నా పెళ్లి ఆపేయండి మేడమ్..?!
♦ జేసీ ఆమ్రపాలికి ఓ బాలిక మొర
♦ నేరుగా కలెక్టరేట్‌కు వె ళ్లిన వైనం
బాల్యంలోనే పెళ్లి చేయాలనే తన తండ్రి
ఆలోచనకు ఓ బాలిక అడ్డు తగిలింది. తనకు చిన్న వయసులోనే పెళ్లి ఇష్టం లేదని చెప్పినా వినని తండ్రిపై విసుగు చెంది ఏకంగా కలెక్టరేట్ గడప తొక్కింది. తనకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని.. ఇంకా చదువుకుంటానని జాయింట్ కలెక్టర్‌కు తెగేసి చెప్పింది. ఏదైనా చదువులమ్మ ఒడిలో తనను చేర్చాలని ఆ సరస్వతి పుత్రిక కోరింది.
మొయినాబాద్: నా వయసు పదహారేళ్లే.. మా నాన్న నాకు ఇప్పుడే పెళ్లి చేయాలని చూస్తున్నాడు.. నాకిష్టం లేదు.. పెళ్లి చేసుకోకపోతే చెల్లిని, తమ్ముడిని చంపేస్తానని బెదిరిస్తున్నారు.. నాకింకా చదువుకోవాలని ఉంది.. ఎలాగైనా నా పెళ్లి ఆపేయండి మేడమ్.. నన్ను చదివించండి అంటూ ఓ బాలిక రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలికి మొరపెట్టుకుంది. మొయినాబాద్ మండలం మేడిపల్లికి చెందిన ఓ బాలిక (16) గతేడాది పదో తరగతి పూర్తి చేసింది. ఆమె వయసు 16 ఏళ్లు. అయితే తండ్రి ఆమెకు పెళ్లి చేయాలని చూస్తుండడంతో ఇష్టంలేని ఆ బాలిక శనివారం నేరుగా కలెక్టరేట్‌కు వెళ్లింది.
జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలిని కలిసి తన పెళ్లిని ఆపేయాలని కోరింది. తనకు పెళ్లి చేసేందుకు తన తండ్రి ప్రయత్నిస్తున్నాడని, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిపింది. పెళ్లి చేసుకోకపోతే తన చెల్లిని, తమ్ముడిని చంపేస్తానని తండ్రి బెదిరిస్తున్నాడని వాపోయింది. తనకు చదువుకోవాలని ఉందని, ఎక్కడైనా హాస్టల్లో ఉంచి చదివించాలని కోరింది. తాను తిరిగి ఇంటికి వెళ్తే తన తండ్రి చంపేస్తాడని తెలిపింది. దీంతో వెంటనే స్పందించిన జేసీ ఆ బాలికను స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. ఆమెను అక్కడి నుంచి రెస్క్యూ హోమ్‌కు తరలించారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఐసీడీఎస్ చేవెళ్ల ప్రాజెక్టు అధికారులు తెలిపారు.