జిల్లా కలెక్టర్లకు చంద్రబాబు సర్కారు ఆదేశాలు
డ్వాక్రా మహిళల నుంచి కూడా బలవంతపు వసూళ్లు
ముఖ్యమంత్రి ఆదేశాలంటూ గ్రూపునకు రూ.500 నుంచి రూ.వెయ్యి టార్గెట్
‘‘అందరికీ నమస్తే.. అమ్మా పక్కన పెట్టిన తీర్మానాన్ని ప్రతి గ్రూపులోని వారి పొదుపు ఖాతాల నుంచి సమాఖ్యలకు రూ.500 తగ్గకుండా ట్రాన్స్‌ఫర్ చేయించాలి. ఈ మొత్తం అమౌంట్‌ను టీఎల్‌ఎఫ్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించాలి’’. .. ఇది డ్వాక్రా సంఘాలకు వీఓఏలు, ఆర్‌పీల నుంచి వస్తున్న మెసేజ్‌లు. ఈ తంతు అంతా ఏదో వారికి మేలు చేసేందుకో లేక ఆదుకునేందుకో కాదు. చంద్రబాబు ప్రభుత్వంలో వరద బాధితులకు సాయమందించేందుకు చేస్తున్న నయా దందా ఇది. – సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి ప్రతినిధి, బాపట్ల/తాడికొండ
నిజానికి.. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ప్రజలు నష్టపోతే ఎక్కడైనా ప్రభుత్వాలు తక్షణం స్పందిస్తాయి. బాధితులను అన్ని విధాలా ఆదుకునే ప్రయత్నం చేస్తాయి. పెద్దస్థాయిలో నష్టం జరిగితే ఆరి్థకంగా లేదా ఇతరత్రా పూర్తిస్థాయిలో సహాయం అందించి ఆదుకోలేకపోయినా.. తక్షణ సాయంతో ఉపశమనం కలిగించి తామున్నామన్న భరోసా ఇవ్వాలి.. చేయగలిగినంత చేయాలి. ఇది ప్రభుత్వం బాధ్యత.
కానీ, సీఎం చంద్రబాబు ప్రభుత్వం బాధితులను ఆదుకోవడం సంగతి పక్కనబెట్టి దాని పేరున చందాలు వసూలుకు తెరలేపింది. దీనికి విరాళాలు అని ముద్దుపేరు పెట్టి చంద్రబాబు అండ్ కో వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టారు. గతంలో అమరావతి నిర్మాణానికి చందాలు, ఇటుకలు అంటూ చేస్తే ఇటీవల అన్న క్యాంటీన్లను ప్రారంభించి వాటికీ విరాళాలు వసూలుచేస్తున్నారు.
ఇప్పుడు వరదల నేపథ్యంలో.. చందాలు వసూలు చేసే బాధ్యతను ప్రభుత్వం ఏకంగా కలెక్టర్ల నెత్తిన పెట్టడంతోపాటు డ్వాక్రా సంఘాలనూ వసూలుచేసి ఇమ్మంటూ బెదిరింపులకు దిగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇదిలా ఉంటే.. బాపట్ల జిల్లాలోని వేమూరు, రేపల్లెతోపాటు పలు ప్రాంతాల్లో వరదలొచ్చి వారం గడిచినా ప్రభుత్వ అధికారులు వచ్చి చూసిన పాపాన పోలేదు. పరిహారం కింద దేనికి ఎంతిస్తారో చంద్రబాబు నోరు విప్పడంలేదు. అసలిస్తారో లేదో తెలీడంలేదు.
ఒక్కో ‘సంఘం’ రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు..
మరోవైపు.. రాష్ట్రంలో దాదాపు 9 లక్షలకు పైగా పొదుపు సంఘాలు ఉండగా.. పది మంది సభ్యులుండే ఒక్కో సంఘం రూ.500 నుంచి రూ.1,000 వరకు వెంటనే ఫోన్‌పే ద్వారా లేదంటే నగదు రూపంలో గ్రామ సమాఖ్యలకు లేదా పొదుపు ఖాతాల్లో నుంచి ఎస్‌ఎఫ్‌ఎల్ ఖాతాల్లోకి తప్పనిసరిగా అందజేయాలని అధికారులు ఫోన్లలో స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. పొదుపు సంఘాల మహిళలు గ్రూపుల వారీగా వాళ్ల గ్రామ సమాఖ్యకు.. గ్రామ సమాఖ్యల నుంచి జిల్లాల వారీగా జిల్లా సమాఖ్యలు, వారి నుంచి రాష్ట్ర సమాఖ్య ఒకే మొత్తంగా నిధులు పోగుచేసి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా సీఎం సహాయ నిధికి చెక్ రూపంలో సీఎంకు అందజేయాలని అధికారులు నిర్ణయించారు.
ముఖ్యమంత్రి నుంచి అందిన సూచనల ప్రకారం.. సీఎం సహాయక నిధికి ఏయే పొదుపు సంఘాల్లో ఎవరెవరు ఇవ్వలేదో, వారి పేర్లను నమోదు చేసుకుంటామని, ఇవ్వనివారికి రిమార్కు రాస్తామంటూ అధికారులు ఫోన్లలోనే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. రిమార్కులు రాస్తే భవిష్యత్‌లో పొదుపు సంఘాల మహిళలు ఇబ్బందిపడతారని కూడా హెచ్చరిస్తున్నట్లు మంగళగిరి మండలం నూతక్కి పొదుపు మహిళలు వాపోతున్నారు.
ఇదిలా ఉంటే.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని 1,259 డ్వాక్రా గ్రూపుల నుంచి మొత్తం రూ.6,29,600 వసూలుచేసి ఇచ్చినట్లు ఏపీఎం నాగేశ్వరరావు తెలిపారు. ఇక గత జులైలోనూ రాజధాని అమరావతి నిర్మాణం కోసమంటూ పొదుపు సంఘాల మహిళల నుంచి బలవంతపు వసూళ్ల కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.
కలెక్టర్లకు చందాల బాధ్యతలు..
వరద పేరుచెప్పి ప్రజల నుంచి చందాలు వసూలుచేయమని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లను పురమాయించింది. దీంతో.. బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి ‘జిల్లా కలెక్టర్ రిలీఫ్ ఫండ్, బాపట్ల’ పేరుతో ఒక యూనియన్ బ్యాంకు ఖాతా (నంబర్ 003712010002548) తెరిచారు. ఈ నెంబర్‌కు లేదా క్యూఆర్ కోడ్ ద్వారా చందాలు పంపాలని కోరారు. వ్యక్తిగతంగా లేదా స్వచ్ఛంద సంస్థలు చందాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం నిధులిస్తే ప్రజలకు సాయమందించాల్సిన కలెక్టర్‌కు జనం నుంచి చందాలు వసూళ్లు చేసే కార్యక్రమం కట్టబెట్టడంపై అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదేం ఖర్మరా బాబూ.. అంటూ తలలు పట్టుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవహారం చూస్తే జిల్లాలో వచ్చే చందా వసూళ్లను బట్టి వరద బాధిత ప్రజలకు పరిహారం ఉంటుందేమోనన్న అనుమానాలు బాధితులు వ్యక్తంచేస్తున్నారు.
గతంలో ఎప్పుడూ ఇలాలేదు..
గతంలో రాష్ట్రంలో పలుమార్లు వరదలు వచ్చినా ఏనాడూ ప్రభుత్వం డ్వాక్రా మహిళలను చందాలు అడిగిన దాఖలాల్లేవని.. ప్రభుత్వమే అన్ని రకాలుగా ఆదుకునేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కానీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొత్త రకం దందాకు తెరలేపడంపట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కూలీ నాలీ చేసుకుని కాలం వెళ్లదీస్తున్న పేద మహిళల దగ్గర బలవంతంగా వసూళ్లు చేయడమేమిటని మండిపడుతున్నారు. అయినా, ఫోన్‌పే నంబర్లకు నగదు వేయాలంటూ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని మహిళలు ప్రశి్నస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment