
అర్ధరాత్రి దాకా ఆస్తి గొడవ!
♦ ఆ తర్వాత కొద్ది గంటలకే రాజయ్య ఇంట్లో ఘోరం
♦ ఎన్నికల ఖర్చుల కోసం భూమి అమ్మాలని రాజయ్య నిర్ణయం
♦ తన భవిష్యత్తుకు భరోసా ఇవ్వకుండా అమ్మొద్దన్న కోడలు సారిక
♦ రాత్రి ఒంటిగంట దాకా గొడవ జరిగిందంటున్న ఇరుగుపొరుగు
♦ అంతకుముందు రోజు భృతిపై కోర్టులోనూ వాదులాట
సాక్షి, హన్మకొండ: వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల సజీవ దహనం కేసు విచారణలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. అగ్ని ప్రమాదానికి కొన్ని గంటల ముందు రాజయ్య కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపకం విషయంలో తీవ్రస్థాయిలో గొడవ జరిగినట్లు సమాచారం. ఘటన జరిగిన రోజు రాత్రి ఇంట్లో రాజయ్య, మాధవి, అనిల్, సారికతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మంగళవారం రాత్రి వరంగల్ ఉప ఎన్నికల్లో ఖర్చుల కోసం రఘునాథ్‌పల్లి మండలంలో ఉన్న వ్యవసాయ భూమి అమ్మాలని రాజయ్య నిర్ణయించారు.
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే తనకు, తన పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా వ్యవసాయ భూమిని అమ్మడం సరికాదని సారిక అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘రెవెన్యూ కాలనీలో ఉన్న ఇంటిని నీకు కేటాయిస్తాం. వ్యవసాయ భూమి విషయంలో జోక్యం చేసుకోవద్దు’ అని సారికకు రాజయ్య చెప్పారు. ఇంతలో ఎలాంటి ఆస్తి ఇచ్చేది లేదంటూ ఇతర కుటుంబ సభ్యులు సారికతో వాగ్వాదానికి దిగారు. ఇదే అంశంపై గంటల తరబడి కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట వరకు రాజయ్య ఇంటి నుంచి కేకలు వినిపించినట్లు ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. కేకలు సద్దుమణిగిన కొద్ది గంటల వ్యవధిలోనే జరిగిన అగ్నిప్రమాదంలో సారిక, ఆమె ముగ్గురు పిల్లలు మృతి చెందారు.
కోర్టులోనూ గొడవే..
భర్త అనిల్ నుంచి జీవనభృతి ఇప్పించాలంటూ గృహహింస చట్టం ప్రకారం కిందటేడాది జూన్‌లో వరంగల్ నాలుగో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో సారిక కేసు దాఖలు చేసింది. జీవనభృతి కింద సారికకు నెలకు రూ.6,000, ఆమె ముగ్గురు పిల్లలు ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున మొత్తం రూ.15,000 భర ణం చెల్లించాలని 2015 జనవరిలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయినా జనవరి నుంచి జూలై వరకు భృతి చెల్లించకపోవడంతో జూలైలో సారిక మరోసారి కోర్టుకెక్కింది. దీంతో ఏడు నెలలకు కలిపి అనిల్ రూ.1.05 లక్షల బకాయికిగాను రూ.45 వేలు చెల్లించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 2న (సోమవారం) సారిక, అనిల్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వా దం చోటు చేసుకుంది. ఇది జరిగిన మరుసటి రోజు అర్ధరాత్రి అనుమానాస్పద రీతిలో సారిక , ఆమె ముగ్గురు పిల్లలు మరణించారు.
కాల్‌డేటా వివరాల సేకరణ
జీవనభృతి కేసు విచారణ, ఆస్తుల పంపకం విషయంలో గొడవ నేపథ్యంలో సారిక మరణించడంతో హత్య కోణంలో సైతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. గొడవ జరిగిన తర్వాత అనిల్‌తో పాటు రాజయ్య, మాధవి ఫోన్‌కాల్ డేటా వివరాలపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గొడవ జరిగిన తర్వాత ఈ ముగ్గురు ఎవరికైనా ఫోన్ చేశారా? చేస్తే ఎవరికి చేశారనే అంశంపై లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. జీవనభృతి, ఆస్తుల పంపకంపై అనిల్, సారిక మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యంలో అనిల్ రెండో భార్య, ఆమె తరఫున వ్యక్తులెవరికైనా ఈ దుర్ఘటనతో సంబంధం ఉందా అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు.