సత్యసాయి తాగునీరు బంద్
Published Sun, Jul 31 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
మక్తల్ : రైతులకు సాగునీరు అందించేందుకు పంచదేవ్‌పాడు గ్రామం కృష్ణానదికి భీమా కాల్వ పనులు ముమ్మరంగా పనులు చేస్తున్నారు. పనుల నిర్వహణలో సత్యసాయి పైపులైన్ పగిలిపోవడంతో దాదాపు 15రోజుల నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో మక్తల్ నియోజకవర్గ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టర్ పనులు సకాలంలో చేసి ఉంటే ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఉండేవని, ఆయన నిర్లక్ష్యంతోనే సత్యసాయి తాగునీటి సరఫరా నిలిచిపోయిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. భీమా కాల్వ పనులు చేస్తున్న సమయంలో పైపులు పగిలిపోవడంతో మరో చోట పైపులు ఏర్పాటు చేశారు. కాల్వ పనులు చేస్తున్న సమయంలో నది నుంచి నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో మరోచోట వేసిన రోడ్డు తెగిపోయింది. కాల్వ పనులు పరిశీలించడానికి వచ్చిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి సందర్శించి సత్యసాయి పైపులైన్ విషయం తెలిపినా ఫలితం లేకుండాపోయింది. దీంతో తాగునీటి సరఫరా బంద్ చేయడంతో నియోజకవర్గంలోని 65గ్రామాలకు తాగునీరు నిలిచిపోయింది. ఈ పథకం ఎల్‌అండ్‌టీ కంపెనీ ఆదీనంలో 1999నుంచి కొనసాగుతుంది. మక్తల్ మండలం పారేవుల హెడ్‌వర్క్ నుంచి మండలంలోని 25గ్రామాలకు, మాగనూరు మండలంలో 14 గ్రామాలకు, ఊట్కూర్ మండలంలో 7గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. పైప్‌లైన్ పగలడంతో సత్యసాయి తాగునీటిపై ఆధారపడిన గ్రామాలు నీరులేక అల్లాడిపోతున్నాయి. పైపులైన్ నిర్మాణానికి మాత్రం మోక్షం లభించడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాల్వ పనులు చేయడంతో పారేవుల, ముస్లాయిపల్లి, అనుగొండ, గడ్డంపల్లి, అంకేన్‌పల్లి, దాదాన్‌పల్లి గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు సైతం దారిలేక బంద్ చేశారు. ఈ గ్రామాలకు వెళ్లే ప్రజలు పంచలింగాల, చిన్నగోప్లాపూర్ గ్రామాల మీదుగా వెళ్తున్నారు. కనీసం అనుగొండ, పారేవుల, గడ్డంపల్లి పుష్కరఘాట్‌లకు రోడ్డు లేకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement