sathyasai
-
ఏడో రోజు వైఎస్సార్సీపీ బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి: గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఈ యాత్ర ఏడో రోజు శనివారం సత్యసాయి జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు, విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గాల్లో జరుగుతుంది. సత్యసాయి జిల్లా: ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ధర్మవరం టౌన్ పోలీసు స్టేషన్ నుంచి ర్యాలీ జరపనున్నారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు అంజాద్ బాషా, గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక తదితరులు పాల్గొనున్నారు. గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బస్సుయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2:45 గంటలకు సంగడిగుంట వైఎస్సార్ విగ్రహం నుంచి బీఆర్ స్టేడియం మీదుగా మాయాబజార్ వరకు యాత్ర కొనసాగనుంది. మాయాబజార్ మెయిన్ రోడుపై 3:30 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, నేతలు జంగా కృష్ణమూర్తి, వంగపండు ఉష, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, తదితరులు హాజరుకానున్నారు. విజయనగర జిల్లా: ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శృంగవరపుకోటలో బస్సుయాత్ర ప్రారంభం కానుంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మేరుగ నాగార్జున తదితరులు హాజరుకానున్నారు. ఉదయం 10:30 గంటలకు అలమండలో కళ్యాణ మండపం వద్ద విలేకర్ల సమావేశం నిర్వహించనున్నారు. 11:20 కి జగనన్న కాలనీ, గ్రామ సచివాలయం సందర్శించనున్నారు. అనంతరం కొత్తవలస మీదుగా ఎస్.కోట వరకు బైకు ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 3:30 గంటలకు ఎస్.కోట దేవి జంక్షన్లో బహిరంగ సభ జరగనుంది. చదవండి: సంపూర్ణ సాధికారత -
టీడీపీ నేత కీచక పర్వం.. విద్యార్ధినికి వేధింపులు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరం మండలం గొట్లూరులో టీడీపీ నేత భాస్కర్ కీచక పర్వానికి తెగబడ్డాడు. ఆటోలో వెళ్తున్న పదో తరగతి విద్యార్ధినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆటోలో నుంచి బయటకు లాక్కెళ్లి విద్యార్ధినిపై అత్యాచారయత్నం చేశాడు. ఈ క్రమంలో బాలికకు గాయాలవ్వగా.. ఆసుపత్రికి తరలించారు.బాధితురాలి తల్లిదండ్రులు పోలసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: గూడూరులో నకిలీ రైల్వే డీఎస్పీ అరెస్ట్ -
Narayanamma Niraganti: డాక్టరేట్ కలను ‘సెల్ఫ్ హెల్ప్’ నెరవేర్చింది
కుగ్రామం నుంచి ఈ కామర్స్ దాకా నారాయణమ్మ విజయగాధ నారాయణమ్మ నీరగంటి... ఆంధ్రప్రదేశ్, సత్యసాయి జిల్లాలోని ముష్టి కోవెల అనే చిన్న గ్రామంలో అత్యంత సామాన్యమైన కుటుంబంలో పుట్టిన మహిళ. చదువంతా ప్రభుత్వ విద్యావ్యవస్థలోనే. ఆమె ఈ రోజు ఒక ‘ఈ కామర్స్’ సంస్థను స్థాపించి తోటి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కావాలనే తన కలను నిజం చేసుకోవడానికి పీహెచ్‌డీలో చేరారు. త్వరలో పట్టానందుకోనున్న నారాయణమ్మ తన ఆకాంక్షల సుమహారాన్ని సాక్షితో పంచుకున్నారు. డ్వాక్రా దారి చూపింది ‘‘మా నాన్న రైతు. పిల్లల్ని బాగా చదివించాలనే కోరిక మాత్రం బలంగా ఉండేది. ఐదవ తరగతి వరకు మా ఊరి బడిలో చదివాను. ఆరు, ఏడు తరగతులకు ఉదయం ఐదు కిలోమీటర్లు, సాయంత్రం ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. దాంతో అనంతపురంలో ఒక చిన్న గది అద్దెకు తీసుకుని నన్ను, మా అన్నను చదివించారాయన. అలా ఎనిమిదవ తరగతి నుంచి నేను ఇంటిపని, వంట పని చేసుకుంటూ చదువుకున్నాను. అనంతపూర్‌లో డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంబీఏకి ఆళ్లగడ్డ వెళ్లాను. ఆ తర్వాత పెళ్లితో హైదరాబాద్ రావడం నా ఉస్మానియా కల నెరవేరడానికి మార్గం సుగమం చేసింది. అధ్యయనానికి విద్యాసంవత్సరంలో ‘సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ చాలెంజెస్’ అంశాన్ని తీసుకున్నాను. 2010–11 నుంచి రంగారెడ్డి, సత్యసాయి జిల్లాల్లో డ్వాక్రా సంఘాలను అధ్యయనం చేశాను. మొత్తం ఐదు వందల గ్రూపుల కార్యకలాపాలను తెలుసుకున్న తర్వాత గ్రామీణ మహిళల్లో ఉన్న నైపుణ్యాలు, అవకాశాల మీద ఒక అవగాహన వచ్చింది. ఆర్థిక స్వావలంబనను, స్వయంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడాన్ని ఆస్వాదిస్తున్నారు. దాంతో వారిలో ఆత్మవిశ్వాసం కూడా మెరుగైంది. అవకాశాలు అందివస్తే ఇంకా ఏదో సాధించాలనే తపన కూడా కొందరిలో ఉంది. అలాంటి అభిరుచి ఉన్న వాళ్లకు వనరులు, ప్రభుత్వ అధికారుల సహకారం ఉంటే అద్భుతాలు చేయగలుగుతారు కూడా. ఇలాంటి సమన్వయం కొన్ని చోట్ల లేకపోవడం కూడా గమనించాను. మొత్తానికి మార్కెటింగ్ గురించిన ఆందోళన లేకపోతే ఉత్పత్తి విషయంలో శ్రమించడానికి వాళ్లు వెనుకాడరు. నా అధ్యయనం ఇలా సాగుతున్న సమయంలోనే కరోనా వచ్చింది. కరోనా కొల్లగొట్టింది కరోనా సమయంలో హోటళ్లతో సహా అన్నీ మూత పడడంతో ఉద్యోగాలు లేక ఏదో ఒక పని దొరికితే చాలన్నట్లు చాలా మంది కనిపించారు. శ్రమించే చేతులున్నాయి, ఆ ఉత్పత్తి అవసరమైన వ్యక్తులున్నారు. వాళ్ల మధ్య కరోనా కరాళ నృత్యం చేస్తోంది. అప్పుడు ఈ కామర్స్ రంగంలో ఓ ప్రయత్నం చేశాను. కర్పూరం తయారీ దారుల నుంచి కర్పూరాన్ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇంటింటికీ చేర్చడంలో విజయవంతమయ్యాను. మీషోలో సరదాగా మొదలు పెట్టిన రీ సేల్ అనుభవమూ తోడైంది. నా మార్కెట్‌ను విస్తరించడానికి శాన్విస్ స్టోర్, భవిత శ్రీ ట్రేడింగ్, ఫ్యాషన్, లేజీ షాపింగ్ వాణిజ్య వేదికలతో సెల్లర్‌గా అమెజాన్‌తో అనుసంధానమయ్యాను. ఆ అనుభవంతో గత ఏడాది నవంబర్‌లో మీథాట్ ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సొంత కంపెనీ ప్రారంభించాను. ఏడాది కోటి రూపాయల టర్నోవర్‌కు చేరుతుందని అంచనా. ఏడాదికి నికర లాభం ఏడెనిమిది లక్షలుండవచ్చు. గ్రామాలకు విస్తరించాలి ఇప్పటి వరకు నా నెట్వర్క్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అనంతపూర్, చిత్తూరు, గుంటూరు వంటి కొన్ని చోట్లలోనే ఉంది. ఇక గ్రామాల్లో ఉండే డ్వాక్రా మహిళలను అనుసంధానం చేయాలి. ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రాజెక్ట్ గ్రామాల్లో పెట్టాలనేది నా ఆలోచన. ఒక కుటుంబానికి అవసరమైన ప్రతి వస్తువూ నా ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ మీద లభించేటట్లు పటిష్ఠం చేయాలి. అలాగే విదేశాలకు సీమంతం కిట్, ఒడిబియ్యం కిట్, గర్భిణి తినాల్సిన పిండివంటలను ఎగుమతి చేయాలి. ఈ సర్వీస్ ఈ కామర్స్‌లో లేదు. ఈ కామర్స్ వేదిక లైసెన్స్, ట్రేడ్‌మార్క్, కాపీ రైట్స్, పేటెంట్లు, ఫుడ్ లైసెన్స్, వెబ్సైట్ నిర్మాణం, ప్రమోషన్ కోసం మూడు లక్షల వరకు ఖర్చు చేశాను. ఇవన్నీ ఇందులోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. నా ఈ ప్రయత్నంలో గృహిణులు, ఒంటరి మహిళలు, అరవై నిండిన పెద్దవాళ్లు కూడా ఉపాధి పొందుతున్నారు. ఉపాధినిస్తోంది మూడేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత పీహెచ్డీ కోసం ఉద్యోగం మానుకున్నాను. ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరతానని అప్పుడనుకోలేదు. లెక్చరర్‌గా భర్త సంపాదనకు తోడు నేనూ ఉద్యోగం చేసుకుంటూ , ఇద్దరమ్మాయిలను పెంచుకుంటూ ప్రశాంతంగా ఉండవచ్చు. కానీ నేను చేసిన ఎంబీయే ఫైనాన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల మీద పీహెచ్డీ నన్ను చిన్న పరిధిలో ఉంచడానికి ఇష్టపడలేదు. ఈ సాహసానికి ఒడిగట్టేలా ప్రోత్సహించాయి. మా గైడ్ శ్రీరాములు గారి పర్యవేక్షణలో నా పరిశోధన పూర్తయింది. డాక్టర్ నారాయణమ్మ అనే పేరు నా చిన్నప్పటి కల’’ అన్నారు నారాయణమ్మ. కల నెరవేరు తున్న ఆనందం ఆమె కళ్లలో కనిపించింది, ఆ మాట చెప్తున్నప్పుడు ఆ స్వరంలో ఆనందం తొణికిసలాడింది. ఎక్కడి ఆర్డర్‌కి అక్కడే పరిష్కారం ఆహారం మీద ప్రత్యేక దృష్టి పెట్టాను. నగరాల్లో మహిళలందరూ ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారాల్లో నిమగ్నమై ఉంటున్నారు. పిల్లలకు మన రుచులను ఇంట్లో చేసి పెట్టడం వాళ్లకు కష్టమే. అందుకే సౌత్ ఇండియన్ స్నాక్స్ హోమ్మేడ్వి అందిస్తున్నాను. నా నెట్‌వర్క్‌లో 30కి పైగా మహిళలున్నారు. ఒక ప్రదేశం నుంచి ఆర్డర్ రాగానే అదే ప్రదేశంలో ఉన్న మహిళకు ఫార్వర్డ్ చేస్తాను. మెటీరియల్ కొనుగోలు, ఆమె శ్రమకు వేతనం ఇస్తాను. ఆమె పిండివంటలు తయారు చేసి ప్యాక్ చేసి ఉంచుతుంది. మా కొరియర్ నెట్వర్క్ వాళ్లు ఆమె ఇంటికి వెళ్లి పార్సిల్‌ను కలెక్ట్ చేసుకుని కొరియర్ ఆర్డర్ ఇచ్చిన వినియోగదారులకు చేరుస్తారు. దాంతో పిండివంటలు తయారు చేసిన రోజే అందుతుండడంతో బాగా క్లిక్ అయింది. – వాకా మంజులారెడ్డి -
వైఎస్ఆర్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డ్: శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్
-
భారతీయ సంస్కృతి గొప్పది
విజయనగరం రూరల్ : భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ఎంతో గొప్పదని జిల్లా విద్యాశాఖాధికారిణి జి.నాగమణి అన్నారు. ఓం మందిరంలో భగవాన్ శ్రీసత్యసాయి ఆరాధన సందర్భంగా వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. శిక్షణ తరగతుల సమన్వయకర్త, ఉపాధ్యాయుడు పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 15 రోజుల పాటు జరిగే తరగతుల్లో వేదం, యోగా, ఆధ్యాత్మిక భజన, జ్యోతి ధ్యానం, ఆరోగ్యం పరిశుభ్రత, భగవద్గీత, మానవత విలువలు, భారతం కథలు, కలియుగ వైకుంఠం, పంచయజ్ఞాలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బాలవికాస్ కో–ఆర్డినేటర్ బి.రమేష్‌కుమార్, కన్వీనర్ సన్యాసినాయుడు, 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
నిరుపేదకు నీడనిచ్చిన ‘ఫేస్బుక్’ మిత్రులు
ధర్మపురి: ఫేస్బుక్ మిత్రుల సాయంతో ఓ నిరుపేదకు నూతన గృహాన్ని నిర్మించగా.. జగిత్యాలకు చెందిన సత్యసాయి అభయహస్తం స్వచ్ఛంద సభ్యులు ధర్మపురి తహసీల్దార్ నవీన్‌కుమార్, సీఐ లక్ష్మీబాబుతో కలిసి బుధవారం ప్రారంభించారు. వెల్గటూర్ మండలం ఎండపెల్లి గ్రామానికి చెందిన నిరుపేద అయిన కుంకునాల పోశవ్వ భర్త సూరయ్య గతంలో అనారోగ్యంతో మృతిచెందాడు. ఓ పూరిగుడిసెలో ఉంటూ.. కూలి పనిచేస్తూ.. ఇద్దరు కుమారులను చదివిస్తోంది. పోశవ్వ దీనస్థితిని ఫేస్బుక్ వేదికగా ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ గత నెల పోస్ట్ చేశాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఫేస్బుక్ మిత్రులు రూ.90 వేలు విరాళం అందించారు. స్థానికులంతా కలిసి మరో రూ.12వేలు అందించారు. పోశవ్వకు సొంతస్థలం లేకపోవడంతో సర్పంచ్ అందుర్థి గంగాధర్ పంచాయతీ తీర్మానంతో కొంత స్థలం కేటాయించారు. దీంతో రమేష్ నూతన గృహాన్ని నిర్మించి అన్ని వసతులు కల్పించారు. కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్ పోశవ్వ కుమారుల చదువు ఖర్చుల కోసం రూ.ఐదువేలు సాయం అందించారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ రవి, ఆర్ఐ గంగాధర్, సామాజిక సేవకులు బోనాల సునీత, పాల్తెపు భూమేశ్వర్, ప్రభుత్వ ఉపాధ్యాయులు వినోద, దహగం గణేష్, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులున్నారు. -
కనీస వేతనం అందని ద్రాక్షే!
- సమస్యల్లో సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు - 20 ఏళ్లుగా పనిచేస్తున్నా ఎదుగూ బొదుగు లేని వైనం ధర్మవరం : ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది..సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేసే కార్మికుల వ్యథ. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా ఎదుగూబొదుగు లేని వేతనాలతో బతుకులీడుస్తున్నారు. ప్రభుత్వ కనీస వేతన జీఓలు (జీఓ ఎంఎస్ 11/2011, జీఓఎంఎస్151/2016)ల ప్రకారం వృత్తితో సంబంధం లేకుండా బతకడానికి కనీస వేతనం ఇవాల్సి ఉంది. అయితే ఈ జీఓలు వారికి వర్తించడం లేదు. తాగునీటి సమస్యను పరిష్కరించాలన్న ఉద్ధేశంతో సత్యసాయిబాబా ప్రారంభించిన సత్యసాయి తాగునీటి పథకం జిల్లాలోని దాదాపు 860 గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. ప్రభుత్వ తాగునీటి పథకాలు పడకేసినా నిత్యం జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మందికి తాగునీటిని అందిస్తోంది. ఈ పథకంలో మొత్తం 600 మంది దాకా కార్మికులు పని చేస్తున్నారు. సత్యసాయి తాగునీటి పథకాన్ని సత్యసాయి ట్రస్ట్ నుంచి 1995లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అదే ఏడాది పథకం నిర్వహణ బాధ్యతలను ఎల్అండ్టీ కంపెనీకి అప్పజెప్పింది. నిర్వహణకు గానూ ప్రతి నెలా ప్రభుత్వం రూ.1.60 కోట్లు ఇస్తోంది. 400 మంది దాకా కార్మికులు ఈ పథకం ప్రారంభం నుంచి పనిచేస్తున్నారు. వీరు తొలినాళ్లలో రూ.900కే పనికి కుదిరి, నేటికీ రూ.9,300కే పని చేస్తున్నారు. ఇన్నేళ్లుగా పనిచేస్తున్నా వారికి మాత్రం కనీస వేతనం దక్కడం లేదు. తమకు కనీస వేతనం అమలు చేయాలని కార్మికులు ఎన్నిసార్లు అందోళనలు చేసినా ఫలితం శూన్యం. యాజమాన్యం పట్టించుకోవడం లేదని, కనీసం గుర్తింపుకార్డులు కూడా ఇవ్వకపోవడంతో కార్మికులు కార్మిక సంక్షేమశాఖకు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును స్వీకరించిన ఆశాఖ విషయాన్ని మరుగునపడేసింది. తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు కనీసం కాంట్రాక్ట్ కార్మికులా, ఔట్సోర్సింగ్ కార్మికులా అని కూడా «ధ్రువీకరించిన పాపాన పోలేదని వాపోతున్నారు. రూ.900తో పనికెక్కా.. పథకం ప్రారంభంలో రూ.900తో పనికి కుదిరా. 20 ఏళ్లుగా పనిచేస్తుంటే ఇప్పుడు కేవలం రూ.9వేలు మాత్రమే వేతనం ఇస్తున్నారు. సర్వీస్ లేదు, ఇంక్రిమెంట్లు లేవు, పనికి తగిన వేతనం లేదు..కనీసం గుర్తింపు కార్డు కూడా లేదు. ఇదేమని అడిగితే యాజమాన్యం పెద్దలతో చర్చించి పెంచుతామంటున్నారు. –భగవాన్, పంప్ ఆపరేటర్, సత్యసాయి తాగునీటి పథకం కనీస వేతనం అమలు చేయాలి జీఓ 151 ప్రకారం కనీసం వేతనం రూ.12వేలు చొప్పున కార్మికులకు వేతనం అందజేయాలి. ఇప్పటికే చాలా సార్లు ఆందోళనలు చేపట్టినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో ఒక్కో కార్మికుడు ఏడాదికి రూ.1.50 లక్షలు నష్టపోతున్నారని, కార్మికశాఖకు ఫిర్యాదు చేశాం. వారు ఫిర్యాదును కనీసం విచారించిన పరిస్థితి కూదా లేదు. అలాగే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా మాకు మాత్రం న్యాయం జరగలేదు. ఉపేంద్ర, సత్యసాయి వాటర్ సప్లై కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు -
ముగిసిన సత్యసాయి జయంతి వేడుకలు
పుట్టపర్తి టౌన్ : వారం రోజుల పాటు సాగిన సత్యసాయి 91వ జయంతి వేడుకలు బుధవారంతో ముగిశాయి. వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరి రోజు భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది సత్యసాయి సేవాదల్ సైతం తరలివచ్చి వేడుకల్లో సేవలను అందించారు. వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో సందడిగా మారిన పుట్టపర్తి బోసిపోయింది. భక్తులు గురువారం స్వస్థలాలకు బయలుదేరడంతో పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్, ప్రశాంతి రైల్వేస్టేషన్ కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆటోలు, టాటాఏస్ వాహనాలు, కార్లకు గిరాకీ ఏర్పడింది. వివిధ క్యాంపస్‌లకు చెందిన సత్యసాయి విద్యార్థుల కోసం ఆర్టీసీ ముద్దనహళ్లి, అనంతపురం, బృందావన్‌కు ప్రత్యేక బస్సు సర్వీసులు కేటాయించారు. -
వైభవం..స్నాతకోత్సవ సంబరం
పుట్టపర్తి టౌన్ : నీలి,ఎరుపు వస్త్రధారులైన విద్యాకుసుమాలు సాయి నామాన్ని స్మరించగా.. వక్తల సందేశాత్మక ప్రసంగాల నడుమ సాయి కుల్వంత్ సభా మందిరంలో జరిగిన సత్యసాయి విద్యా సంబరం వైభవంగా సాగింది. సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 35వ స్నాతకోత్సవం మంగళవారం ప్రశాంతి నిలయంలో ఘనంగా జరిగింది. వేడుకల్లో చాన్సలర్ హోదాలో సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ వెంకటాచలయ్య పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా కేంద్ర సాంకేతిక ప్రధాన సలహాదారు రాజగోపాల చిదంబరం హాజరయ్యారు.చాన్స్‌లర్ వెంకటాచలయ్య యూనివర్శిటీ పరిధిలోని నాలుగు క్యాంపస్‌లలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 24 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, విభిన్న రంగాలలో నిబద్ధతతో కృషి చేసినందుకు నలుగురు విద్యార్థులకు ఆల్‌రౌండర్ గోల్డ్ మెడల్స్, 10 మంది పరిశోధన విద్యార్థులకు పీహెచ్‌డీలను ప్రదానం చేశారు. -
సత్యసాయి జయంతి వేడుకలు
-
నేడు సత్యసాయి గిరిప్రదక్షిణ
పుట్టపర్తి టౌన్ : పట్టణంలో శనివారం సత్యసాయి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. శుక్రవారం నిర్వాహకులు మాట్లాడుతూ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 6.30 గం టలకు ప్రశాంతి నిలయం గణేష్ గేట్ వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సత్యసాయి ఆశీస్సులు పొందాలని వారు కోరారు. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిని కొనియాడుతూ సత్యసాయి విద్యార్థినులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. దసరా వేడుకల్లో భాగంగా శని వారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రశాంతి విద్వాన్ మహాసభ నిర్వహించారు. సత్యసాయి విద్యాసంస్థల అసోసియేట్ ప్రోఫెసర్ రుచిర్ దేశాయ్ ప్రసంగించారు. షిరిడీ సాయి , సత్యసాయి జీవిత చరిత్రలను వివరిస్తూ ప్రసంగించారు. సత్యసాయి విద్యాసంస్థల అనంతపురం క్యాంపస్‌కు చెందిన విద్యార్థినులు సంగీత కచేరి నిర్వహించారు. -
ఘనంగా సత్యసాయి గిరిప్రదక్షిణ
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి గిరి ప్రదక్షిణను భక్తులు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం భక్తులు గిరిప్రదక్షిణ చేపట్టారు. సాయంత్రం ప్రశాంతి నిలయం గణేష్ గేట్ వద్ద సత్యసాయి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలాపనతో గిరిరథాన్ని లాగుతూ భక్తులు ముందుకు సాగారు. గోకులం, ఎనుములపల్లి గణేష్ సర్కిల్, ఆర్వీజేæ పెట్రోల్ బంక్, చింతతోపుల మీదుగా పట్టణంలో ప్రవేశించి తిరిగి గణేష్ గేట్ వద్ద మంగళహారతితో ముగించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ నిర్వహించారు. -
సత్యసాయి తాగునీరు బంద్
మక్తల్ : రైతులకు సాగునీరు అందించేందుకు పంచదేవ్పాడు గ్రామం కృష్ణానదికి భీమా కాల్వ పనులు ముమ్మరంగా పనులు చేస్తున్నారు. పనుల నిర్వహణలో సత్యసాయి పైపులైన్ పగిలిపోవడంతో దాదాపు 15రోజుల నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో మక్తల్ నియోజకవర్గ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టర్ పనులు సకాలంలో చేసి ఉంటే ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఉండేవని, ఆయన నిర్లక్ష్యంతోనే సత్యసాయి తాగునీటి సరఫరా నిలిచిపోయిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. భీమా కాల్వ పనులు చేస్తున్న సమయంలో పైపులు పగిలిపోవడంతో మరో చోట పైపులు ఏర్పాటు చేశారు. కాల్వ పనులు చేస్తున్న సమయంలో నది నుంచి నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో మరోచోట వేసిన రోడ్డు తెగిపోయింది. కాల్వ పనులు పరిశీలించడానికి వచ్చిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి సందర్శించి సత్యసాయి పైపులైన్ విషయం తెలిపినా ఫలితం లేకుండాపోయింది. దీంతో తాగునీటి సరఫరా బంద్ చేయడంతో నియోజకవర్గంలోని 65గ్రామాలకు తాగునీరు నిలిచిపోయింది. ఈ పథకం ఎల్అండ్టీ కంపెనీ ఆదీనంలో 1999నుంచి కొనసాగుతుంది. మక్తల్ మండలం పారేవుల హెడ్‌వర్క్ నుంచి మండలంలోని 25గ్రామాలకు, మాగనూరు మండలంలో 14 గ్రామాలకు, ఊట్కూర్ మండలంలో 7గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. పైప్‌లైన్ పగలడంతో సత్యసాయి తాగునీటిపై ఆధారపడిన గ్రామాలు నీరులేక అల్లాడిపోతున్నాయి. పైపులైన్ నిర్మాణానికి మాత్రం మోక్షం లభించడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాల్వ పనులు చేయడంతో పారేవుల, ముస్లాయిపల్లి, అనుగొండ, గడ్డంపల్లి, అంకేన్‌పల్లి, దాదాన్పల్లి గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు సైతం దారిలేక బంద్ చేశారు. ఈ గ్రామాలకు వెళ్లే ప్రజలు పంచలింగాల, చిన్నగోప్లాపూర్ గ్రామాల మీదుగా వెళ్తున్నారు. కనీసం అనుగొండ, పారేవుల, గడ్డంపల్లి పుష్కరఘాట్లకు రోడ్డు లేకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.