరులో... : జయలలితను జైలు శిక్ష నుంచి విముక్తి కలిగించాలని మున్సిపల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో బాగలూరు రోడ్డు నుంచి రెండో సిఫ్‌కాట్ వరకు జాతీయ రహదారిలో మానవహారం నిర్వహించారు. అన్నాడీఎంకే నాయకులు వైస్ చైర్మన్ రాము, మాజీ మున్సిపల్ చైర్మన్ నంజుండస్వామి, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. సూళగిరిలో... సూళగిరిలో అన్నాడీఎంకే చైర్మన్ హేమనాథ్ (మధు ) నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. అదేవిధంగా స్వరకాయపల్లి గ్రామానికి చెందిన తిమ్మరాజు (22), కళావతి(19)లకు ఆదివారం ఉదయం సూళగిరిలోని చెన్నరాయశెట్టి కల్యాణ మంటపంలో వివాహం జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులు కూడా మానవహారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకరన్, కార్యదర్శి తాయప్ప, రాఘవ న్, కుమార్, నాగరాజు, పార్టీ కౌన్సిలర్లు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. క్రిష్ణగిరిలో... : క్రిష్ణగిరిలో అన్నాడీఎంకే జిల్లా అధ్యక్షుడు గోవిందరాజు నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో క్రిష్ణగిరి ఎంపి అశోక్‌కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సమస్యలను పరిష్కరించాలని ఆందోళన
కైకలూరు, న్యూస్‌లైన్ : తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కైకలూరులోని జాతీయ రహదారిపై బుధవారం మానవహారం నిర్వహించారు. కైకలూరు, కలిదిండి మండలాల సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు 300 మంది హాజరయ్యారు. తొలుత పట్టణంలో ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి కె.లాజర్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల జీతాలను రూ.12,500కు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అంగన్వాడీల సంఘం మండల అధ్యక్షురాలు పోలవరపు సుజాత మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, ఎటువంటి షరతులు లేకుండా సెంటర్ అద్దెలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘ నేతలు రమణ, రమాదేవి, గంగాజలం, ఝాన్సీ, విజిత, లీలావతి తదితరులు పాల్గొన్నారు. డీఎన్నార్ సంఘీభావం ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన తర్వాత అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను తప్పకుండా తీరుస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీల మౌన ర్యాలీ మండవల్లి : ప్రభుత్వం తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని ఐసీడీఎస్ మండవల్లి ప్రాజెక్ట్ పరిధిలోని మండవల్లి, ముదినేపల్లి మండలాల అంగన్వాడీ కార్యకర్తలు మౌనంగా బుధవారం ర్యాలీ నిర్వహించారు. నోటికి నల్ల రిబ్బనులు కట్టుకుని వీధుల్లో ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లీడర్ సిహెచ్.వాణి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలననుసరించి జీతాలు పెంచాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. మండవల్లి, వడాలి, ముదినేపల్లి, కొత్తపల్లి సెక్టార్ల లీడర్లు కె.అరుణకుమారి, కృష్ణవేణి, మణి పాల్గొన్నారు. -
సమైక్యహారం.. అపూర్వ మానవహారం
చేతులు కలిశాయి.. సత్తా చూపాయి.. కలిసికట్టుగా సమైక్యాంధ్ర ఆకాంక్షను చాటాయి. శ్రీకాకుళం జిల్లా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సమైక్యభావం వెల్లివిరిసింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి(ఎన్‌హెచ్-16)పై శ్రీకాకుళం జిల్లా ముఖద్వారమైన పైడిభీమవరం నుంచి చివరన ఉన్న ఇచ్ఛాపురం వరకు సుమారు 176 కిలోమీటర్ల పొడవునా అపూర్వ మానవహారం నిర్మించారు. పల్లె, పట్టణం.. ఉద్యోగులు, సామాన్యులు, కర్షకులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉదయం 9 గంటలకే జాతీయ రహదారిపై చేరుకొని 10 నుంచి 11 గంటల వరకు చేతులు కలిపి మానవహారంగా ఏర్పడ్డారు. సాక్షి నెట్వర్క్ : సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రాన్ని విభజించవద్దంటూ అలుపెరుగని పోరు సాగుతున్న పోరు శనివారం నాటికి 32రోజులకు చేరింది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన ప్రదర్శనలు, కాంగ్రెస్ నేతల దిష్టిబొమ్మల దహనాలతో ఉద్యమకారులు హోరెత్తించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరాలరేవు ఆవరణలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం రాష్ట్ర అర్చక సమాఖ్య శాంతి హోమం నిర్వహించింది. కృష్ణా జిల్లా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో విదార్థి జేఏసీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. తిరువూరులో సమైక్య జనగళం పేరిట వేలాది మంది జనం నదించారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట సమైక్యాంధ్రకు మద్దతుగా సంతకాల సేకరణ జరిగింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అధికారులు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించి జాతీయరహదారిని దిగ్బంధం చేశారు. సూళ్లూరుపేట బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి అక్కడే రోడ్డుపై వంటవార్పు నిర్వహించి భోజనాలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులోని పశ్చిమడెల్టా ప్రధాన కాలువలో బల్లకట్టుపై రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పాలకొల్లులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో 80 కిలోమీటర్ల బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో మూడు వేల మంది ఉద్యోగులు సోనియా గాంధీకి ఉత్తరాలు రాశారు. దేవాదాయ శాఖ ఉద్యోగులు పోలీసు ఐలండ్ సెంటర్లో హోమం చేశారు. గుంటూరులో చాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు 48గంటల జిల్లా బంద్ రెండోరోజు శనివారం కూడా విజయవంతమైంది. కర్నూలు జిల్లా నంద్యాలలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 200 లారీలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆళ్లగడ్డలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల బంద్ విజయవంతంగా ముగిసింది. డోన్‌లో కురువ సంఘం ఆధ్వర్యంలో ఒంటెలతో ర్యాలీ చేపట్టారు. ఏపీఎన్జీవోస్, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో నిర్వహించిన సకల జనుల గళం విజయవంతమైంది. విశాఖపట్నంలో ముస్లీం జేఏసీ ఆధ్వర్యంలో ఒంటెలు, గుర్రాలతో ర్యాలీ చేపట్టి జీవీఎంసీ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విజయనగరంలో శనివారం సాయంత్రం ఆరు నుంచి 8 గంటల వరకు జిల్లావ్యాప్తంగా గృహ వినియోగదారులతో పాటు వ్యాపార, వాణిజ్యవర్గాలు స్వచ్ఛందంగా కరెంటు వినియోగం నిలిపివేశాయి. సమైక్య విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణాలు, గ్రామాల్లో ఉన్న వీధి దీపాలను కూడా రెండు గంటల పాటు ఆర్పివేయడంతో జిల్లా మొత్తం అంధకారం అలముకుంది. సీతానగరంలో జేఏసీ ఆధ్వర్యంలో 15కిలోమీటర్ల మేర మానవహారం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటిలో 30 మంది విశ్రాంత ఉద్యోగులు నిరాహారదీక్ష చేపట్టారు. వీరఘట్టంలో 20 వేల మందితో ఉపాధ్యాయ, ఆర్టీసీ ఐక్యకార్యచరణ సమితి ఆధ్వర్యంలో సకలజనగళం నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. రాష్ట్రం ముక్కలైతే భవిష్యత్తరాలకు గంజి కూడా దొరగదంటూ అనంతపురం జిల్లా కణేకల్లులో గంజి పంపిణీ చేసి ఎన్జీఓలు నిరసన వ్యక్తం చేశారు. మార్మోగిన కడప కడప, న్యూస్‌లైన్ : సమైక్య నినాదంతో కడప నగరం మార్మోగింది. సమైక్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన సభకు వైఎస్సార్ జిల్లా నలుమూలల నుంచి లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ట్రాఫిక్ నియంత్రణ పేరుతో పోలీసులు నగరాన్ని దిగ్బంధించినా సమైక్యవాదులు లెక్కచేయలేదు. ప్రతిఒక్కరూ సమైక్యనినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే వేదిక వద్ద కూడా పోలీసులు ఆంక్షలు విధించడంతో జేఏసీ నేతలు ఆగ్రహంతో ఊగి పోయారు. ఓ దశలో కడప డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డిపై చేయి చేసుకున్నంత పనిచేశారు. పోలీసులు మైదానాన్ని వదలివెళ్లాలని నినాదాలు చేశారు. డీఎస్పీ, ఎస్పీ ఇళ్లకు విద్యుత్, నీరు కట్‌చేయడంతో పాటు పారిశుద్ధ్ద్యాన్ని కూడా నిలిపి వేస్తామని హెచ్చరిం చారు. పోలీసు అధికారులు చివరికి దిగివచ్చారు తామేమీ ఆటంకం కలిగించబోమని ప్రొద్దుటూరు, మైదుకూరు డీఎస్పీలు శ్రీనివాసులురెడ్డి, చల్లా ప్రవీణ్‌కుమార్ ఉద్యమకారులకు సర్దిచెప్పారు. సభలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు, అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండటం కోసం దేనికేనా సిద్ధమేనని ప్రకటించారు. 12 నుంచి అంధకారమే ఉద్యమాన్ని తీవ్రం చేయాలని విద్యుత్ ఉద్యోగుల నిర్ణయం ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : సమైకాంధ్ర ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు 12 నుంచి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని విద్యుత్ ఉద్యోగులు నిర్ణయించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ఏ కాలనీలో శనివారం సమైకాంధ్ర విద్యుత్ ఉద్యోగుల (జేఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 13 జిల్లాలకు చెందిన జెన్కో, డిస్కం, ట్రాన్స్‌కో, ఏపీఎస్పీడీసీఎల్లకు చెందిన ఉద్యోగులు హాజరయ్యారు. సమైకాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సాయిబాబా మాట్లాడుతూ సీమాంధ్రలో ఇంత పెద్దఎత్తున ఉద్యమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడం వల్లే 12 నుంచి సమ్మెలో దిగుతున్నట్లు తెలిపారు. ఈనెల 2వ తేదీ నుంచి 4 వరకు వర్క్‌టూరూల్, 5న మూకుమ్మడి సెలవులు, 6న పెన్‌డౌన్, టూల్‌డౌన్, 7న ఛలో హైదరాబాద్ విద్యుత్ సౌధ, 8, 9, 10 తేదీలలో సహాయ నిరాకరణ చేపడతామన్నారు. 11న సిమ్‌కార్డులను యాజమాన్యాలకు అప్పగించి 12 నుంచి సమ్మెలోకి దిగుతామన్నారు. తాము ఉద్యమంలో పాల్గొంటే రాష్ర్టంతోపాటు, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అంధకారం నెలకొంటుందన్నారు. 2 నుంచి ప్రజాప్రతినిధుల ఇళ్లకు ఉన్న విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
కర్నూలులో ‘ జై సమైక్యాంధ్ర’ అన్న లక్ష గొంతుకలు
తాడేపల్లిగూడెంలో నాగళ్లతో రోడ్డెక్కిన రైతన్న అనంతపురంలో న్యాయవాదుల 48 గంటల నిరశన శ్రీకాకుళంలో విద్యుత్ ఉద్యోగులచే హైవే దిగ్బంధం రాజమండ్రిలో 33 మంది మున్సిపల్ కమిషనర్ల సమావేశం సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర కోసం 23 వ రోజూ నిరసనలు, ర్యాలీలు, మావనహారాలతో సీమాంధ్ర జనసంద్రమైంది. లక్షల గొంతుకలు జై సమైక్యాంధ్ర అంటూ గళమెత్తి ఘోషించాయి. ఉద్యమంలో ఊపుతీసుకువచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షలకు మద్దతుగా అనేకచోట్ల నిరాహారదీక్షలు నిర్వహిం చారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని నినదిస్తూ విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకులు రోడ్లపైకి వచ్చి మానవహారాలు జరిగాయి. ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి నేతృత్వంలో కర్నూలు రాజ్‌విహార్ సెంటర్లో నిర్వహించిన ‘లక్షగళ ఘోష’ కార్యక్రమం విజయవంతమైంది. నగరం, శివారులకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాల జేఏసీల ఆధ్వర్యంలో లక్ష గొంతుకలతో చేసిన సమైక్యాంధ్ర నినాదం మారుమోగింది. రాజ్‌విహార్ మూడురోడ్ల కూడలి ఎటూ చూసినా జనసంద్రమైంది. విద్యార్థులు రంగురంగుల దుస్తులు ధరించి, సమైక్యాంధ్ర జెండాలు చేత బూనారు. విద్యుత్ ఉద్యోగులు కర్నూలు జాతీయరహదారిని రెండు గంటల పాటు దిగ్భందించారు. అనంతపురం కలెక్టరేట్ మహిళా ఉద్యోగులు ఉపాధ్యాయ జాక్టో,స్వర్ణకారుల సంఘం, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేశారు. న్యాయవాదులు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. జెడ్పీ ఉద్యోగులు భిక్షాటన చేశారు. ఎస్కే యూనివర్సిటీలో మంత్రులు శైలజానాథ్, రఘువీరా దిష్టిబొమ్మలు, కళ్యాణదుర్గంలో సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్షకు సంఘీభావంగా కడప జిల్లా వ్యాప్తంగా రిలేదీక్షలు సాగుతున్నాయి. ఉపాధ్యాయులు రోడ్లపైకి చేరి కదం తొక్కారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీని వాసులు దీక్ష ను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ బంద్‌ను పాటించారు. బద్వేలులో రెవెన్యూ ఉద్యోగులు భారీ ర్యాలీ తీయగా, రాయచోటిలో రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. చిత్తూరులో ఉన్నతాధికారులు ఉద్యోగులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గాంధీవిగ్రహం వద్ద కోలాటాలు అడగా, మినీలారీ అసోసియేషన్ ర్యాలీ నిర్వహించింది. వీ కోటలో ఆస్పత్రి సిబ్బంది రోగులకు రోడ్డుపైనే చికిత్సలు చేసి నిరసన తెలిపారు. మదనపల్లిలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాల విద్యార్థులకు రోడ్డుపైనే బోధనలు నిర్వహించారు. చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు మహాపాదయాత్ర గురువారం చంద్రగిరికి చేరుకుంది. తిరుపతిలో వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా కుప్పం లో వైఎస్ఆర్సీపీ నేతలు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. విజయవాడకు విశాలాంధ్ర మహాసభ యాత్ర విశాలాంధ్ర మహాసభ బృందం యాత్ర విజయవాడకు చేరిన సందర్భంగా భారీ సభ ఏర్పాటుచేశారు. న్యాయవాదులు, సిబ్బంది గురువారం కూడా కోర్టు గేట్లకు తాళాలు వేసిన నిరసన తెలిపారు. వెఎస్ విజయమ్మ చేపట్టిన నిరాహారదీక్షకు మద్దతుగా జిల్లాలో పలుచోట్ల రిలే నిరాహార దీక్షలు జరిగాయి. మైలవరంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీర్యాలీలో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పాల్గొన్నారు. తెనాలిలో ఆర్టీసీ కార్మికులు మౌనప్రదర్శన చేయగా, రేపల్లెలో యోగాసనాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. తెనాలి, నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, మాచర్లలో వైఎస్ఆర్ సీపీ రిలేదీక్షలు కొనసాగాయి. మంగళగిరిలో విద్యార్థి జేఏసీ సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాండ్రు కమలను ఆందోళనకారులు చుట్టుముట్టారు. ప్రకాశం జిల్లాలో అటెండర్ స్థాయి ఉద్యోగి నుంచి గెజిటెడ్ అధికారి వరకు అందరూ ఉద్యమ బాట పట్టారు. చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ 48 గంటల ఆమరణ దీక్షను విరమించారు. నెల్లూరుజిల్లా ఉదయగిరి నియోజకవర్గం బోగ్యం వారిపల్లికి చెందిన యువకుల నిరసన కార్యక్రమాలకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. విద్యార్థి జేఏసీ, ఎన్జీఓ అసోసియేషన్, గెజి టెడ్ ఆఫీసర్స్‌తోపాటు పలు రాజకీయపార్టీలు జిల్లావ్యాప్తంగా రిలే దీక్షలు, ర్యాలీ లు, రాస్తారోకోలు, మానవహారాలు, వంటావార్పు కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించారు. నాగళ్లతో రోడ్డెక్కిన రైతన్న తాడేపల్లిగూడెంలో వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతులు నాగళ్లు చేతబూని, ఎడ్లబండ్లతో ప్రదర్శన చేశారు. నిడదవోలు ఎమ్మెల్యే శేషారావు కుమ్మర్లతో కలసి కుండలు తయారుచేసి నిరసన తెలిపారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు బుట్టాయిగూడెంలో ఒకరోజు రిలేనిరాహార దీక్ష చేపట్టారు. చింతలపూడిలో కర్రా రాజారావు, ధర్మాజీగూడెంలో మట్టా సురేష్, చిన్నం సురేష్ ఆమరణ నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. విశాఖపట్నం జిల్లాలో ఇన్చార్జి కలెక్టర్ తప్ప ఇతర ఉద్యోగులంతా రోడ్డెక్కారు. గోపాలపట్నం పరిధిలో ఆర్ఆర్ వెంకటాపురంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో వంటావార్పు, ైబె క్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త గండి బాబ్జీ ఆధ్వర్యంలో వేపగుంటలో బైక్ ర్యాలీ తీశారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎన్ఎంయూ ర్యాలీగా వెళ్లి మద్దిలపాలెం వద్ద వైఎస్సార్సీపీ ముస్లిం నేతలు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలిపింది. జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ ఉపాధ్యాయసంఘం ఆధ్వర్యంలో 11 మండలాల్లో ఉపాధ్యాయులు సమ్మెబాట పట్టారు. శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బొడ్డేపల్లి పద్మజ ఆమరణ నిరాహారదీక్ష రెండోరోజూ కొనసాగింది. శ్రీకాకుళంలో జాతీయ రహదారిని విద్యుత్‌శాఖ ఉద్యోగులు దిగ్భందించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం మానవహారం చేపట్టింది. సీమాంధ్రలోని 33 మునిసిపాలిటీల కమిషనర్లు సమైక్యాంధ్రను కాంక్షిస్తూ రాజమండ్రిలో సమావేశమయ్యారు. కాకినాడలో మహిళా సమాఖ్య సభ్యులు ర్యాలీ తీశారు. కలెక్టరేట్ ఎదుట జేఏసీ దీక్షలకు తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఎమ్మెల్సీలు చైతన్య రాజు, రవికిరణ్ వర్మ సంఘీభావం తెలిపారు. దిండి-చించినాడ వంతెనపై రామరాజులంక గ్రామస్తులు వంటావార్పుతో రాస్తారోకో చేసి ఉభయగోదావరి జిల్లాల మధ్య రాకపోకలను స్తంభింప చేశారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. రాజమండ్రి మోరంపూడి జంక్షన్లో వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ చేపట్టిన బస్సు యాత్ర అమలాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో సాగిం ది. పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీజిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలో సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో కొందరికి సోనియా, దిగ్విజయ్ సింగ్, బొత్స,కేసీఆర్ మాస్కులు ధరింపజేసి, వారిని చీపుళ్లు, చేటలతో కొడుతూ రోడ్లపై ఊరేగించారు. సాలూరులో మహిళలు జాతీయ రహదారిపై లలితా సహస్త్రనామ పారాయణం చేశారు. కరీంనగర్ జిల్లా నుంచి బొబ్బిలిలో నివసిస్తున్న ప్రవీణ్ అనే యువకుడికి... ఇరుప్రాంతాల వారు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని కోరతూ పౌర సన్మానం చేశారు. విభజన వేదనతో ఐదుగురు మృతి న్యూస్‌లైన్ నెట్వర్క్ : విభజన చిచ్చుకు గురువారం ఐదుగురు బలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు కూసం నాగేంద్ర (50) హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడి ఉపాధికి విఘాతం కలుగుతుందనే ఆందోళనతో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. లింగపాలెం మండలం కె.గోపవరం పరిధిలోని గణపవారిగూడెంకు చెందిన గద్దే ఆశీర్వాదం (32) టీవీలో సమైక్య ఉద్యమ వార్తలు చూస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. కృష్ణా జిల్లా నందిగామ మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన అరిగెల ప్రసన్న(23) గురువారం పరిటాల సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో జై సమైక్యాంధ్ర అంటూ పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాష్ట్ర విభజనను తట్టుకోలేక అనంతపురంజిల్లా ముదిగుబ్బ మండల కేంద్రం లోని గేట్కొట్టాలకు చెందిన హైదర్‌వలి (55),ఓడీ చెరువు మండలం జంబులవాండ్లపల్లికి చెందిన జంబుల గంగిరెడ్డి (50) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. కాగా, పెద్దపంజాణి మండలం బొమ్మలకుంటకు చెందిన నడిమింటి ఈశ్వరయ్య (44) శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పం టించుకోబోగా, ఉద్యమకారులు అడ్డుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో చోటుచేసుకుంది. విభజన జరిగితే తనకు వికలాంగుల పింఛన్ రాదేమోనన్న బెంగతో చాగల్లు మండలం ఊనగట్లకు చెందిన కొడమంచిలి శ్రీను ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోడూరులో కరెళ్ల సత్యనారాయణ (30) పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయమ్మ దీక్షా శిబిరాన్ని సందర్శించిన అనంతరం గుంటూరులోని సంగడికుంట ప్రాంతానికి చెందిన షేక్ అల్లాబక్షు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీక్షా శిబిరం ఎదురుగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ‘జగనన్న బయటకు రావాలి, ప్రజలకు న్యాయం చేయాలి’ అని నినాదాలు చేస్తూ నిప్పంటించుకోబోయాడు. పోలీసులు అప్రమత్తమై అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. 26 నుంచి నేతల ఇళ్లకు సేవలు బంద్ మున్సిపల్ ఉద్యోగుల సంఘం ప్రకటన తిరుపతి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రాకపోతే చిత్తూరు జిల్లాలో ప్రజాప్రతినిధుల ఇళ్లకు తాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాలు వంటి సేవలను ఈనెల 26నుంచి నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.లోకేశ్వర వర్మ తిరుపతిలో గురువారం ప్రకటించారు. ఈనెల 12 నుంచి సమ్మెబాట పట్టిన మున్సిపల్ ఉద్యోగులు గురువారం ఒంటికాలిపై నిలుచుని నిరసన తెలిపారు. -
‘శ్రీకృష్ణ’ నివేదికపై చర్చించకనే.. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా?
పీలేరు, న్యూస్‌లైన్ : శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఎటువంటి చర్చ లేకుండానే రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేస్తారని పీలేరు సమైక్యాంధ్ర జేఏసీ నేతలు, పలువురు ఉద్యమకారులు ప్రశ్నించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా గురువారం పీలేరు జేఏసీ ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్థులచే నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఓట్లు, సీట్ల రాజకీయం కోసం సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమ ఎడారిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రమంతా పర్యటించి శ్రీకృష్ణకమిటీ తయారు చేసిన సిఫార్సులపై ఎటువంటి చర్చ జరుపకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నియంతలా వ్యవహరించి ఏకపక్ష నిర్ణయం తీసుకుందని దుయ్యబట్టారు. సీడబ్ల్యూసీ కేవలం పది సీట్ల కోసం ఆరు కోట్ల సీమాంధ్రుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. సాగునీటి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపకనే రాష్ట్రాన్ని విభజిస్తే వ్యవసాయ రంగం చిన్నాభిన్నమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీ ఎన్జీవోల సమ్మెతో సీమాంధ్రలోని 13 జిల్లాలో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. పీలేరు ట్యాక్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో వాహనాల ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతు పలికారు. వేలాది మంది విద్యార్థులతో క్రాస్ రోడ్ కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీలేరు సమైక్య జేఏసీ నాయకులతోపాటు టీటీడీ బోర్డు సభ్యుడు జీవీ శ్రీనాథరెడ్డి, మండల విద్యాశాఖాధికారి ఏటీ రమణారెడ్డి, వివిధ ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు, కళాశాలల కరస్పాండెంట్లు, యాజమాన్యం, అధ్యాపక బృందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆవశ్యకతను వివరిస్తూ విద్యార్థులకు వక్తృత్వ, వేషధారణ పోటీలు నిర్వహించారు.