సమైక్యహారం.. అపూర్వ మానవహారం | seemandhra people made a like for samaikyandhra | Sakshi
Sakshi News home page

సమైక్యహారం.. అపూర్వ మానవహారం

Published Sun, Sep 1 2013 4:04 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM

సమైక్యహారం.. అపూర్వ మానవహారం

సమైక్యహారం.. అపూర్వ మానవహారం

చేతులు కలిశాయి.. సత్తా చూపాయి.. కలిసికట్టుగా సమైక్యాంధ్ర ఆకాంక్షను చాటాయి. శ్రీకాకుళం జిల్లా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సమైక్యభావం వెల్లివిరిసింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి(ఎన్‌హెచ్-16)పై శ్రీకాకుళం జిల్లా ముఖద్వారమైన పైడిభీమవరం నుంచి చివరన ఉన్న ఇచ్ఛాపురం వరకు సుమారు 176 కిలోమీటర్ల పొడవునా అపూర్వ మానవహారం నిర్మించారు. పల్లె, పట్టణం.. ఉద్యోగులు, సామాన్యులు, కర్షకులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉదయం 9 గంటలకే జాతీయ రహదారిపై చేరుకొని 10 నుంచి 11 గంటల వరకు చేతులు కలిపి మానవహారంగా ఏర్పడ్డారు.  
 
 సాక్షి నెట్‌వర్క్ : సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రాన్ని విభజించవద్దంటూ అలుపెరుగని పోరు సాగుతున్న పోరు శనివారం నాటికి 32రోజులకు చేరింది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన ప్రదర్శనలు, కాంగ్రెస్ నేతల దిష్టిబొమ్మల దహనాలతో ఉద్యమకారులు హోరెత్తించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరాలరేవు ఆవరణలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం రాష్ట్ర అర్చక సమాఖ్య శాంతి హోమం నిర్వహించింది. కృష్ణా జిల్లా విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో విదార్థి జేఏసీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. తిరువూరులో సమైక్య జనగళం పేరిట వేలాది మంది జనం నదించారు.
 
 ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట సమైక్యాంధ్రకు మద్దతుగా సంతకాల సేకరణ జరిగింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అధికారులు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించి జాతీయరహదారిని దిగ్బంధం చేశారు. సూళ్లూరుపేట బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి అక్కడే రోడ్డుపై వంటవార్పు నిర్వహించి భోజనాలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులోని పశ్చిమడెల్టా ప్రధాన కాలువలో బల్లకట్టుపై రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పాలకొల్లులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో 80 కిలోమీటర్ల బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో మూడు వేల మంది ఉద్యోగులు సోనియా గాంధీకి ఉత్తరాలు రాశారు.
   దేవాదాయ శాఖ ఉద్యోగులు పోలీసు ఐలండ్ సెంటర్‌లో హోమం చేశారు. గుంటూరులో చాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు 48గంటల జిల్లా బంద్ రెండోరోజు శనివారం కూడా విజయవంతమైంది. కర్నూలు జిల్లా  నంద్యాలలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 200 లారీలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆళ్లగడ్డలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల బంద్ విజయవంతంగా ముగిసింది. డోన్‌లో కురువ సంఘం ఆధ్వర్యంలో ఒంటెలతో ర్యాలీ చేపట్టారు. ఏపీఎన్‌జీవోస్, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో నిర్వహించిన సకల జనుల గళం విజయవంతమైంది. విశాఖపట్నంలో ముస్లీం జేఏసీ ఆధ్వర్యంలో ఒంటెలు, గుర్రాలతో ర్యాలీ చేపట్టి జీవీఎంసీ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విజయనగరంలో శనివారం సాయంత్రం ఆరు నుంచి 8 గంటల వరకు జిల్లావ్యాప్తంగా గృహ వినియోగదారులతో పాటు వ్యాపార, వాణిజ్యవర్గాలు స్వచ్ఛందంగా కరెంటు వినియోగం నిలిపివేశాయి.
 
  సమైక్య విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణాలు, గ్రామాల్లో ఉన్న వీధి దీపాలను కూడా రెండు గంటల పాటు ఆర్పివేయడంతో  జిల్లా మొత్తం అంధకారం అలముకుంది. సీతానగరంలో జేఏసీ ఆధ్వర్యంలో 15కిలోమీటర్ల మేర మానవహారం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటిలో 30 మంది విశ్రాంత ఉద్యోగులు  నిరాహారదీక్ష చేపట్టారు. వీరఘట్టంలో 20 వేల మందితో ఉపాధ్యాయ, ఆర్టీసీ  ఐక్యకార్యచరణ సమితి ఆధ్వర్యంలో సకలజనగళం నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. రాష్ట్రం ముక్కలైతే భవిష్యత్‌తరాలకు గంజి కూడా దొరగదంటూ అనంతపురం జిల్లా కణేకల్లులో గంజి పంపిణీ చేసి ఎన్‌జీఓలు నిరసన వ్యక్తం చేశారు.   
 
 మార్మోగిన కడప
 కడప, న్యూస్‌లైన్ : సమైక్య నినాదంతో కడప నగరం మార్మోగింది. సమైక్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన సభకు వైఎస్సార్ జిల్లా నలుమూలల నుంచి లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ట్రాఫిక్ నియంత్రణ పేరుతో పోలీసులు నగరాన్ని దిగ్బంధించినా సమైక్యవాదులు లెక్కచేయలేదు. ప్రతిఒక్కరూ సమైక్యనినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే వేదిక వద్ద కూడా పోలీసులు ఆంక్షలు విధించడంతో జేఏసీ నేతలు ఆగ్రహంతో ఊగి పోయారు.
 
 ఓ దశలో కడప డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డిపై చేయి చేసుకున్నంత పనిచేశారు. పోలీసులు మైదానాన్ని వదలివెళ్లాలని నినాదాలు చేశారు. డీఎస్పీ, ఎస్పీ ఇళ్లకు విద్యుత్, నీరు కట్‌చేయడంతో పాటు పారిశుద్ధ్ద్యాన్ని కూడా నిలిపి వేస్తామని హెచ్చరిం చారు. పోలీసు అధికారులు చివరికి దిగివచ్చారు తామేమీ ఆటంకం కలిగించబోమని ప్రొద్దుటూరు, మైదుకూరు డీఎస్పీలు శ్రీనివాసులురెడ్డి, చల్లా ప్రవీణ్‌కుమార్ ఉద్యమకారులకు సర్దిచెప్పారు. సభలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు, అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ,  రాష్ట్రం  ముక్కలు కాకుండా ఉండటం కోసం దేనికేనా సిద్ధమేనని ప్రకటించారు.  
 
 12 నుంచి అంధకారమే
 ఉద్యమాన్ని తీవ్రం చేయాలని విద్యుత్ ఉద్యోగుల నిర్ణయం
 ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : సమైకాంధ్ర ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు 12 నుంచి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని విద్యుత్ ఉద్యోగులు నిర్ణయించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్‌ఏ కాలనీలో శనివారం సమైకాంధ్ర విద్యుత్ ఉద్యోగుల (జేఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 13 జిల్లాలకు చెందిన జెన్‌కో, డిస్కం, ట్రాన్స్‌కో, ఏపీఎస్‌పీడీసీఎల్‌లకు చెందిన ఉద్యోగులు హాజరయ్యారు. సమైకాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సాయిబాబా మాట్లాడుతూ సీమాంధ్రలో ఇంత పెద్దఎత్తున ఉద్యమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడం వల్లే 12 నుంచి సమ్మెలో దిగుతున్నట్లు తెలిపారు.
 
 ఈనెల 2వ తేదీ నుంచి 4 వరకు వర్క్‌టూరూల్, 5న మూకుమ్మడి సెలవులు, 6న పెన్‌డౌన్, టూల్‌డౌన్, 7న ఛలో హైదరాబాద్ విద్యుత్ సౌధ, 8, 9, 10 తేదీలలో సహాయ నిరాకరణ చేపడతామన్నారు. 11న సిమ్‌కార్డులను యాజమాన్యాలకు అప్పగించి 12 నుంచి సమ్మెలోకి దిగుతామన్నారు. తాము ఉద్యమంలో పాల్గొంటే రాష్ర్టంతోపాటు, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అంధకారం నెలకొంటుందన్నారు. 2 నుంచి ప్రజాప్రతినిధుల ఇళ్లకు ఉన్న విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని  నిర్ణయించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement