జీవో 271 నిలిపివేయాలి
Published Wed, Aug 3 2016 12:34 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
– నేడు మండల కార్యాలయాల వద్ద అఖిలపక్ష రైతు సంఘాల ధర్నా
– విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులకు గౌరు పిలుపు
కర్నూలు(ఓల్డ్‌సిటీ):
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 271 జీవోను వెంటనే నిలిపివేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. టైటిల్‌డీడ్ లేకుండానే కేవలం 1బీ ఆధారంగానే రైతులకు భూములు బదలాయింపు, బ్యాంకు రుణాలు అందజేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. దీంతో పట్టాదార్ పాస్‌బుక్, టైటిల్‌డీడ్‌లకు విలువ లేకుండా పోతుందని, ఈ విధానం అనేక రకాలైన వివాదాలకు దారి తీస్తుందని తెలిపారు. 1బీలో ఉద్దేశపూర్వకంగా అసలు భూమి యజమానికి బదులు మరొకరి పేరు చేర్చి రిజిష్టర్ జరిపిస్తే ఆ రైతు కుటుంబం రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. 1బీలో మార్పులు, భూమిపై హక్కులు, రికార్డుల్లో మార్పు, మ్యుటేషన్ వంటి వాటి కోసం అర్జీలు ఇచ్చి నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా మార్పులు చేయడం లేదని, వేలాది రూపాయలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఆన్‌లైన్‌లో జరిగిన మార్పులను చదువులేని సామాన్య రైతులు ఏవిధంగా చూసుకోగలరని ప్రశ్నించారు. జీవో నిలిపివేయాలనే డిమాండ్‌తో బుధవారం అఖిల పక్ష రైతు సంఘాలు మండల కార్యాలయాల వద్ద చేపట్టే ధర్నాలో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గౌరు వెంకటరెడ్డి ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement