కుగ్రామం నుంచి ఈ కామర్స్ దాకా నారాయణమ్మ విజయగాధ నారాయణమ్మ నీరగంటి... ఆంధ్రప్రదేశ్, సత్యసాయి జిల్లాలోని ముష్టి కోవెల అనే చిన్న గ్రామంలో అత్యంత సామాన్యమైన కుటుంబంలో పుట్టిన మహిళ. చదువంతా ప్రభుత్వ విద్యావ్యవస్థలోనే. ఆమె ఈ రోజు ఒక ‘ఈ కామర్స్’ సంస్థను స్థాపించి తోటి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కావాలనే తన కలను నిజం చేసుకోవడానికి పీహెచ్‌డీలో చేరారు. త్వరలో పట్టానందుకోనున్న నారాయణమ్మ తన ఆకాంక్షల సుమహారాన్ని సాక్షితో పంచుకున్నారు.
డ్వాక్రా దారి చూపింది
‘‘మా నాన్న రైతు. పిల్లల్ని బాగా చదివించాలనే కోరిక మాత్రం బలంగా ఉండేది. ఐదవ తరగతి వరకు మా ఊరి బడిలో చదివాను. ఆరు, ఏడు తరగతులకు ఉదయం ఐదు కిలోమీటర్లు, సాయంత్రం ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. దాంతో అనంతపురంలో ఒక చిన్న గది అద్దెకు తీసుకుని నన్ను, మా అన్నను చదివించారాయన. అలా ఎనిమిదవ తరగతి నుంచి నేను ఇంటిపని, వంట పని చేసుకుంటూ చదువుకున్నాను. అనంతపూర్‌లో డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంబీఏకి ఆళ్లగడ్డ వెళ్లాను. ఆ తర్వాత పెళ్లితో హైదరాబాద్ రావడం నా ఉస్మానియా కల నెరవేరడానికి మార్గం సుగమం చేసింది. అధ్యయనానికి విద్యాసంవత్సరంలో ‘సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ చాలెంజెస్’ అంశాన్ని తీసుకున్నాను.
2010–11 నుంచి రంగారెడ్డి, సత్యసాయి జిల్లాల్లో డ్వాక్రా సంఘాలను అధ్యయనం చేశాను. మొత్తం ఐదు వందల గ్రూపుల కార్యకలాపాలను తెలుసుకున్న తర్వాత గ్రామీణ మహిళల్లో ఉన్న నైపుణ్యాలు, అవకాశాల మీద ఒక అవగాహన వచ్చింది. ఆర్థిక స్వావలంబనను, స్వయంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడాన్ని ఆస్వాదిస్తున్నారు. దాంతో వారిలో ఆత్మవిశ్వాసం కూడా మెరుగైంది. అవకాశాలు అందివస్తే ఇంకా ఏదో సాధించాలనే తపన కూడా కొందరిలో ఉంది. అలాంటి అభిరుచి ఉన్న వాళ్లకు వనరులు, ప్రభుత్వ అధికారుల సహకారం ఉంటే అద్భుతాలు చేయగలుగుతారు కూడా. ఇలాంటి సమన్వయం కొన్ని చోట్ల లేకపోవడం కూడా గమనించాను. మొత్తానికి మార్కెటింగ్ గురించిన ఆందోళన లేకపోతే ఉత్పత్తి విషయంలో శ్రమించడానికి వాళ్లు వెనుకాడరు. నా అధ్యయనం ఇలా సాగుతున్న సమయంలోనే కరోనా వచ్చింది.
కరోనా కొల్లగొట్టింది
కరోనా సమయంలో హోటళ్లతో సహా అన్నీ మూత పడడంతో ఉద్యోగాలు లేక ఏదో ఒక పని దొరికితే చాలన్నట్లు చాలా మంది కనిపించారు. శ్రమించే చేతులున్నాయి, ఆ ఉత్పత్తి అవసరమైన వ్యక్తులున్నారు. వాళ్ల మధ్య కరోనా కరాళ నృత్యం చేస్తోంది. అప్పుడు ఈ కామర్స్ రంగంలో ఓ ప్రయత్నం చేశాను. కర్పూరం తయారీ దారుల నుంచి కర్పూరాన్ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇంటింటికీ చేర్చడంలో విజయవంతమయ్యాను. మీషోలో సరదాగా మొదలు పెట్టిన రీ సేల్ అనుభవమూ తోడైంది. నా మార్కెట్‌ను విస్తరించడానికి శాన్విస్ స్టోర్, భవిత శ్రీ ట్రేడింగ్, ఫ్యాషన్, లేజీ షాపింగ్ వాణిజ్య వేదికలతో సెల్లర్‌గా అమెజాన్‌తో అనుసంధానమయ్యాను. ఆ అనుభవంతో గత ఏడాది నవంబర్‌లో మీథాట్ ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సొంత కంపెనీ ప్రారంభించాను. ఏడాది కోటి రూపాయల టర్నోవర్‌కు చేరుతుందని అంచనా. ఏడాదికి నికర లాభం ఏడెనిమిది లక్షలుండవచ్చు.
గ్రామాలకు విస్తరించాలి
ఇప్పటి వరకు నా నెట్‌వర్క్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అనంతపూర్, చిత్తూరు, గుంటూరు వంటి కొన్ని చోట్లలోనే ఉంది. ఇక గ్రామాల్లో ఉండే డ్వాక్రా మహిళలను అనుసంధానం చేయాలి. ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రాజెక్ట్ గ్రామాల్లో పెట్టాలనేది నా ఆలోచన. ఒక కుటుంబానికి అవసరమైన ప్రతి వస్తువూ నా ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ మీద లభించేటట్లు పటిష్ఠం చేయాలి. అలాగే విదేశాలకు సీమంతం కిట్, ఒడిబియ్యం కిట్, గర్భిణి తినాల్సిన పిండివంటలను ఎగుమతి చేయాలి. ఈ సర్వీస్ ఈ కామర్స్‌లో లేదు. ఈ కామర్స్ వేదిక లైసెన్స్, ట్రేడ్‌మార్క్, కాపీ రైట్స్, పేటెంట్‌లు, ఫుడ్ లైసెన్స్, వెబ్‌సైట్ నిర్మాణం, ప్రమోషన్ కోసం మూడు లక్షల వరకు ఖర్చు చేశాను. ఇవన్నీ ఇందులోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. నా ఈ ప్రయత్నంలో గృహిణులు, ఒంటరి మహిళలు, అరవై నిండిన పెద్దవాళ్లు కూడా ఉపాధి పొందుతున్నారు.
ఉపాధినిస్తోంది
మూడేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత పీహెచ్‌డీ కోసం ఉద్యోగం మానుకున్నాను. ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరతానని అప్పుడనుకోలేదు. లెక్చరర్‌గా భర్త సంపాదనకు తోడు నేనూ ఉద్యోగం చేసుకుంటూ , ఇద్దరమ్మాయిలను పెంచుకుంటూ ప్రశాంతంగా ఉండవచ్చు. కానీ నేను చేసిన ఎంబీయే ఫైనాన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల మీద పీహెచ్‌డీ నన్ను చిన్న పరిధిలో ఉంచడానికి ఇష్టపడలేదు. ఈ సాహసానికి ఒడిగట్టేలా ప్రోత్సహించాయి. మా గైడ్ శ్రీరాములు గారి పర్యవేక్షణలో నా పరిశోధన పూర్తయింది. డాక్టర్ నారాయణమ్మ అనే పేరు నా చిన్నప్పటి కల’’ అన్నారు నారాయణమ్మ. కల నెరవేరు తున్న ఆనందం ఆమె కళ్లలో కనిపించింది, ఆ మాట చెప్తున్నప్పుడు ఆ స్వరంలో ఆనందం తొణికిసలాడింది.
ఎక్కడి ఆర్డర్‌కి అక్కడే పరిష్కారం
ఆహారం మీద ప్రత్యేక దృష్టి పెట్టాను. నగరాల్లో మహిళలందరూ ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారాల్లో నిమగ్నమై ఉంటున్నారు. పిల్లలకు మన రుచులను ఇంట్లో చేసి పెట్టడం వాళ్లకు కష్టమే. అందుకే సౌత్ ఇండియన్ స్నాక్స్ హోమ్‌మేడ్‌వి అందిస్తున్నాను. నా నెట్‌వర్క్‌లో 30కి పైగా మహిళలున్నారు. ఒక ప్రదేశం నుంచి ఆర్డర్ రాగానే అదే ప్రదేశంలో ఉన్న మహిళకు ఫార్వర్డ్ చేస్తాను. మెటీరియల్ కొనుగోలు, ఆమె శ్రమకు వేతనం ఇస్తాను. ఆమె పిండివంటలు తయారు చేసి ప్యాక్ చేసి ఉంచుతుంది. మా కొరియర్ నెట్‌వర్క్ వాళ్లు ఆమె ఇంటికి వెళ్లి పార్సిల్‌ను కలెక్ట్ చేసుకుని కొరియర్ ఆర్డర్ ఇచ్చిన వినియోగదారులకు చేరుస్తారు. దాంతో పిండివంటలు తయారు చేసిన రోజే అందుతుండడంతో బాగా క్లిక్ అయింది.
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment