సురక్షితంగా ఇంటి మార్గం
ఊపిరి పీల్చుకున్న అమర్‌నాథ్ యాత్రికులు
గజ్వేల్ : అమర్‌నాథ్ యాత్రికలు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. యాత్రను ముగించుకొని తిరుగు ప్రయాణంలో.. కాశ్మీర్‌లో చెలరేగిన అల్లర్ల కారణంగా మూడు రోజులుపాటు భయానక పరిస్థితుల్లో ఉన్న విషయం విదితమే. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్, బాల్టాక్ ప్రాంతాల్లో తలదాచుకున్న గజ్వేల్ నియోజకవర్గంతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఇళ్లకు బయలుదేరారు. గజ్వేల్, రంగారెడ్డి జిల్లా అల్వాల, హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్, మలక్‌పేట ప్రాంతాలకు చెందిన 105 మంది దిల్‌షుక్‌నగర్‌లోని రాణా ట్రావెల్స్ ద్వారా అమర్‌నాథ్ యాత్రకు వె ళ్లారు. ఇందులో 39మంది లాల్‌చౌక్‌లోని ఓ లాడ్జిలో ఆశ్రయం పొందగా..
మిగిలిన వారు బాల్టాక్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపారు. సోమవారం తెల్లవారుజామున లాల్‌చౌక్ ప్రాంతంలో ఉన్న వారంతా శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు సైతం విమానంలో వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయాన్ని గజ్వేల్‌కు చెందిన అంతునూరి శివకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. మిగతా వారంతా బస్సుమార్గంలో ఢిల్లీకి బయల్దేరారు. యాత్రికులంతా సురక్షితంగా ఇంటిమార్గం పట్టడంతో వారి కుటుంబీకులు సంతోషంలో మునిగారు.