అనంతపురం రూరల్: గ్రామీణ తపాలా ఉద్యోగులను డిపార్ట్‌మెంట్ ఉద్యోగులుగా గుర్తించాలన్న డిమాండ్‌తో ఈ నెల 16నుంచి సమ్మెకు దిగుతున్నట్లు తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు క్రిష్ణయ్యయాదవ్ తెలిపారు. సమ్మెకు సంబంధించిన పోస్టర్లను బుధవారం హెడ్ పోస్టాఫీసులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం గ్రామీణ తపాలా ఉద్యోగుల స్థితిగతులపై అధ్యయనం చేసిన కమలేష్ చంద్ర కమిటీ రిపోర్టును అమలు చేయకుండా తపాలా ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామీణులకు అందించడంలో కృషి చేస్తున్న గ్రామీణ తపాలా ఉద్యోగులకు తక్కువ వేతనం ఇస్తూ వెట్టిచాకిరి చేయిస్తున్నారన్నారు. మెరుగైన వేతనంతోపాటు పెన్షన్ సదుపాయం కల్పించానలి డిమాండ్ చేశారు. సమ్మెలో ఉద్యోగులంతా యూనియన్లకు అతీతంగా పాల్గొనాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో తపాలా ఉద్యోగ సంఘాల నాయకులు వెంకటేశ్వర్లు, నాగేశ్వర్, చంద్రమోహన్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.