సాక్షి, తిరుపతి: టీడీపీ నేతలు అడ్డూ అదుపులేకుండా పోతోంది. తిరుపతి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదుకు డ్వాక్రా మహిళలకు టీడీపీ నేతలు వాయిస్ మెసేజ్‌లు చేస్తూ బరితెగించేశారు. రూ.100తో టీడీపీ సభ్యత్వ నమోదు, సీఎంఆర్‌ఎఫ్, రూ.5 లక్షల ఉచిత ప్రమాద బీమా వర్తిస్తుందంటూ ప్రచారం మొదలుపెట్టారు. స్వయం ఉపాధి డ్వాక్రా మహిళలను టీడీపీ నేతల ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు.
టీడీపీ నేతల సభ్యత్వ నమోదు వైరల్‌గా మారింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇదే వైఖరి టీడీపీ అవలంభిస్తోంది. 2 రోజులే గడువు ఉందంటూ డ్వాక్రా గ్రూప్‌లో ప్రచారం చేస్తున్నారు. టీడీపీ సభ్యత్వం తీసుకుంటేనే సంక్షేమ పథకాలంటూ డ్వాక్రా సంఘాలను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు.
అధికారుల సాక్షిగా.. తమ్ముళ్ల దాష్టీకం!
భాకరాపేట: అధికారం ఉంది కదా అని ప్రభుత్వ అధికారులు.. పోలీసుల సాక్షిగా తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రైతులతోపాటు పంట పొలాలపై దాడికి తెగబడ్డారు. అన్నదాతలపై ప్రతాపం చూపారు. పట్టా భూమిలో కాలువ, కాలినడక బాట ఉందంటూ అర్ధరాత్రి పచ్చని చెట్లను నరికివేశారు. పంట పొలాల చుట్టూ ఏర్పాటు ఏర్పాటుచేసిన కంచెను జేసీబీలతో పెకలించేశారు. పట్టా భూమిలో దౌర్జన్యం చేస్తున్న వారికి కోర్టు ఉత్తర్వులు చూపించేందుకు వచ్చిన రైతులపై దాడిచేశారు. సాక్షాత్తు ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఓ రైతుకు చెందిన పట్టా భూమిలో టీడీపీ నేతలు దౌర్జన్యంగా రోడ్డు ఏర్పాటు చేశారు.
కళ్లముందు రైతులపై టీడీపీ నేతలు దాడి చేస్తున్నా పోలీసులు చూస్తుండిపోయారు. ఇదంతా ఎక్కడో కాదు ముఖ్యమంత్రి స్వగ్రామం ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. చిన్నగొట్టిగల్లు మండలం దిగవూరు రెవెన్యూ గ్రామం మట్లువారిపల్లెలో శుక్రవారం రాత్రి జరిగింది. బాధితులు, స్థానికుల వివరాల మేరకు.. దిగవూరు రెవెన్యూ లెక్క దాఖలు 182, 183 సర్వే నంబర్లులో విశ్రాంత అధ్యాపకుడు దొడ్డిపల్లి రాజారెడ్డికి దాదాపు 12.5 ఎకరాల వారసత్వ ఆస్తి ఉంది. ఈ భూమికి ఆనుకుని ఉన్న కాలినడక వదలివేసి కంచె వేసుకున్నానని రాజారెడ్డి చెబుతున్నారు.
తమకు చెందిన భూమిలో ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి లేదని, పొలంలో వర్షపు నీరు వెళ్లడానికి చిన్న కాలువ తీసుకుంటే అదే కాలువను బండిబాటగా వేయాలని టీడీపీ నాయకులు వచ్చి తనను, తన సోదరుడు సుధాకర్‌రెడ్డిని చితకబాదినట్లు రాజారెడ్డి తెలిపారు. సుధాకర్‌రెడ్డి సెల్‌ఫోన్ ధ్వంసం చేశారని తెలిపారు. ఇదంతా భాకరాపేట ఎస్‌ఐ, పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా.. వారు ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన పొలానికి వేసుకున్న రెండు గేట్లు తొలగించి, వారికి ఇష్టం వచ్చినట్లు ఎక్కడబడితే అక్కడ కంచెను తొలగించి దారి ఏర్పాటు చేసుకున్నారన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు మొరపెట్టుకున్నా తమ గోడు కూడా వినలేదని దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తన పొలం తనకు అప్పగించి న్యాయం చేయాలని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment